నవతెలంగాణ – ముంబై – విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) రిజిస్ట్రేషన్ ప్రక్రియను గతంలో ఉన్న కొన్ని వారాలు లేదా నెలల సమయం నుండి కేవలం ఐదు పని దినాలకు వేగవంతం చేస్తూ ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ ‘ఈఎఫ్‌పీఐ @ సిటీ’ సేవలను అధికారికంగా ప్రారంభించింది. భారత్‌లో అట్టహాసంగా జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఈ సరికొత్త మార్కెట్ పరిష్కారాన్ని ఆవిష్కరించారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు భారత్‌ని ఒక వ్యూహాత్మక పెట్టుబడి గమ్యస్థానంగా పరిశీలిస్తున్న తరుణంలో, మార్కెట్లోకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా ప్రవేశించడానికి ఈ నూతన విధానం ఎంతగానో దోహదపడుతుంది.
దేశంలోని ఎఫ్‌పీఐ అసెట్స్ అండర్ కస్టడీలో దాదాపు మూడో వంతును పర్యవేక్షిస్తున్న సిటీ ఇండియా సర్వీసెస్ వ్యాపారం, గ్లోబల్ ఇన్వెస్టర్ల అవసరాలను పెద్ద ఎత్తున తీర్చడానికి అత్యంత అనుకూలమైన స్థానంలో ఉంది. ఈ సందర్భంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ తుహిన్ కాంత పాండే మాట్లాడుతూ, భారత్‌లో ఎఫ్‌పీఐల కోసం 5 రోజుల్లోనే వేగవంతమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియను అందించేందుకు సిటీ చేపట్టిన చొరవను అభినందించారు. ఎఫ్‌పీఐలు భారతీయ మూలధన మార్కెట్లలో వేగంగా సాంకేతికతను ఉపయోగించాలనే సెబి లక్ష్యానికి ఇది పూర్తిగా అనుగుణంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
సిటీ బ్యాంకింగ్ ఇన్నోవేషన్ పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తున్న గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌లో ఈ సేవలను ప్రారంభించగా, సిటీ ఆసియా సౌత్ సర్వీసెస్ హెడ్ మృదుల అయ్యర్ మాట్లాడుతూ, ఏ మార్కెట్ అయినా ఆకర్షణీయంగా ఉండాలంటే ఇన్వెస్టర్లు అక్కడ ఎంత సులభంగా ప్రవేశించగలరు అనేదానిపైనే ఆధారపడి ఉంటుందని తెలిపారు. భారత్ అపారమైన అవకాశాలకు ఎప్పట్నుంచో గుర్తింపు పొందిందని చెప్పారు.
ముఖ్య అతిథిగా హాజరైన నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) ఎండీ, సీఈవో విజయ్ చందోక్ మాట్లాడుతూ, డిజిటల్ టూల్స్, సమర్థవంత ప్రక్రియను ఉపయోగించుకునే ఈఎఫ్‌పీఐ @ సిటీ చొరవ ఎఫ్‌పీఐల ఆన్‌బోర్డింగ్‌ను పూర్తిగా మార్చివేయనుందని తెలిపారు. ఎన్‌ఎస్‌డీఎల్, సిటీల మధ్య ఏపీఐ ఇంటిగ్రేషన్ ద్వారా మా సిస్టమ్స్ మధ్య సజావైన డిజిటల్ అనుసంధానం ఏర్పడుతుందని వివరించారు. ఈ సేవలను దశలవారీగా తెస్తుండగా, మొదటి దశలో అమెరికా, ఐర్లాండ్, లక్సెంబర్గ్‌లకు చెందిన నియంత్రిత పబ్లిక్ ఫండ్‌లు కవర్ అవుతాయి. రెండవ దశలో సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా , బ్రిటన్ దేశాలకు ఈ సేవలు విస్తరించనున్నాయి.



