నవతెలంగాణ-హైదరాబాద్: ఎస్ ఎఫ్ ఐ(SFI) నాయకులు ఐషే ఘోషును అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు యత్నించారు. ఆమె కోసం మంగళవారం సీపీఐ(ఎం) ప్రధాన కార్యాలయం ఏకేజీ భవన్ లోకి ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రవేశించారు. అదే సమయంలో అక్కడే ఉన్నా ఎంపీ జాన్ బ్రిట్టాస్ పోలీసులను చర్యలను తీవ్రంగా ఖండించారు. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయంలోకి ఎలా వస్తారని ప్రశ్నించారు. యూనిఫామ్ లు లేకుండా, ప్రయివేటు వాహనంలో తరలివచ్చారని, జెన్ జీ నిరసనలకు మద్దతుగా నిలిచిన వామపక్ష విద్యార్థుల పట్ల మోడీ ప్రభుత్వం అనుచితంగా వ్యవహరిస్తుందని ఎంపీ మండిపడ్డారు.
ఒక రాజకీయ పార్టీ కార్యాలయంలోకి పోలీసులు అక్రమంగా చొరబడటం, విద్యార్థి ఉద్యమ నాయకులపై కొనసాగుతున్న వేధింపులు మోడీ ప్రభుత్వ ప్రజాస్వామ్య హక్కులపై పెరుగుతున్న దాడులకు నిదర్శనం, విద్యార్థులు లేవనెత్తుతున్న న్యాయమైన సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, పోలీసు అధికారాన్ని ఉపయోగించి వారిని బెదిరించడం, గొంతు నొక్కడం,నిరసనలను నేరంగా ముద్రించే ప్రయత్నం కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. ఈ చట్ట విరుద్ధ చర్యలను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయం, విద్యాహక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడుతున్న విద్యార్థులకు సీపీఐ(ఎం) తన సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తోందని ఎంపీ హామీ ఇచ్చారు.



