Tuesday, July 14, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికోడిగొంతు నొక్కినంత మాత్రాన..కొత్తపొద్దు పొడవకుండా ఆగుతుందా?

కోడిగొంతు నొక్కినంత మాత్రాన..కొత్తపొద్దు పొడవకుండా ఆగుతుందా?

- Advertisement -

మహాకవి శ్రీ శ్రీ అన్నట్టు ‘‘అవినీతి భారీ పరిశ్ర మలో అన్యాయాల ధరలు పెంచేసి, స్వాతంత్ర్యాన్ని బ్యాంకుల్లో వేసుకొని చక్రవడ్డీ తిప్పే కామందులకు, క్షణక్షణం మారుతున్న లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్లంతా, పేదల పక్షం వహించడమే పెద్ద అపరాధమై పోయింది’’ యుగాలు మారినా, తరాలు మారినా పాలకవర్గాల స్వభా వాలు మారలేదు. స్వరూపాలు మారాయి అంతే. అనాదిగా పాలకవర్గాలకు నచ్చని పదం ఒకటే, అది ప్రశ్న. తమ ఆధిపత్యానికి అస్తిత్వానికి భంగం కలిగించే ప్రశ్న ఏదైనా అది సహేతుకమైనా పాలకవర్గాలు సహించవు. చరిత్రలో ఎంతోమంది శాస్త్రవేత్తలు, రచయితలు, ఉద్యమకారుల ప్రశ్నలకు సమాధా నాలుగా సంకెళ్లు ముందు నిలిచాయి. జైళ్లు నోళ్లు తెరిచాయి. చట్టం ముందు అందరూ సమానులే అనే ప్రభుత్వపెద్దలు అయినవాళ్ల మహాపరాధాలను మాఫీ చేస్తారు. లేనివాళ్లు కడుపు మంటతో ఒక మాట అంటే వెంటపడి వేధిస్తారు. 1974లో జార్జ్ ఫెర్నాండెజ్ నాయకత్వంలో అఖిలభారత స్థాయిలో రైల్వే సమ్మె నిర్వహించారు. ఆ సమ్మెను సమర్థిస్తూ కవితలు, వ్యాసాలు రాసినవాళ్లు రాజద్రోహ నేరారోపణతో జైళ్ల పాలయ్యారు. ఎమర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన లోక్‌‌సభ ఎన్నికల్లో గెలిచి జార్జ్ ఫెర్నాండెజ్ ఏకంగా రైల్వే మంత్రి అయిపోయారు. సదరు రచయితలు మాత్రం కోర్టుల చుట్టూ తిరిగారు. శిక్షలనుభవించారు.

విచిత్రంగా లేదూ. ఎప్పుడో 1906లో గాడిచర్ల హరి సర్వోత్తమరావు అనే సంపా దకుడు తన స్వరాజ్య పత్రికలో తిరునల్వేలి పట్టణంలో జరిగిన బ్రిటిష్ పోలీసుల కాల్పులను నిరసిస్తూ ఒక సంపాదకీయం రాశాడు. రాజద్రోహ నేరారోపణపై జైలు పాలయ్యాడు. నాటి బ్రిటిష్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిరసనగా వెలువడిన కళారూపాలు రచనలే కాదు కళాకారులు, రచయితలు సైతం రాజద్రోహ నేరారోపణపై నిర్బంధాల నెదుర్కొ న్నారు, జైళ్ల పాలయ్యారు, అమరుల య్యారు. ఆ రచనలను ముద్రించిన ప్రింటింగ్ ప్రెస్సులను, అమ్మకానికి ఉంచిన పుస్తకాల దుకాణాలను, ప్రచురణ కర్తలను రంగ స్థలాలను సైతం బ్రిటిష్ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. తెలంగాణలో ఏడవ నిజాం హయాంలోనూ అదే పరిస్థితి. నిజాం హయాంలో గస్తీ నిషాన్ 53, గస్తీ 53, హైదరాబాద్ డిఫెన్స్ యాక్ట్ వంటి వివిధ నిర్బంధ చట్టాల పదఘట్టనల కింద పత్రికల సంపాదకులు, కవులు, రచయితలు, స్వాతంత్రో ద్యమకారులు ఎందరో నలిగిపోయారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక పరిస్థితి మారుతుందను కున్న వారికి నిరాశే మిగిలింది. వివిధ రూపాల్లో అక్రమ నిర్బంధం కొనసాగుతూనే ఉంది. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో పెద్దఎత్తున చర్చలేవదీసిన రాజ ద్రోహనేరం కొత్తదేమీ కాదు. శిక్షాస్మృతిలో అందుకు సంబంధించిన 124ఎ 153ఎ 99ఎ సిఆర్ పిసి సెక్షన్లను నూట పాతికేళ్ల క్రితమే బ్రిటిష్ ప్రభుత్వం భారతీయుల స్వాతంత్ర్య స్వరాలను నియంత్రించడానికి రూపొందించింది.

అవే చట్టాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఈ చట్టాల ప్రకారమే ఎందరో తెలుగు రచయితలు, కళాకారులు, పౌర హక్కుల నేతలు, ప్రజా ఉద్యమకారులు నిర్బంధాలను, విచారణలను ఎదుర్కొన్నారు. 1975 -77 మధ్యకాలంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. పౌర హక్కులు లేవు. పత్రికల వార్తలపై కూడా నియంత్రణ. మీసా (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) ప్రకారం దేశంలోని ప్రతిపక్షాలకు చెందిన అగ్ర నాయకులందరినీ నిర్బంధించారు. లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ సహా మురార్జీ దేశాయ్, చంద్రశేఖర్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, సీపీఐ(ఎం) నేతలు ఈఎంఎస్ నంబూద్రిపాద్, ఏకే గోపాలన్ వంటి దిగ్గజ నేతలు జైలుకు వెళ్లారు. నాడు యువకులుగా నిర్బంధాలు ఎదుర్కొన్న వారిలో నేటికీ రాజకీయాల్లో కొనసాగుతున్న వారిలో డీఎంకే అధినేత స్టాలిన్, సీపీఐ(ఎం) అగ్రనేత ప్రకాష్ కారత్ వంటి కొందరు వర్తమాన తరానికి సజీవసాక్షులుగా నిలిచారు. నాటి నిర్బంధ చట్టం మీసా గుర్తుగా ఎమర్జెన్సీలో జన్మించిన తన కూతురుకు లాలూ ప్రసాద్ యాదవ్ ముద్దుగా మీసా భారతి అని పేరు పెట్టారు. ఆమె ప్రస్తుత లోకసభ సభ్యురాలు. దేశంలో1970 దశకం నుంచి అక్రమ నిర్బంధాలు, చట్టాల దుర్వినియోగాలు తీవ్రతరమయ్యాయి.

1980 దశకంలో రచనలు చట్టవిరుద్ధంగా ఉన్నా యన్న అభియోగంతో చెరబండ రాజు లోచన్ అనే కవులను ప్రభుత్వం ఉద్యోగాల నుంచి తొలగిస్తే, ఉద్యోగులయినంత మాత్రాన భావ ప్రకటన హక్కును కోల్పోరని వారి రచనల ప్రాతిపదికగా ఉద్యోగాల నుండి తొలగించ డానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ న్యాయమూర్తులు మాధవరెడ్డి, ముక్తధర్ తీర్పుచెప్పారు. రాజద్రోహం ఆరోపణలతో నమో దైన పసలేని కేసులను న్యాయస్థానాలు కొట్టేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి. దేశ చరిత్రలో వివిధ సందర్భాల నేపథ్యంలో ఎన్ ఎస్ ఏ, పీడీయాక్ట్ వంటిఎన్నో కఠిన తరమైన నిర్బంధ చట్టాలు వచ్చాయి. ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వాలు రాజ్యాంగ విరుద్ధంగా హక్కుల హననానికి పాల్పడి నప్పుడు బాధితులను న్యాయ స్థానాలే రక్షించాయి. కేవలం పరిమితమైన పత్రికలు పుస్తకాలు సమావేశాలు కళారూపాలు ఉద్యమాలు ఆందోళనలు తప్ప భావ ప్రకటనకు మరే దారిలేని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా విప్లవాలు వెల్లువెత్తిన గత శతాబ్ది చరిత్రకెక్కింది. మరి నేడో దాదాపుగా ప్రతి మనిషి చేతిలో ఒక సెల్ ఫోన్. అదే ఒక ప్రపంచ వేదిక. ప్రతి ఒక్కరూ క్షణాల్లో లోకం చుట్టగల యోధులే. ఈ దశలో భావ ప్రకటనలను నిర్బంధాలతో నియంత్రించడం సాధ్యమేనా?
ఒక నేరారోపణపై అరెస్ట్ అయిన వ్యక్తికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తే ప్రభుత్వం అంతటితో ఆగి తగిన సాక్ష్యాధారాలు కోర్టు ముందుంచాలి, వాదించాలి, శిక్ష పడేలా చేయాలి. అంతేగాని మరో పోలీస్ స్టేషన్లో నమోదైన అదే నేరారోపణపై అదే వ్యక్తిని ‘ఉపా’ వంటి కఠిన తరమైన చట్టాన్ని ప్రయోగించి అరెస్ట్ చేయడం తగని పని.

పగ ప్రతీకారాల కోసం చట్టాలను దుర్వినియోగం చేయడాన్ని సమాజం అంగీకరిం చదు. ఎర్రచందనం స్మగ్లర్ పాత్రలో నటించిన సీక్వెల్ సినిమా హీరోకు జాతీయ స్థాయి ఉత్తమ నటుడి పురస్కారం, సినిమాల్లోనే కాదు వేదికల మీదా బూతులు మాట్లాడే కథానాయకులకు పద్మ పురస్కారాల వల్ల సమాజానికి అందుతున్న సందేశం సత్ఫలితాలనివ్వదు. దేశాధినేతలే స్థాయి ని మరచి పరామర్శ పేరుతో సదరు హీరోల గృహాలను పావనం చేస్తూ కొమ్ములిస్తే వికృత పర్యవసానాలు చోటు చేసుకుంటాయని చెప్ప డానికి ఇటీవల పరిణామాలే రుజువు. వివిధ మతాలకు, కులాలకు, ప్రాంతాలకు, పార్టీలకు ప్రతి నిధులుగా చెప్పుకునే బాధ్యతగల పదవుల్లో ఉన్న వారి వైషమ్య పూరిత ప్రసంగాలు, అశ్లీలం హింస నేరాలు చేయడంలో కొత్త కొత్త పద్ధతులను వండి వారుస్తున్న టీవీ సీరియళ్లు, సినిమాలు, అంతర్జాలంతో పోల్చుకుంటే యూట్యూబర్లు చేస్తున్న వ్యాఖ్యలు వార్తా కథనాలు ఏ పాటి? ఒకవేళ అవి అభ్యంతరకరమైతే నియంత్రించ డానికి, విచారించడానికి శిక్షించడానికి చట్టాలే కరువయ్యాయా? ఉపా ప్రయోగం దాకా వెళ్లాలా? దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు, భద్రతకు భంగం కలిగించే కరడుగట్టిన సంఘవ్యతిరేక శక్తులను, దేశ ద్రోహులను శిక్షించడానికి ఉద్దేశిం చిన అత్యంత కఠినతర చట్టాలను రాజకీయ కక్ష సాధింపులకు వాడుకుంటే వాటి విశ్వసనీయత తగ్గిపోతుంది. ఈ నేపథ్యంలో వివిధ సందర్భాలలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రభుత్వాలు విస్మరించి ప్రవర్తించడం శోచనీయం. కోడిగొంతు నొక్కినంత మాత్రాన కొత్త పొద్దు పొడవకుండా ఆగుతుందా?​ ​

డా.అయాచితం శ్రీధర్, 984989323

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -