ఫైనల్లో అర్జెంటీనాపై 1-0తో గెలుపు.. ఫెర్రాన్ టోరెస్ సూపర్ గోల్
2010 ఫిఫా ప్రపంచకప్ విజేతగా
నిలిచిన తర్వాత ఏ వరల్డ్‌కప్‌లోనూ
స్పెయిన్ నాకౌట్ మ్యాచ్‌లో నెగ్గలేదు.
సమిష్టితత్వంతో బలమైన జట్టుగా ఎదిగిన స్పెయిన్ 2024 యూరో చాంపియన్‌గా నిలిచి.. ప్రపంచకప్‌పై కన్నేసింది.
ప్రపంచకప్ వేటలో వరుసగా 37 మ్యాచ్‌ల్లో అజేయ రికార్డుతో ఫైనల్లోకి ప్రవేశించింది.
ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను స్పెయిన్ వెనక్కి నెట్టేసింది. సూపర్ ఎటాకింగ్‌తో మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. అయినా, అర్జెంటీనా డిఫెన్స్‌తో స్పెయిన్‌ను అడ్డుకుంది. ఎట్టకేలకు,106వ నిమిషంలో ఫెర్రాన్ గోల్‌తో స్పెయిన్‌కు ఆధిక్యంతో పాటు ప్రపంచకప్‌ను అందించాడు. డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, సూపర్‌స్టార్ లియోనల్ మెస్సికి టైటిల్ వేటలో నిరాశ తప్పలేదు.
స్పెయిన్ సాధించింది. డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను చిత్తు చేసి ఫిఫా ప్రపంచకప్ చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం అర్థరాత్రి అనంతరం జరిగిన ఫైనల్లో స్పెయిన్ 1-0తో అర్జెంటీనాపై గెలుపొందింది. లియోనల్ మెస్సి సేనపై పూర్తి ఆధిపత్యం చెలాయించిన స్పెయిన్‌కు 106వ నిమిషంలో ఫెర్రాన్ టొరెస్ గెలుపు గోల్ కొట్టాడు. 90+3వ నిమిషంలో ఎంజో ఫెర్నాండేజ్‌కు రెడ్ కార్డ్ లభించటంతో అర్జెంటీనా పది మందికే పరిమితమైంది. ఇక్కడే, అర్జెంటీనా డిఫెన్స్‌ను ఛేదించేందుకు స్పెయిన్‌కు మార్గం సుగమమైంది. అర్జెంటీనా అవకాశాలు ఈ రెడ్‌కార్డ్‌తో సన్నగిల్లాయి.
ప్రథమార్థం చప్పగా..
2018 ప్రపంచకప్ ఫైనల్లో ఆరు గోల్స్, 2022 ప్రపంచకప్ ఫైనల్లో ఆరు గోల్స్.. దీంతో సహజంగానే 2026 టైటిల్ పోరు నుంచి అభిమానులు గోల్స్ వర్షం అంచనా వేశారు. కానీ, డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా, యూరో చాంపియన్ స్పెయిన్ నిరాశపరిచాయి. ప్రథమార్థం పది నిమిషాల్లోనే ఆటను నియంత్రణలోకి తెచ్చుకున్న స్పెయిన్ యమాల్‌తో ఓసారి అర్జెంటీనా గోల్ పోస్ట్‌పై దాడికి ప్రయత్నించింది. తొలి 45 నిమిషాల ఆటలో బంతి ఎక్కువగా అర్జెంటీనా పెనాల్టీ ఏరియాలోనే కనిపించింది. స్పెయిన్ సమిష్టితత్వంతో కచ్చితమైన పాస్‌లు, బంతి నియంత్రణ సాధించారు. దీంతో అర్జెంటీనా తొలి అర్థభాగం ఆటలో ఒక్కసారి కూడా గోల్ ప్రయత్నం చేయలేదు. కనీసం స్పెయిన్ గోల్‌పోస్ట్‌పై ఎటాక్ చేయలేదు. అర్జెంటీనా ఫార్వర్డ్‌లు బంతితో ముందుకు దూసుకెళ్లలేకపోయారు. అర్జెంటీనా ఆటగాళ్లు స్వేచ్ఛగా షాట్ కొట్టలేకపోయారు. స్పెయిన్ సైతం ప్రథమార్థంలో బంతి నియంత్రణలో ఉన్నప్పటికీ ఆశించిన ఎదురుదాడి చేయలేదు. 45 నిమిషాల ఆటకు మరో 4 నిమిషాల స్టాపేజ్ టైమ్ జోడించినా… ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. గోల్ ఇవ్వలేదనే సంతృప్తి ఇరు జట్లలో కనిపించినా.. గోల్ ప్రయత్నమే చేయలేదనే అసంతృప్తి అభిమానుల్లో మిగిలింది. స్పెయిన్ ఆటగాళ్లను అడ్డుకునే ప్రయత్నం చేసినా మార్టినెజ్‌కు రిఫరీ ఎల్లో కార్డ్ చూపించాడు.
అర్జెంటీనా డిఫెన్స్ దుర్బేద్యం!
ద్వితీయార్థం ఆరంభంలోనూ స్పెయిన్‌దే పైచేయి. కానీ అర్జెంటీనా డిఫెన్స్‌తో గోల్ పోస్ట్‌ను కాపాడుకుంది. స్పెయిన్ బంతిపై నియంత్రణతో పాటు గోల్‌పోస్ట్‌పై దాడి చేసే అవకాశాలు కల్పించుకుంది. కానీ గోల్ కొట్టేందుకు బలమైన అవకాశాలు సృష్టించటంలో విఫలమైంది. పెనాల్టీ బాక్స్‌ను కాపాడుకోవటంలో అర్జెంటీనా డిఫెన్స్ విజయవంతమైంది. ఆట మొదలైన 70 నిమిషాల్లో అర్జెంటీనా ఒక్కసారి కూడా స్పెయిన్ గోల్‌పోస్ట్‌పై దాడి చేయలేదు. మెస్సి సేన ఎక్కువగా డిఫెన్స్‌పైనే ఫోకస్ చేసింది. ఫెర్రన్ గోల్‌పోస్ట్ ముంగిట హెడర్‌తో ప్రయత్నించినా.. బంతి నేరుగా అర్జెంటీనా గోల్‌కీపర్ మార్టినెజ్ చేతుల్లోకి వెళ్లింది. డ్రింక్స్ విరామం తర్వాత సైతం గోల్ కొట్టడంలో ఇరు జట్లు విఫలం అయ్యాయి. స్పెయిన్ ఆధిపత్యం కొనసాగినా ఆఖర్లో అర్జెంటీనా దూకుడు పెంచింది. ఎంజో ఫెర్నాండేజ్ 90+3వ నిమిషంలో రిఫరీ నుంచి రెడ్‌కార్డ్ అందుకున్నాడు. దీంతో అర్జెంటీనా పది మందితోనే ఆడాల్సి వచ్చింది. 90 నిమిషాల రెగ్యులర్ ఆటలో ఫలితం తేలలేదు. దీంతో మ్యాచ్ అదనపు సమయానికి దారితీసింది.
ఫెర్రాన్ గెలుపు గోల్
90 నిమిషాల ఆట, స్టాపేజ్ టైమ్ ముగిసినా.. స్పెయిన్‌కు గోల్ దక్కలేదు. అర్జెంటీనాపై అన్ని వైపులా ఎటాక్ చేసిన స్పెయిన్ ఎన్నో అవకాశాలు వృథా చేసింది. రెగ్యులర్ టైమ్‌లో ఓ హెడర్ చేజార్చిన ఫెర్రానో.. అదనపు సమయంలో ఆ పొరపాటు చేయలేదు. 106వ నిమిషంలో గోల్‌పోస్ట్ ముంగిట నికో విలియమ్స్ నుంచి పాస్ అందుకున్న ఫెర్రానో.. సూపర్ కిక్‌తో గోల్‌గా మలిచాడు. ఫెర్రానో గోల్‌తో న్యూయార్క్ స్టేడియం సంబురాల్లో మునిగిపోయింది.
ఆట, పాట అదిరెన్
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా ఆట, పాట అభిమానులను ఉర్రూతలూగించాయి. హాఫ్ టైమ్ విరామంలో మడోన్నా బగ్గీని బ్రెజిల్ లెజెండ్స్ రొనాల్డో, రొనాల్డిన్హో గ్రౌండ్‌లోకి డ్రైవ్ చేస్తూ తీసుకురావటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జస్టిన్ బీబర్, మడొన్నా, షకీరా, బుర్నా బాయ్ అలరించారు. ప్రీ మ్యాచ్ షోలో హాలీవుడ్ నటుడు టామ్ క్రూస్‌తో పాటు యూట్యూబర్ స్పీడ్ తళుక్కున మెరిశాడు. ఎడ్యుకేషన్ ఫండ్ కోసం గ్లోబల్ సిటిజెన్ సంస్థ చిన్నారులతో ప్రదర్శన చేసింది.
ప్రైజ్‌మనీ రూ.83,866 కోట్లు
విజేత : రూ. 4909 కోట్లు
రన్నరప్ : రూ. 3273 కోట్లు
థర్డ్‌ప్లేస్ : రూ.2888 కోట్లు
ఫోర్త్ ప్లేస్ : రూ.2695 కోట్లు
క్వార్టర్‌ఫైనలిస్ట్ : రూ.1925 కోట్లు
ప్రీ క్వార్టర్‌ఫైనలిస్ట్ : రూ.1540 కోట్లు
రౌండ్ ఆఫ్ 32 : రూ.1155 కోట్లు
గ్రూప్ స్టేజ్ : రూ.962 కోట్లు



