Sunday, July 26, 2026
E-PAPER
Homeసోపతిసూపర్‌ మార్కెట్‌లో ఒక సాయంత్రం

సూపర్‌ మార్కెట్‌లో ఒక సాయంత్రం

- Advertisement -

సాయంత్రం ఐదున్నరకి ఆమె ఫోన్‌ చేసింది.
”ఎక్కడున్నావ్‌?”
”ఆఫీసు.”
”ఎంతసేపట్లో బయటికి వస్తావ్‌?”
”పని మీద ఆధారపడి ఉంటుంది.”
”అంటే?”
”నా మూడ్‌ మీద.”
ఆమె నవ్వింది.
”సరే… ఒక గంటలో కిందకి రా.”
”ఎందుకు?”
”నాతో సూపర్‌ మార్కెట్‌కి రావాలి.”
”నేను రాను.”
”వస్తావ్‌.”
”ఎందుకు?”
”ఎందుకంటే నాకు సంచులు మోయడానికి ఒక మనిషి తోడు కావాలి.”
ఒక గంట తర్వాత నేను ఆఫీసు కిందకి వచ్చేసరికి ఆమె కారులో రెడీగా ఉంది.
కారులో కూర్చుంటూ ”ఇది దౌర్జన్యం” అన్నాను.
”కాదు స్నేహం.” అంటూ ఆమె కారు స్టార్ట్‌ చేసింది.
ఇరవై నిమిషాల తర్వాత మేము ఒక పెద్ద సూపర్‌ మార్కెట్‌ ముందు నిలబడ్డాం.
”ఆలస్యమైంది, పద.” అంది.
ఇద్దరం లోపలికి నడిచాం. ఏసీ చలి ఒక్కసారిగా ముఖానికి తగిలింది. White Lights. Buy One, Get One Free.
ప్రతి షెల్ఫ్‌ మీదా తగ్గింపుల హడావిడి. మనుషుల కంటే ట్రాలీలకే అక్కడ ఎక్కువ ఆత్రుత ఉన్నట్టనిపించింది.
ఆమె ఒక ట్రాలీ నా చేతిలో పెట్టి..
”ఇప్పటి నుంచి ఇది నీ బాధ్యత.” అంది.
నేను దాన్ని తోసుకుంటూ అన్నాను.
”నా జీవితం ఇలా అయిపోతుందని ఊహించలేదు.”
”ఇకపై ఇలాగే ఉంటుంది.”
ట్రాలీ చక్రాలు నేలపై మెల్లగా శబ్దం చేస్తూ కదలడం మొదలైంది. ఆమె నా పక్కనే నడుస్తూ ఒక షెల్ఫ్‌ వైపు తిరిగింది. నేను వెనకే ట్రాలీ తోసుకుంటూ వెళ్లాను. ఆమె కొన్ని packets చూస్తూ ఆగింది.
”ఇక్కడకి వస్తే కొన్నిసార్లు నవ్వొస్తుంది.”
”ఎందుకు?”
”ఇక్కడ మనుషులకి అవసరమైన వాటికంటే… వాళ్లకి అవసరం ఉందని నమ్మించేవే ఎక్కువగా కనిపిస్తుంటాయి.”
”పెట్టుబడిదారీ వ్యవస్థ మీద ఉపన్యాసం మొదలైందా?”
”లేదు. గమనింపు.”
ఆమె చాలా శ్రద్ధగా సరుకులు ఎంచుకోవడం మొదలుపెట్టింది.
”ఇంత concentrationతో దేశ బడ్జెట్‌ కూడా తయారు చేయరు” అన్నాను.
ఆమె నా వైపు చూడకుండా…
”అందుకే దేశం ఈ స్థితిలో ఉంది” అంది.
నేను నవ్వుకుంటూ ట్రాలీని ముందుకు తోశాను. కొద్ది నిమిషాల్లోనే ట్రాలీ చిప్స్‌, బిస్కెట్లు, చాక్లెట్లు, నూడుల్స్‌తో నిండిపోయింది.
”ఇవి నిజంగా తింటావా?”
”లేదు… కొంటాను.”
నేను నవ్వేశాను.
”నీ logic ప్రమాదకరం.”
”అయినా నాతోనే తిరుగుతున్నావ్‌.” అని చెవిలో గుసగుసలాడింది.
ఇద్దరం నవ్వుకుంటూ ముందుకు వెళ్లాం. ఒక చిన్న పిల్లాడు ఖరీదైన రిమోట్‌ కారు కోసం ఏడుస్తున్నాడు. అతని తల్లి వద్దంటోంది. అదే సమయంలో పక్క వరుసలో ఒక మహిళ calculatorలో లెక్కలు చూసుకుంటూ ఓ cooking oil bottle మళ్లీ Shelfలో పెట్టేసింది. ఆమె ఆ వైపు చూస్తూ నెమ్మదిగా అంది…
”ఇక్కడ ప్రతి ట్రాలీ ఒక కథలా ఉంటుంది.”
నేను తల ఊపాను. బిల్లింగ్‌ కౌంటర్‌ దగ్గర మా ముందు ఒక పెద్దాయన నిలబడి ఉన్నాడు. చిన్న బాస్కెట్‌. అందులో బ్రెడ్‌, పాల ప్యాకెట్‌, మందులు.
క్యాషియర్‌ కార్డు స్వైప్‌ చేశాడు. Declined.. మళ్లీ ప్రయత్నించాడు. మళ్లీ అదే. ఆ పెద్దాయన ఇబ్బందిగా నవ్వాడు.
”పెన్షన్‌ ఇంకా పడలేదు బాబు… మందులు తీసేస్తే సరిపోతుంది.”
నేను కౌంటర్‌ లో నా కార్డు ఇచ్చి..
”ఈ బిల్లు నేను చెల్లిస్తాను.” అన్నాను
”వద్దు బాబు…” అన్నాడు.
”పర్లేదు సార్‌.”
ఆయన క్షణం నా వైపు చూసి, ”థాంక్స్‌ బాబు.” అని చెప్పి, నెమ్మదిగా నడిచాడు.
చేతిలో చిన్న సంచి. అడుగుల్లో మాత్రం వయసుకంటే ఎక్కువ అలసట కనిపించింది. ఆ దృశ్యం చాలా సేపు నా మనసు నుంచి కదల్లేదు. తర్వాత బిల్లింగ్‌ కౌంటర్‌ దాటి బయటికి నడుస్తుండగా అంది…
”మన దేశంలో వద్ధాప్యం కూడా ఖరీదైన విషయమైపోతోంది రామ్‌.”
నేను చిన్నగా నవ్వాను. కొద్దిసేపు ఇద్దరం మాట్లాడలేదు. పార్కింగ్‌ వైపు నడిచాం. నేను రెండు పెద్ద సంచులు మోస్తున్నాను. ఆమె నా పక్కన నడుస్తోంది.
”ఇది నా శ్రమ దోపిడీ కాదా?” అన్నాను.
”కాదు… ఇది తోడు.”
కారు దగ్గరకి వచ్చాక ఆమె ఒక్కసారిగా ఆగింది.
”ఏంటి?” అన్నాను.
ఆమె కొద్దిసేపు నా వైపు చూస్తూ అంది…
”నీతో ఇలా ఉండిపోవడం… తర్వాత కష్టం అవుతుంది రామ్‌.”
”ఎందుకు కష్టం అవుతుంది?”
”అలవాటు అయిపోతావ్‌ కదా.”
నేను ట్రాలీ హ్యాండిల్‌ మీద చేయి వదిలేశాను. ఆమె మెల్లగా అంది…
”వెళ్లిపోతావా?”
”ఎక్కడికి?”
ఆమె నవ్వింది.
”ఇలా ఉండిపోవడం నుంచి.”
నేను కూడా నవ్వాను.
”ఇప్పటికే ఉండిపోయాను కదా.”
ఆమె ఒక్క క్షణం నన్నే చూస్తూ అంది…
”అయితే ఉండిపో…”
ఆమె గొంతులో ఒక నిర్ణయం ఉంది. నేను సరుకులు కారులో పెట్టాను. ఆమె డ్రైవింగ్‌ సీట్లో కూర్చుంది. నేను ట్రాలీని పక్కకి తోసి కారెక్కి డోర్‌ మూసాను. కారు కదిలింది… కొద్దిసేపు గాలిలో తేలి, తర్వాత రాత్రిలో కలిసిపోయినట్టుగా.
– రామ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -