శ్రీలక్ష్మీ మండల సమాఖ్య కార్యాలయం ముందు మహిళలు ఆందోళన
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలం వల్లెంకుంట క్లస్టర్ పరిధిలోని కొండంపేట సాయికిరణ్ గ్రామైఖ్య సంఘాన్ని సిసి నాగరాజు నాలుగు నెలలుగా పట్టించుకోవడం లేదని రజిత, స్వన్న, సుగుణ, లక్ష్మీ, రజిత, స్వరూప తదితర సభ్యులు ఆరోపించారు. ఈ సందర్భంగా గురువారం కొయ్యుర్ లోని శ్రీలక్ష్మీ మండల సమాఖ్య కార్యాలయం ముందు ఆందోళన చేపట్టి ఏపీఎంను నిలదీశారు. సిసి నాగరాజు సంఘం వివో మీటింగ్, గ్రామ సభలు, లోకష్, గ్రామ సంఘం పుస్తకాల ఆడిట్, సెర్ప్ ఆడిట్, మహిళల ఈకెవైసి తదితర పనులపై నాలుగు నెలల నుంచి ఇటువైపు కన్నెత్తి చూడకపోగా విజిట్ చేసినట్లుగా మాత్రం టూడైరీలో తప్పుగా సమాచారం ఇస్తున్నట్లుగా తెలుస్తోందని వాపోయారు.
అలాగే జనవరి 12న 2026లో నాగులమ్మ మహిళ రైతు సంఘాన్ని ఏర్పాటు చేయగా ఆన్లైన్ చేయాలని ఈ నెల 3న కొయ్యుర్ ఏపిఎం కార్యాలయంలో వివోఏ అప్పజెప్పగా.. నేటి వరకు చేయకపోవడంతో తమకు సబ్సిడీపై వచ్చే రుణం నిలిసిపోయిందని మండిపడ్డారు. ఈ సంఘటనలపై ఎప్పటికప్పుడు ఏపిఎం హనుమంతరావు, పామ్ డిపిఎం రవి దృష్టికి తీసుకపోయిన పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు అధికారులు పట్టించుకుని తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయునట్లుగా తెలిపారు. కాగా ఇదే సీసీపై పలు ఆరోపణలతో ఇటీవల చిట్యాల మండలానికి బదిలీ కాగా రాజకీయ పలుకుబడి, ఉన్నతాధికారులకు అమ్యామ్యాల ఎర చూపడంతో ఇక్కడే మకాం వేసి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పరిపాటిగా మారడం గమనార్హం. ఈ ఘటనలపై నవ తెలంగాణ పామ్ డిపిఎం రవిని వివరణ కోరగా ఏపిఎంతో మాట్లాడి సమస్యలను పరిస్కారం అయ్యేలా చూస్తామన్నారు.


