బ్యారెల్ 107 డాలర్లకు చేరిక
వాషింగ్టన్ : పశ్చిమాసియాలో రోజురోజుకూ ముదురుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలను మళ్లీ భగ్గుమనిపిస్తున్నాయి. సౌదీ అరేబియాలోని కీలకమైన ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన వరుస దాడుల కారణంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు ఒక శాతానికి పైగా ఎగబాకాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 1.24 డాలర్లు పెరిగి 107 డాలర్లకు చేరుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యూ టీఐ) క్రూడ్ బ్యారెల్‌కు 1.29 డాలర్లు బలపడి 102.65 డాలర్ల వద్ద నమోదయ్యింది. సౌదీ అరేబియాలోని ఖమిస్ ముషైత్ మిలటరీ ఎయిర్‌బేస్‌పై యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతి తిరుగుబాటుదారులు డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడటంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ దాడుల ప్రభావంతో సౌదీ చమురు ఎగుమతులకు అత్యంత కీలకమైన తూర్పు పశ్చిమ పైప్‌లైన్ మూతపడింది. హార్ము జ్ జలసంధి గుండా వెళ్లే నౌకా రవాణాకు ఆటంకం ఏర్పడినప్పుడు, ప్రత్యామ్నాయంగా ఈ పైప్‌లైన్ ద్వారానే సౌదీ రోజువారీగా సుమారు 4 మిలియన్ బ్యారెళ్ల చమురును రెడ్ సముద్రంలోని యాన్బు ఓడరేవుకు తరలిస్తోంది. తాజా దాడుల కారణంగా ఈ సరఫరా మార్గం నిలిచిపోవడం మార్కెట్ వర్గాలను కలవరపెడుతోంది.
120 డాలర్లకు చేరొచ్చు..!
ఈ భౌగోళిక రాజకీయ ఘర్షణలు ఇలాగే కొనసాగితే ముడిచమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ గోల్డ్‌మన్ శాచ్స్ హెచ్చరించింది. పరిస్థితి ఇదే విధంగా ఉంటే ముడిచమురు ధర బ్యారెల్‌కు ఏకంగా 120 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. మరోవైపు జెపి మోర్గాన్ సంస్థ స్పందిస్తూ.. ఈ సరఫరా అంతరాయం మరో నెల రోజులు పొడిగితే బ్రెంట్ చమురు ధరపై అదనంగా మరో 7 నుంచి 8 డాలర్ల భారం పడుతుందని పేర్కొంది. ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో భారత్ వంటి ఇంధన దిగుమతి దేశాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపే అవకాశముందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముడిచమురు ధరలకు మళ్లీ రెక్కలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



