Friday, May 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం'డిండి'ని వేగంగా పూర్తి చేయండి

‘డిండి’ని వేగంగా పూర్తి చేయండి

- Advertisement -

ఎస్‌ఎల్‌బీసీ కాలువల సామర్ధ్యాన్ని పెంచాలి :
నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

డిండి ఎత్తిపోతల పథకం వేగంగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయంలో శాసనమండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డితో కలసి ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆఫ్‌ టెక్‌ పాయింట్‌ కు సంబంధించిన లెవల్‌ ఫిక్సేషన్‌ తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు సంబంధించిన పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 95 శాతం పనులు పూర్తి చేసిందని మంత్రి చెప్పారు.అయితే మూడు గ్రామాల పునరావాస సమస్యలు, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో 180.14 హెక్టార్ల అటవీ భూమికి సంబంధించిన సమస్యల కారణంగా స్పిల్‌వేలో ఒక భాగం ఇంకా పూర్తి కాలేదన్నారు. బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు గేట్ల ఏర్పాటు కోసం వెంటనే టెండర్లు పిలవాలని అధికారులను ఆదేశించారు. అలాగే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఎదుళ్ల రిజర్వాయర్‌ నుండి ఎత్తిపోతల స్కిం అప్రోచ్‌ ఛానల్‌ కు నీటిని ఏ స్థాయిలో తీసుకు రావాలనే అంశంపై తుదినిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పోతిరెడ్డిపల్లిలో లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ బ్యారేజ్‌ పనులను మే 15 నాటికి ఆర్థిక సంబంధిత అనుమతులు తీసుకుని వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. ఏఎంఆర్‌పీ ఎస్‌ఎల్‌బీసీ ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 2400 క్యూసెక్కుల నుంచి 4000 క్యూసెక్కులకు పెంచాలని సూచించారు. ఎస్‌ఎల్‌బీసీ హై లెవల్‌ కాలువకు సిమెంట్‌ కాంక్రీట్‌ లైనింగ్‌ పనుల కోసం ప్రభుత్వం రూ.443 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. పెండ్లిపాక బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ పూర్తి చేసేందుకు సవరించిన అంచనాల తయారు చేసి హై పవర్‌ కమిటీ ముందు ఉంచేందుకు ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు. సమీక్షలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి ఇ. శ్రీధర్‌, జాయింట్‌ సెక్రటరీ కే. శ్రీనివాస్‌, ఈఎన్‌ సీ రమేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -