– ప్రజలకు వైద్య సేవలు అందించడం లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
– ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
– వైద్యులు, సిబ్బందితో ప్రత్యేక సమీక్ష సమావేశం
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలందించడంలో ఎలాంటి నిర్లక్ష్యానికీ తావులేదని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్పష్టం చేశారు. సోమవారం అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిలో వైద్య సేవల నాణ్యత, రోగులకు అందుతున్న సౌకర్యాలపై ఆయన సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీసీహెచ్ డాక్టర్ రవిబాబు హాజరై ఆసుపత్రి పనితీరు, వైద్య సేవలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. సమావేశం ప్రారంభంలో ఆసుపత్రి అధికారులు రోగుల సంఖ్య, అత్యవసర సేవలు, ప్రసూతి విభాగం, ప్రయోగశాల సేవలు, మందుల లభ్యత, వైద్య సిబ్బంది విధుల నిర్వహణ తదితర అంశాలపై వివరాలు అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే ప్రతి విభాగం పనితీరును సమీక్షిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమని పేర్కొంటూ, రోగుల పట్ల గౌరవప్రదంగా, సానుభూతితో వ్యవహరించాలని వైద్యులు, సిబ్బందికి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలని ఆదేశించారు.
ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. ల్యాబ్ పరీక్షలు, స్కానింగ్ సేవలు, ప్రసూతి సేవలు, బాలల వైద్యం, వృద్ధుల ఆరోగ్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.అలాగే ఆసుపత్రి ప్రాంగణంలో పరిశుభ్రతను కచ్చితంగా పాటించి రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాలని అన్నారు.
సమావేశంలో వైద్యులు సిబ్బంది కొరత, పరికరాల అవసరం, మౌలిక సదుపాయాల విస్తరణ వంటి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అశ్వారావుపేట ఏరియా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేసి ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు, సదుపాయాల కోసం ప్రత్యేకంగా కృషి చేస్తానన్నారు.
డీసీహెచ్ఎస్ డాక్టర్ రవిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేందుకు వైద్య సిబ్బంది సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలని, రోగులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రతిష్ఠను పెంచాలని అన్నారు. సమావేశంలో మాతా-శిశు ఆరోగ్య సేవలు, అత్యవసర వైద్య సేవలు, డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధుల నివారణ చర్యలు, ప్రజారోగ్య కార్యక్రమాల అమలుపై కూడా చర్చించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఆరోగ్య సేవలు మరింత చేరువయ్యేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే ఆసుపత్రిలోని పలు విభాగాలను సందర్శించి రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీసి, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ రాధా రుక్మిణి, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆరోగ్య శాఖ అధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.



