వారిపై క్రిమినల్ చర్యలు వద్దు
మత విశ్వాసాల కారణంగా పాడని వారికీ రాజ్యాంగ రక్షణ ఉండాలి
రెండు వారాల్లో స్పందించాలని కేంద్రానికి సుప్రీం ఆదేశం
ఓటర్లకు యాంత్రికంగా నోటీసులా?
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
వందేమాతరం పాడకపోవడం నేరం కాదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వందేమాతరం గీతంలోని అన్ని చరణాలను పాడని వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోరాదని పేర్కొంది. ముఖ్యంగా మత విశ్వాసాలు, మనస్సాక్షి కారణంగా జాతీయ గీతం లేదా జాతీయ గేయాన్ని పాడేందుకు నిరాకరించే వ్యక్తులకు రాజ్యాంగ పరిరక్షణ ఉండాలని పేర్కొంది. 1986లో సుప్రీంకోర్టు ఇచ్చిన ‘బిజోయ్ ఇమ్మాన్యుయేల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ తీర్పులో వ్యక్తమైన మనస్సాక్షి స్వేచ్ఛకు సంబంధించిన న్యాయ సూత్రం ఇప్పటికీ అమల్లోనే ఉందని స్పష్టం చేసింది. 1971 నాటి జాతీయ గౌరవానికి అవమానాలను నివారించే చట్టానికి 2026లో చేసిన సవరణ రాజ్యాంగబద్ధతను కర్నా టక సంగీత విద్వాంసుడు, రామన్ మెగసెస్ అవార్డు గ్రహీత టి.ఎం. కృష్ణ సవాలు చేశారు. ఈ పిటిషన్ను మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్పై రెండు వారాల్లో స్పందించాలని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.
వందేమాతరాన్ని జాతీయ గేయంగా గుర్తించాలా? ఆ గేయాన్ని రెండు చరణాలతో పాడాలా? లేక ఆరు చరణాలతో పాడాలా? అనే అంశాలపై తాము నిర్ణయం తీసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. జాతీయ చిహ్నాలు, వాటికి సంబంధించిన విధానాలను నిర్ణయించడం ప్రభుత్వ పరిధిలోని అంశమని పేర్కొంది. అయితే, అలాంటి నిర్ణయానికి క్రిమినల్ శిక్షను జతచేసి, మతపరమైన లేదా మనస్సాక్షి కారణాలతో గానం చేయని వ్యక్తిని శిక్షించవచ్చా? అనే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపింది. 1986లో సుప్రీంకోర్టు ఇచ్చిన బిజోయ్ ఇమ్మాన్యుయేల్ తీర్పు ఈ కేసులో ప్రధాన ఆధారంగా మారింది. జాతీయ గీతం పాడేటప్పుడు గౌరవప్రదంగా నిలబడినా, తమ మత విశ్వాసాల కారణంగా పాడని విద్యార్థులను శిక్షించడాన్ని అప్పట్లో సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. మనస్సాక్షి స్వేచ్ఛకు రాజ్యాంగం కల్పించిన రక్షణను ఆ తీర్పు గుర్తించింది. అదే సూత్రం వందేమాతరం విషయంలోనూ వర్తించాల్సి ఉంటుందని పిటిషనర్ వాదించారు.
ఆరు చరణాల గానంపై అభ్యంతరం
కేంద్ర హోంశాఖ 2026లో జారీ చేసిన ఆదేశాల్లో నిర్దిష్ట ప్రభుత్వ, అధికారిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో వందేమాతరం పూర్తి ఆరు చరణాలను ఆలపించాలని పేర్కొన్నట్లు పిటిషన్ తెలిపింది. అనంతరం జాతీయ చిహ్నాలకు సంబంధించిన చట్టాన్ని సవరించి, జాతీయ గీతం లేదా జాతీయ గేయం పాడటాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం, గానం చేస్తున్న సభకు అంతరాయం కలిగించడం నేరంగా పరిగణించేలా నిబంధనలు తీసుకొచ్చారు. దీనికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది ఎస్. మురళీధర్ వాదిస్తూ, పూర్తి ఆరు చరణాలను తప్పనిసరిగా పాడేలా చేయడం వల్ల వ్యక్తి మత స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులకు భంగం కలిగే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా చివరి నాలుగు చరణాల్లో దుర్గ, లక్ష్మి, సరస్వతి వంటి హిందూ దేవతలకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయని పేర్కొన్నారు. “జాతీయ గీతం అంటే ఏమిటో ఈ చట్టం నిర్వచించలేదు. ఇది చట్టంలో ఒక తీవ్రమైన లోపం. దీనిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యాలయ మెమోరాండం గెజిట్లో కూడా ప్రచురించలేదు. అది ఏ నిబంధన కింద జారీ చేశారో నాకు అర్థం కావడం లేదు. వారు ఏ నిబంధననూ ఉదహరించలేదు. కేవలం ఒక కార్యాలయ మెమోరాండం జారీ చేశారు” అని ఆయన అన్నారు. శిక్షా చట్టం అస్పష్టంగా ఉండకూడదని ఆయన నొక్కిచెప్పారు.
“ఇది ఒక శిక్షా చట్టం. శిక్షా చట్టంలో అస్పష్టతకు తావు లేదు. ఆ చట్టంలో జాతీయ గీతం అంటే ఏమిటో కూడా మీరు నిర్వచించకుండానే, దాన్ని శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తున్నారు” అని మురళీధర్ అన్నారు. దీనికి జస్టిస్ బాగ్చి స్పందిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఎలో కూడా జాతీయ గీతం గురించి ప్రస్తావించలేదు. ఆచారాలు, సంప్రదాయాల ప్రకారం, రెండు చరణాలతో కూడిన వందేమాతరంనే జాతీయ గీతంగా ఎల్లప్పుడూ పేర్కొంటూ, అర్థం చేసుకుంటూ వస్తున్నారు. దాదాపు 80 ఏళ్లుగా ప్రజలను ఆ పాటలోని రెండు చరణాలను మాత్రమే పాడాలని, ఎలాంటి మార్పు అయినా ఏకాభిప్రాయంతో మాత్రమే రావాలని చెబుతూ వచ్చారని మురళీధర్ సమర్పించారు. జాతీయ గీతం పాడనందుకు శిక్షాత్మక పరిణామాలు ఉండకూడదని కూడా ఆయన అన్నారు. “కాబట్టి దాదాపు 80 ఏండ్ల తరువాత తొలిసారిగా, ఇది రెండు చరణాల విషయం కాదని వారు మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకే, మీరు ‘జాతీయ’ అనే విశేషణం ఉపయోగించినప్పుడు, కొంత ప్రజాభిప్రాయాన్నితీసుకోవాల్సి ఉంటుంది” అని ఆయన అన్నారు.
‘నక్సలైట్’ వ్యాఖ్యపై తీవ్ర అభ్యంతరం
విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన ‘నక్సలైట్’ వ్యాఖ్యపై సీనియర్ న్యాయవాది ఎస్. మురళీధర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యను ఉపసంహరించుకోవాలని కోరారు. అయితే తాను చేసిన వ్యాఖ్యకు క్షమాపణ చెప్పబోనని సొలిసిటర్ జనరల్ స్పష్టం చేశారు. ఈ అంశంపై కోర్టులో వాగ్వాదం చోటుచేసుకుంది.
సీనియర్ న్యాయవాది మురళీధర్ వాదిస్తూ ‘‘చరిత్ర రాజ్యాంగ నిర్ణయాలను నిర్దేశించదు. ఆదర్శవంతంగా, ఈ విషయాలు ప్రజాభిప్రాయం ఏర్పడటంతో పరిణామం చెందాలి. అందుకే, నేను చట్టాల రూపకల్పన ప్రక్రియ అనే పెద్ద విషయం గురించే మాట్లాడుతున్నాను’’ అని అన్నారు. దీనికి ఎస్జి మెహతా స్పందిస్తూ ‘‘నచ్చని వారు పార్లమెంటులో అభ్యంతరం తెలిపారు. ఇప్పుడు దాన్ని ఇక్కడికి తీసుకువస్తున్నారు. పార్లమెంటు రాజ్యాంగం ప్రకారం నిర్ణయాలు తీసుకుంటుంది. నక్సలైట్లు నిర్ణయించే పద్ధతిలో కాదు’’ అని అన్నారు. ‘నక్సలైట్’ అనే పదాన్ని వాడటాన్ని మురళీధర్ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘సొలిసిటర్ జనరల్ చేసిన ఈ వ్యాఖ్య ప్రత్యక్ష ప్రసారం కావడం నాకు ఇష్టం లేదు. నేను తీవ్రంగా అభ్యంతరం తెలుపుతున్నాను. ఒక న్యాయాధికారి ఇలాంటి మాటలు ఎందుకు ఉపయోగిస్తున్నారు? అది ఒక న్యాయాధికారికి తగనిది.
ఏ న్యాయాధికారి కూడా ఇలాంటి మాటలు ఉపయోగించడం నేను ఎప్పుడూ వినలేదు’’ అని మురళీధర్ అన్నారు. ఆ పదం వాడకాన్ని రికార్డులోకి తీసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘‘మేము కేవలం చట్టపరమైన అంశానికి, స్వచ్ఛమైన రాజ్యాంగ వ్యాఖ్యానానికి మాత్రమే పరిమితం అవుతున్నాము’’ అని ధర్మాసనం పేర్కొంది. అయితే, ఎస్జీ మెహతా స్పందిస్తూ ‘‘నేను చెప్పినదాన్నే మళ్ళీ చెబుతున్నాను. నిర్ణయాలు తీసుకునేది పార్లమెంట్. అదే రాజ్యాంగబద్ధమైన మార్గం అని నేను చెబుతున్నాను. నక్సలైట్లు కోరుకునేది అది కాదు. అందుకు నేను చింతించడం లేదు’’ అని అన్నారు. దీనికి సీనియర్ న్యాయవాది మురళీధర్ స్పందిస్తూ ‘‘ఆయన మళ్ళీ అదే విషయాన్ని పునరావృతం చేస్తున్నాడు. నేను ఇప్పుడు నా తీవ్ర నిరసనను తెలియజేయబోతున్నాను. ఇది కేవలం ప్రజలను మెప్పించే ప్రయత్నం’’ అని అన్నారు. దీనికి ఎస్జి మెహతా ఇలా అన్నారు. ‘‘లేదు, లేదు, నేను ఎవరినీ వ్యక్తిగతంగా నిందించడం లేదు. నేను సిద్ధాంతం గురించే మాట్లాడుతున్నాను’’ అని అన్నారు. సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే జోక్యం చేసుకుని ఆలోచించడం అంటే నక్సలైట్ అవ్వడం కాదని హితవు పలికారు.
జాతీయ గేయం ఏది’ అన్నది రాష్ట్ర పరిధిలోనే
జాతీయ గేయం ఏది? దానిలో ఎన్ని చరణాలను అధికారికంగా పాడాలి? అనే అంశాలను నిర్ణయించడం ప్రభుత్వ పరిధిలోనే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఆ నిర్ణయాన్ని పాటించని వ్యక్తికి క్రిమినల్ శిక్ష విధించే అంశం మాత్రం న్యాయపరిశీలనకు లోబడి ఉంటుందని తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25, 26 హక్కులకు భంగం కలుగుతోందని భావించే వ్యక్తి లేదా మనస్సాక్షి కారణంగా నిరాకరించే వ్యక్తి క్రిమినల్ చర్యలకు గురి కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
లౌకికవాదం ఇంత సంకుచితంగా ఉండకూడదు
కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా లౌకికవాదం ఇంత సంకుచితంగా ఉండకూడదని అన్నారు. ఈ పిటిషన్ సంచలనం సృష్టించే అవకాశం ఉందని పేర్కొంటూ, ప్రభుత్వానికి అధికారిక నోటీసు జారీ చేయవద్దని కోరారు. “నాకు ఒక కాపీ ఇవ్వండి. ఈ ప్రకటన ఒక సంచలనాన్ని సృష్టిస్తుంది. అదే దీని ఉద్దేశ్యంగా కనిపిస్తోంది” అని అన్నారు. పిటిషనర్ దేశానికి నైతిక సంరక్షకుడిగా వ్యవహరించలేరని మెహతా అన్నారు. పిటిషనర్ కేవలం జనాలను మెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని, పార్లమెంటు చేసిన చట్టం రాజ్యాంగబద్ధమైన మార్గాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.



