అమెరికా రాజధాని వాషింగ్టన్ డిసి, ఆర్థిక రాజధాని న్యూయార్క్, ప్రపంచ సినిమా హాలీవుడ్ రాజధాని లాస్ ఏంజల్స్. ఇప్పుడు ఈ నగరంపై ముట్టడికి అమెరికా మిలిటరీలోని నేషనల్ గార్డ్స్, మెరైన్లను అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దించాడు. 1965లో పౌరహక్కుల ప్రదర్శకులను అడ్డుకొనేం దుకు అలబామా రాష్ట్రానికి అక్కడి ప్రభుత్వ అనుమతి లేకుండా నాటి అధ్యక్షుడు లిండన్ జాన్సన్ కూడా ఇదే మాదిరి మిలిటరీని పంపాడు, ఆ తరువాత ఇదే ప్రథమం. అక్రమ వలసదారులను ఏరివేసే పేరుతో ఇమ్మిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ (ఐసీఈ) సిబ్బంది నగరమంతటా వందలాది మందిని అరెస్టు చేయటాన్ని జనం నిరసిస్తున్నారు. వారిని అణచివేసేందుకు శనివారం నాడు రెండువేల మంది మిలిటరీ నేషనల్ గార్డులను పంపిన ట్రంప్ సోమవారం నాడు మరో రెండు వేల మందితో పాటు, 700 మంది మెరైన్లను కూడా రంగంలోకి దించాడు. తమ అధికారాన్ని అతిక్రమించి మిలిటరీని దించటాన్ని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ న్యూసమ్ కోర్టులో సవాలు చేశాడు. నిరసనలను తెలుపుతున్నవారి సమీపంలో ఉన్న జర్నలిస్టులను మిలిటరీ దూరంగా తరిమేస్తోంది. ప్రజా ప్రతినిధులను కూడా ఆ ప్రాంతాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నది. తమ అధ్యక్షుడు వెనక్కు తగ్గేది లేదని ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ మరింతగా రెచ్చగొడుతూ ప్రకటించాడు. విదేశీ వ్యతిరేకత, ఉన్మాదాలను రెచ్చగొడు తున్నారు. లాటినోలు ఎక్కువగా ఉన్న పారామౌంట్ వంటి చోట్ల నిరసనలు పెద్ద ఎత్తున చెలరేగాయి. స్థానికంగా ఎక్కడైనా శాంతిభద్రతల సమస్య తలెత్తినపుడు అమెరికాలో మిలిటరీని దించటం అసాధారణం. అలాంటిది కేవలం నిరసన ప్రదర్శనలు జరిగిన వెంటనే ట్రంప్ తీసుకున్న ఈ అసాధారణ చర్య ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.
ట్రంప్ ప్రాజెక్టు 2025పేరుతో అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాల్లో భాగంగా అధికారంలోకి రాగానే అనేక అంశాల్లో వేలు పెట్టాడు, సాధారణ భాషలో చెప్పాలంటే కెలికాడు. అక్రమంగా వలస వచ్చిన వారిని స్వదేశాలకు పంపాలి లేకపోతే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని ఇచ్చిన ఆదేశాలతో లాస్ ఏంజల్స్ నగరం ఇప్పుడు ఆందోళనలతో అట్టుడుకుతోంది. న్యూయార్క్ నగరంలో వలస వచ్చిన కుటుంబాలకు చెందిన వారు 59లక్షల మంది ఉండగా తరువాత స్థానంలో 4లక్షల మందితో ఈ లాస్ ఏంజల్స్ నగరం ఉంది. మొత్తం జనాభాలో వీరు 33శాతం మంది. కొద్ది రోజులుగా అక్రమ వలసదారుల పేరుతో కొంత మందిని అరెస్టు చేసి జైల్లో పెట్టటంతో వారంతా వీధుల్లోకి వస్తున్నారు. వారిని అదుపు చేసేందుకు ట్రంప్ సర్కార్ మిలిటరీని పంపింది. వలసదారులు శత్రుదేశాల మాదిరి లాస్ ఏంజల్స్‌ను ఆక్రమించుకున్నట్టుగా చిత్రించి నగరాన్ని విముక్తి చేయాలని ట్రంప్ ఆదేశించాడు. ఒకనాడు గొప్పనగరంగా విలసిల్లిన దానిని విదేశీ చొరబాటుదార్లు, నేరగాండ్లు ఆక్రమించినట్టు ట్రంప్ వర్ణించాడు. అక్రమ వలసదారులుగా చెబుతున్నవారు అమెరికాలో కోట్లాది మంది ఉన్నారు. అక్కడ తలెత్తిన ఆర్థిక, ఉపాధి సమస్యలను పరిష్కరించటంలో విఫలమైన పాలకులు వలస వచ్చిన వారే అన్నింటికీ కారణమంటూ విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. వారిలో ట్రంప్ ముందున్నాడు. ఐరోపా దేశాలలో కూడా ఇదే ధోరణి, ఎన్నికల సమస్యగా ఉంది.
ప్రస్తుతం లాస్ ఏంజల్స్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. అణచివేత ఏ రూపం తీసుకుంటుందో, దానికి ప్రతిఘటనతో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. చౌకగా పని చేయించుకొని లాభాలు పొందేందుకు అమెరికా వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు, వ్యవసాయ క్షేత్రాల వారు వలసలను ప్రోత్సహించారు. చట్టబద్ధగా వచ్చిన వారితో పాటు అక్రమంగా వచ్చిన వారిని చూసీ చూడనట్లు అధికార యంత్రాంగం వ్యవహరించింది. ఆర్థిక వ్యవస్థలో వారి పాత్ర తక్కువేమీ కాదు. వ్యవసాయం, సేవారంగం, నిర్మాణ రంగాలలో వారి పాత్ర పెద్దది. అధికారికంగా నమోదు కాని వారి సంఖ్య గురించి అంచనాలు మాత్రమే, కోటి మందికి పైగా ఉంటారని ఒక అంచనా. శ్రామిక శక్తిలో రికార్డుల్లో నమోదు కాని వారితో సహా విదేశాల్లో జన్మించిన కార్మికులు 18.6 శాతం లేదా 2.91 కోట్ల మంది అని 2023 కార్మిక శాఖ వివరాలు తెలిపాయి. అంతకు ముందు ఏడాది 18.1శాతం ఉన్నారు. వీరిలో 47.6 శాతం మంది మెక్సికో, ఇతర లాటిన్ అమెరికా దేశాల నుంచి వచ్చిన వారు కాగా 25.1శాతం ఆసియా ఖండం నుంచి ఉన్నారు. అధికారికంగా నమోదు కాని వారు 83 లక్షల మంది ఉన్నట్లు, వారిలో 30శాతం మెక్సికో నుంచి మధ్య, దక్షిణ అమెరికా దేశాల నుంచి 20, ఆసియా నుంచి 15శాతం ఉన్నట్లు న్యూయార్క్ వలస అధ్యయన కేంద్రం అంచనా వేసింది. రానున్న సంవత్సరాల్లో వంట, ఇంటిపనివారు, డ్రైవర్లు, ఆరోగ్య, వ్యక్తిగత సంరక్షణ వంటి పనులు చేసేందుకు డిమాండ్ పెరగనుందని చెబుతున్నారు.
కరోనా తరువాత ఆర్థిక వ్యవస్థ పెరుగుదలకు, ద్రవ్యోల్బణం తగ్గటానికి వలస కార్మికులు తోడ్పడ్డారని డల్లాస్ ఫెడరల్ రిజర్వుబ్యాంకు అధ్యయనం తెలిపింది. అమెరికాలో పుట్టి పెరిగిన వారు ఉద్యోగ విరమణ చేయటం, జననాల రేటు తగ్గిన కారణంగా 2019-21 మధ్య 20లక్షల మంది కార్మికులు తగ్గినట్లు, రానున్న పది సంవత్సరాల్లో వలస కార్మికులు లేకపోతే వివిధ రంగాలలో ముఖ్యంగా వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణలో ఈ పరిణామం తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరికలు వెలువడ్డాయి. జనాభాలో వలస వచ్చిన వారు 13.8శాతం, వీరిలో కొందరు వాణిజ్యాలను కూడా ప్రారంభించారు, వారి ద్వారా 2022 ఒక్క ఏడాదే 110 బిలియన్ డాలర్ల రాబడి వచ్చింది. అమెరికన్ కమ్యూనిటీ సర్వే ప్రకారం వలస వచ్చిన వారు ఫెడరల్ ప్రభుత్వానికి 2022లో 383 బిలియన్ డాలర్లు, రాష్ట్ర, స్థానిక సంస్థలకు 196 బిలియన్ డాలర్లు రాబడి చేకూర్చారు. నమోదు కాని కార్మికుల, ఆదాయ, సామాజిక భద్రత పన్నులే మొత్తం వంద బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. చిత్రం ఏమిటంటే నిరుద్యోగ, ఆరోగ్య బీమా వారికి వర్తించక పోయినా పన్ను చెల్లించారు. 2033 నాటికి మరో 5.2శాతం వలస కార్మికులు పెరుగుతారని వారి వలన ఏడులక్షల కోట్ల డాలర్ల మేర తోడవుతుందని, జీడీపీ 8.7లక్షల కోట్ల డాలర్లు పెరగటంతో పాటు ఫెడరల్ ప్రభుత్వానికి 1.2లక్షల కోట్ల డాలర్లు పన్ను ఆదాయం పెరిగి, 900 బిలియన్ డాలర్ల లోటు తగ్గుతుందని అంచనాలు వెలువడ్డాయి. వలస వచ్చిన వారి కారణంగానే స్థానికులకు అందాల్సిన సౌకర్యాలకు కోతపడుతున్నదని కొందరు సర్వేలు, బడ్జెట్ల పేరుతో రెచ్చగొట్టేందుకు పూనుకున్నారు. వలస వచ్చిన వారి గృహవసతి కోసం న్యూయార్క్ వంటి నగరాల్లో బడ్జెట్ కేటాయింపులు చేస్తూ ఇతరులకు కోతపెడుతున్నారని చిత్రిస్తున్నారు. నిజానికి పైనచెప్పుకున్నట్లుగా వలస వచ్చిన వారి నుంచి వచ్చే రాబడితో పోల్చుకున్నపుడు ఇవి పెద్ద మొత్తాలేమీ కాదు. వారు పని చేస్తున్న పరిశ్రమలు, వాణిజ్య, వ్యవసాయ రంగాల నుంచి వారి సంక్షేమానికి ప్రభుత్వం పన్నులు మరొక రూపంలో అదనంగా నిధులు సేకరించటాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ వారికి నానాటికీ మరిన్ని రాయితీలు ఇస్తున్నారు తప్ప అదనపు రాబడికి పూనుకోవటం లేదు. తక్కువ వేతనాలకు పని చేసే నైపుణ్యం అంతగా అవసరం లేని కార్మికులు ఇప్పుడు అమెరికాకు అవసరమని తెలిసినప్పటికీ ట్రంప్ వారి మీద దాడి ప్రారంభించాడు, లబ్ది పొందే కార్పొరేట్లు సహిస్తారా? వలస కార్మికులను వెనక్కు పంపుతానని ట్రంప్ పెద్ద ప్రకటనలు చేస్తున్నాడు. అందరినీ పంపాలంటే ఏడాదికి 500 బిలియన్ డాలర్లు ఖర్చు అవుతాయని, రానున్న పది సంవత్సరాలలో కార్మికుల కొరత ఏర్పడుతుందని, జీడీపీ 5.1లక్షల కోట్ల డాలర్లు తగ్గుతుందని తెలిసినా వ్యాపారవేత్త, లాభనష్టాలు తెలిసిన ట్రంప్ అలాంటి పనులకు ఎందుకు పాల్పడుతున్నట్లు ?
ఎన్నికలకు ముందే వలస కార్మికులను పంపివేస్తానని ట్రంప్ వాగ్దానం చేశాడు. ఇప్పుడు లాస్ ఏంజల్స్ నగరంలో చిచ్చు పెట్టాడు. సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గవిన్ న్యూసమ్ డిమాండ్ చేశాడు. ట్రంప్ చర్య రాష్ట్ర సార్వభౌమత్వాన్ని హరించటమే అన్నాడు. శాంతి భద్రతలకు విఘాతం కలగాలని వాంఛిస్తున్న ట్రంప్‌కు అలాంటి అవకాశం ఇవ్వవద్దని పౌరులను కోరాడు. నగర మేయర్ కరేన్ బాస్ కూడా గవర్నర్‌ను సమర్థిస్తూ ట్రంప్ చర్య అశాంతిని రెచ్చగొట్టినట్లు ఆమె వ్యాఖ్యానించారు. నగర కౌన్సిల్‌లోని 15 మంది సభ్యులు కూడా మిలిటరీ చర్యను ఖండించారు. వారి వైఫల్యం కారణంగానే తాను మిలిటరీని పంపినట్లు ట్రంప్ సమర్ధించుకున్నాడు. ట్రంప్‌ను సమర్ధించే మితవాద మీడియా నిరసన తెలుపుతున్నవారి మీద దుమ్మెత్తి పోస్తూ వార్తలు ఇస్తున్నది. 2024 నవంబరులో నగరపాలక సంస్థ వలసదారులను రక్షించేందుకు ”శరణ నగరం” అని ఏకగ్రీవంగా తీర్మానించింది. వలస నిరోధ అధికారులను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం చేశారు. అంతకు ముందు వలసదారులను బహిష్కరిస్తామని ట్రంప్ వాగ్దానం చేశాడు. మిలిటరీని దించటాన్ని డెమోక్రటిక్ పార్టీకి చెందిన 22 రాష్ట్రాల గవర్నర్లు ఒక ప్రకటనలో ఖండించారు. ట్రంప్ అధికార దుర్వినియోగం, దుర్మార్గమైన, విభజించే చర్య అన్నారు. మెక్సికన్లు లాస్ ఏంజల్స్ నగరంలో నివశించటాన్ని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షెయిన్‌బామ్ సమర్ధించారు. వారు మంచి వారు, నిజాయితీ పరులు, నేరస్తులు కాదు, తమ కుటుంబాలకు తోడుగా ఉండేందుకు, మెరుగైన జీవితం కోసం వారంతట వారే వెళ్లారని ఆమె అన్నారు. నిరసనకారులు అమెరికా పతాకాలతో పాటు మెక్సికో జాతీయ జెండాలను కూడా ప్రదర్శిస్తున్నారు. వాటిని చూపుతూ చూడండి విదేశీయులు మన దేశాన్ని ఎలా ఆక్రమించుకున్నారో వారిని బయటికి పంపవద్దా అంటూ రెచ్చగొడుతున్నారు. తాము అమెరికాకు వలస వచ్చామని, ఇక్కడే పిల్లలను కని పౌరులమయ్యామని తమ వారసత్వానికి చిహ్నంగా మెక్సికో పతాకాలను ప్రదర్శిస్తూ దమనకాండకు నిరసన తెలుపుతున్నట్లు ప్రదర్శకులు సమర్ధించుకుంటున్నారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిని రెచ్చగొట్టేందుకు ముసుగులు ధరించిన రహస్య పోలీసులను వినియోగించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నిరసనకారులు అనుమానం వచ్చి ఎవరని ప్రశ్నిస్తే సమాధానం లేకపోగా బెదిరింపులకు దిగుతున్నారు. ముసుగులు ధరించిన ఐసీఈ సిబ్బంది ఒక రెస్టారెంటులో చొరబడి వంట వారిని అదుపులోకి తీసుకోవటంతో కస్టమర్లు అడ్డం తిరిగి ప్రశ్నించారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో. అవాంఛనీయ చర్యలకు పాల్పడి ఆ నెపాన్ని వలస కార్మికుల మీద నెట్టే కుట్ర కనిపిస్తోంది. ఇలాంటి దుర్మార్గం ఫాసిస్టులు మాత్రమే చేయగలరన్నది చరిత్ర చెప్పిన సత్యం. తమకు అడ్డు పడితే గవర్నర్, నగర మేయర్లనూ అరెస్టు చేస్తామని ట్రంప్ యంత్రాంగం బెదిరించింది. ఈ దమనకాండకు నిరసనగా అనేక నగరాల్లో ప్రదర్శనలు జరపాలని పిలుపు నిచ్చారు. కార్మిక నేతల అరెస్టును కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండింది. వలస వచ్చిన వారిపై రాజ్యమే హింసాకాండకు పూనుకుందని కార్మిక సంఘాలు విమర్శించాయి. అనేక మంది స్థానిక అమెరికన్లు వలస వచ్చిన వారు తమ సోదరులే అంటూ మద్దతు తెలుపుతున్నారు. దమనకాండ అమెరికా విలువలకే వ్యతిరేకమని టీచర్స్ యూనియన్ ఒక ప్రకటనలో విమర్శించింది. ట్రంప్ జారీ చేస్తున్న ఆదేశాలను చూస్తుంటే నియంతృత్వంవైపు దేశాన్ని నడిపిస్తున్నట్లుందని డెమోక్రటిక్ సోషలిస్టు సెనెటర్ బెర్నీశాండర్స్ విమర్శించాడు. ఒకవైపు ప్రతికూల పన్నులతో ప్రపంచ దేశాల మీద దాడికి దిగిన ట్రంప్ దేశీయంగా వలసలు వచ్చారనే పేరుతో మిలిటరీ దాడులకు దిగాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ముదురుతున్న సమస్యలకు ప్రతిరూపాలే ఈ దాడులు. అందువలన అమెరికా సాధారణ పౌరులతో పాటు యావత్ ప్రపంచమూ డోనాల్డ్ ట్రంప్ దుర్మార్గాలపై గళమెత్తాలి !
ఎం కోటేశ్వరరావు
8331013288
నియంతృత్వం దిశగా అమెరికా ! మిలిటరీ ముట్టడిలో లాస్ ఏంజల్స్!!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES