Thursday, June 18, 2026
E-PAPER
Homeజాతీయంఇందిరా లంకేష్ మృతికి సంతాపం ప్రకటించిన సీపీఐ(ఎం)

ఇందిరా లంకేష్ మృతికి సంతాపం ప్రకటించిన సీపీఐ(ఎం)

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ప్రముఖ జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త  గౌరీ లంకేష్ తల్లి ఇందిరా లంకేష్ (83) మరణించారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో సోమవారం  బెంగళూరులోని తన నివాసంలో ఆమె మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రచయిత్రిగా, పారిశ్రామికవేత్తగా ఇందిరా లంకేష్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమెకు కుమార్తె కవితా లంకేష్, కుమారుడు ఇంద్రజిత్ లంకేష్ ఉన్నారు. పెద్ద కుమార్తె  గౌరీ లంకేష్‌ను 2017 సెప్టెంబర్‌లో హిందూత్వ మూకలు  ఆమె ఇంటి ఆవరణలోనే కాల్చి చంపిన సంగతి తెలిసిందే.

శివమొగ్గలో జన్మించిన ఇందిర.. ప్రముఖ కన్నడ రచయిత, పాత్రికేయుడు పి. లంకేష్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వారు బెంగళూరుకు మారారు. లంకేష్ తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా చేసి సినిమాలు, నాటకాలు నిర్మిస్తున్న సమయంలో ఆమె చీరలు అమ్ముతూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. అనంతరం 1979లో గాంధీ బజార్‌లో ‘మయూర్ సిల్క్స్ అండ్ టెక్స్‌టైల్స్’ను ప్రారంభించారు. ఆ తర్వాత ఏడాదికి పి.లంకేష్ ‘లంకేష్ పత్రిక’ అనే టాబ్లాయిడ్ ను  ప్రారంభించారు.  పి.లంకేష్ రచించిన ఆత్మకథ ‘హులిమవిన మర’కు కొనసాగింపుగా.. ఇందిరా లంకేష్ తన భర్తతో సాగిన జీవిత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ‘హులిమావు మట్టు నాను’ అనే పుస్తకాన్ని రచించారు. ఇది ఆమె కుమార్తె నడిపిన ‘గౌరీ లంకేష్ పత్రిక’లో ధారావాహికగా ప్రచురితమైంది. కన్నడలో మహిళలు రాసిన ఆత్మకథల్లో ఇదొక మైలురాయిగా నిలిచింది.

ఇందిరా లంకేష్ మృతికి సంతాపం ప్రకటించిన సీపీఐ(ఎం)
ఇందిరా లంకేష్ మృతికి సీపీఐ(ఎం) సంతాపం ప్రకటించింది. ఆమె మరణ వార్త తీవ్ర విచారం కలిగించిందని సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబి పేర్కొన్నారు. “ప్రముఖ రచయిత్రి, ప్రచురణకర్త, పారిశ్రామికవేత్త అయిన ఇందిరా లంకేష్ మరణవార్త తీవ్ర విచారం కలిగించింది. ఆమె తన భర్త పి. లంకేష్ సాహిత్య, పాత్రికేయ ప్రస్థానానికి, ‘లంకేష్ పత్రిక’ విజయానికి వెన్నెముకగా నివడమే కాకుండా, నిష్ణాతురాలైన రచయిత్రిగా, సామాజిక విమర్శకురాలిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆమె క్యాన్సర్‌తో పోరాడుతూనే.. గత తొమ్మిదేళ్లుగా హత్యకు గురైన తన కుమార్తె గౌరీ లంకేష్‌కు న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఇన్నేళ్ల తర్వాత కూడా గౌరీ లంకేష్ హంతకుల విచారణలో పెద్దగా పురోగతి లేకపోవడం విచారకరం. ఆమె కుమార్తె హత్య వెనుక ఉన్న మతోన్మాదులను చట్టం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది” అని సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు. ఆమె మృతికి నివాళులు అర్పిస్తూ.. కుటుంబసభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలియజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -