Wednesday, September 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపురోగతి లేని చర్చలు

పురోగతి లేని చర్చలు

- Advertisement -

నేడు సీఎస్ తో ఉద్యోగుల సమావేశం : టీజీఈజేఏసీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతల సమావేశం మరోసారి వాయిదా పడింది. ముందుగా నిర్దేశించిన ప్రకారం మంగళవారం సాయంత్రం 6 గంటలకు సమావేశం కావాల్సి ఉంది. సమావేశం కోసం సచివాలయంకు వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. అదే సమయంలో సోమవారం నాటి సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు ముందుపెట్టిన డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కతోనూ ప్రధానంగా 4 డిమాండ్లపై సీఎస్ చర్చించినట్టు తెలిపారు. అనంతరం సీఎస్ సంజయ్ జాజు టీజీఈజేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావుకు ఫోన్ ద్వారా బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జేఏసీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే, నాలుగు ప్రధాన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్టు ప్రాథమికంగా సమాచారమిచ్చినట్టు నేతలు మీడియాకు వెల్లడించారు.

ఈ అంశాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను బుధవారం సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారికంగా వెల్లడిస్తారని వారు తెలిపారు. దశలవారీగా చేపట్టిన ఆందోళనా కార్యక్రమాల అనంతరం టీఈజేఏసీ సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ కు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చర్చలకు సిద్ధమనీ, అసెంబ్లీ సమావేశాల తర్వాత 18న సమావేశం నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో చలో హైదరాబాద్ ను తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే అసెంబ్లీ సమావేశాలు కొనసాగడంతో ఈ నెల 21న సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పీఆర్సీ అమలు, పెండింగ్ డీఏల చెల్లింపు, సీపీఎస్ రద్దు – ఓపీఎస్ పునరుద్ధరణ, ఉద్యోగులు, పెన్షనర్ల బకాయిలకు ప్రతి నెలా రూ.2,000 కోట్లు విడుదల చేసి అందులో ఉద్యోగులకు 50 శాతం, పెన్షనర్లకు 50 శాతం ఇవ్వాలని ప్రధాన డిమాండ్లను ముందుపెట్టారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు గంటన్నర సేపు జరిగిన సమావేశంలో ప్రధానంగా ఈహెచ్ఎస్ అమలుతో పాటు 4 డిమాండ్లను సీఎస్ ముందుపెట్టిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -