నిమ్స్ అదనపు సూపరింటెండెంట్ ఇంట్లో తనిఖీలు
ఏకకాలంలో 13 ప్రాంతాల్లో దాడులు
భారీగా ఆస్తుల గుర్తింపు!
నవతెలంగాణ-బంజారాహిల్స్
నిమ్స్ వైద్యులు, అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి నిమ్స్ ఆస్పత్రిలోని ఆయన కార్యాలయం, ఎర్రగడ్డ కల్పతెరువులోని నివాసంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 13 బృందాలు ఏకకాలంలో దాడులు చేశాయి. సుమారు 12 గంటలకు పైగా కొనసాగిన సోదాల్లో విలువైన ఆస్తులను ప్రాథమికంగా గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాల్లో బ్యాంకు ఖాతాల్లో రూ.41 లక్షలకు పైగా నిల్వలు, పోస్టాఫీసులో రూ.12 లక్షలు, ప్రయివేటు ఆర్థిక సంస్థల్లో రూ.35 లక్షలు, మ్యూచువల్ ఫండ్లలో రూ.29.50 లక్షల పెట్టుబడులు ఉన్నట్టు గుర్తించారు. సుమారు అర కిలో బంగారు ఆభరణాలు, జాగ్వార్, ఆడి, టాటా నెక్సాన్ సహా నాలుగు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలను గుర్తించారు. వివాదంలో ఉన్న ఓ భూమి కోసం రూ.1.30 కోట్లకుపైగా పెట్టుబడి పెట్టినట్టు, సన్నిహితులకు రూ.1.33 కోట్లకుపైగా అప్పుగా ఇచ్చినట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కూకట్‌పల్లి, మణికొండలోని గేటెడ్ కమ్యూనిటీల్లో ఐదు నాలుగు, మూడు పడక గదుల ఫ్లాట్లు, యాదాద్రి, నందిగామ, శామీర్‌పేట్ ప్లాట్లు, విశాఖపట్నంలో 800 గజాల ఖాళీ స్థలాలు ఉన్నాయి. నిమ్స్ ఆస్పత్రిలోని లక్ష్మీ భాస్కర్ ఛాంబర్‌లో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మరిన్ని వివరాల కోసం పరిశీలన కొనసాగుతోందని ఏసీబీ అధికారులు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. నిమ్స్‌లో లక్ష్మీభాస్కర్ 20 ఏండ్లుగా పని చేస్తున్నారు. ఐదేండ్లుగా డిప్యూటీ సూపరింటెంటెండ్‌గా విధులు నిర్వహిస్తున్నారు.



