– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
రాష్ట్రవ్యాప్తంగా పామాయిల్ సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో అశ్వారావుపేటలో మరో నూతన ఆయిల్ఫామ్ పరిశ్రమను వెంటనే నిర్మించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పామాయిల్ సాగుకు అనుగుణంగా గెలల దిగుబడి పెరుగుతున్నందున ప్రస్తుత పరిశ్రమపై ఒత్తిడి పెరుగుతోందని, రైతులకు నాణ్యమైన సేవలు అందించేందుకు మరో పరిశ్రమ అవసరమని అన్నారు.
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొని, రైతులు సాగు చేసిన ప్రత్యామ్నాయ పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం సుందరయ్య భవన్లో మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన మండల కమిటీ సమావేశానికి పుల్లయ్య హాజరై మాట్లాడారు.
తెలంగాణలో బీడు భూములకు సాగునీరు అందించే ప్రాజెక్టులు నిర్మించాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, కౌలు రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట రుణాలు, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో సరఫరా చేయాలని కోరారు. ఇప్పటికీ రుణమాఫీ అమలు కాని రైతులకు వెంటనే రుణమాఫీ చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న రైతు భరోసా నిధులను విడుదల చేయాలని అన్నారు.
వరంగల్ రైతు డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటించిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో అనేక ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పుల్లయ్య తెలిపారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపించాలని డిమాండ్ చేస్తున్న ఏకైక సంఘం ఏఐకేఎస్ మాత్రమేనని అన్నారు.
ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న ఏఐకేఎస్ 36వ రైతు మహాసభలను జయప్రదం చేయాలని పార్టీ అనుబంధ సంఘాల శ్రేణులకు పిలుపునిచ్చారు. మహాసభల విజయవంతానికి విరాళాలు అందించి సహకరించాలని కోరారు.
జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారం శాఖా సమావేశాలు నిర్వహించాలని, పార్టీ పిలుపు మేరకు కార్యక్రమాలను విజయవంతం చేయాలని మండల కమిటీ సభ్యులకు సూచించారు. ఈ సమావేశంలో మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు గంగరాజు, నిర్మల, మడకం గోవిందు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.



