నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ లో జొన్నల కొనుగోళ్ల టికెన్ల పక్రియ వాడి వేడిగా మారింది. ఆయా గ్రామాల్లో ఉన్న రైతులకు అధికారులు ముడు కౌంటర్లు ఏర్పాటు చేసి టోకెన్లు ఇస్తున్నారు. దీంతో రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో కొందరు రైతులు కింద పడిపోయారు. పరిస్థితిని గమనించిన అధికారులు మహిళ సంఘాల ఆధ్వర్యంలో జొన్నల టోకెన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. విషయం తెలుసుకున్న మండల రైతులు శుక్రవారం సాయంత్రం నుంచే మండల కేంద్రానికి చేరుకొని మహిళా సంఘం కార్యాలయం వద్ద రాత్రి నుంచే బారులు తీరారు. రాత్రిని లెక్క చేయకుండా చీకటిలోనే రైతులు వరుసలో తమ తమ స్థానాల్లో బండారళ్ళు, టవేళ్ళు, తదితర వస్తువులు వరుసలో పెట్టి, కార్యాలయం వద్దనే నిద్రహారాలు మానేసి అక్కడే పడుకున్నారు.
అయితే కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్ కు రూ.3699 ఉండగా ప్రైవేట్ వ్యాపారుల మాత్రం ఇష్టానుసారంగా రూ.2100 నుంచి రూ.2300 వరకు తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ధరలకు మధ్య దాదాపు రూ.1300 వ్యత్యాసం ఉంది. దీనివలన తీవ్రంగా నష్టపోతామని గ్రహించిన రైతులు రాత్రికి రాత్రే పెద్ద మొత్తంలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు చేరుకుని టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి అధికారులు టోకెన్లు ఇవ్వడం ప్రారంభించారు. అయితే ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను అమ్ముకోవడానికి కూడా అంతకంటే ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతన్నలు వాపోతున్నారు.


