పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో పనులు
నవతెలంగాణ – ఆత్మకూర్
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేరు మార్చి అమలు చేస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ ఆజీవిక మిషన్ (వీబీ-జీ రామ్ జీ) పథకం ఆత్మకూర్ మండలంలో సిబ్బంది కొరతతో నెట్టుకొస్తోంది. మండల పరిధిలో మొత్తం 13 గ్రామ పంచాయతీలు ఉండగా ప్రతి పంచాయతీకి ఒక ఫీల్డ్ అసిస్టెంట్ చొప్పున 13 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం కేవలం 9 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోపక్క అధికారులు మాట్లాడుతూ పై నుండి ఆదేశాలు రాకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్లను నియమించడం లేదన్నారు.
4 ఏళ్లుగా ఖాళీగానే..
తిప్పడంపల్లి, బాలకృష్ణాపూర్, తూంపల్లి, దేవరపల్లి గ్రామ పంచాయతీలలో దాదాపు నాలుగు సంవత్సరాల నుండి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఈ ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పనులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి.
కార్యదర్శులు, మేట్లతో నెట్టుకొస్తున్న యంత్రాంగం
ఫీల్డ్ అసిస్టెంట్లు లేని గ్రామాల్లో ప్రస్తుతం పనులన్నీ గ్రామ పంచాయతీ కార్యదర్శుల పర్యవేక్షణలో, సీనియర్ మేట్ల ద్వారా కొనసాగుతున్నాయి. కార్యదర్శులకు ఇప్పటికే పంచాయతీ పరిపాలన, సచివాలయ బాధ్యతల ఒత్తిడి ఉండగా, అదనంగా ఉపాధి పనుల భారం మోపడం వల్ల ఏ పనిపైనా పూర్తిగా దృష్టి పెట్టలేకపోతున్నారని ఆరోపణలు వస్తున్నాయి
వెంటనే భర్తీ చేయాలి
ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేసి, పూర్తిస్థాయి నియామకాలు చేపట్టాలని మండల ప్రజలు, ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



