– ఆశయాల సాధనకు పోరాడుదాం
నవతెలంగాణ – అశ్వారావుపేట
దమ్మపేట మండలంలోని శ్రీరాంపురంలో సీపీఐ(ఎం) అమరజీవి కామ్రేడ్ గరిమెళ్ల వెంకటేశ్వరరావు 36 వ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. మండల కమిటీ సభ్యులు మోరంపూడి కేశవరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్ హాజరయ్యారు. గరిమెళ్ల స్మారక స్థూపం వద్ద పార్టీ జెండాను ఎగురవేసిన అనంతరం, మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు గరిమెళ్ల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో జిల్లా కమిటీ మాజీ సభ్యులు దొడ్డా లక్ష్మీనారాయణ, జిల్లా కమిటీ సభ్యులు పిట్టల అర్జున్,మండల కార్యదర్శి మోరంపుడి శ్రీనివాసరావు మాట్లాడుతూ గరిమెళ్ల వెంకటేశ్వరరావు తన జీవితాన్ని పేదలు, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతుల సమస్యల కోసం పనిచేయడానికే అంకితం చేశారని గుర్తుచేశారు. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని విశ్వసించిన ఆయన ప్రజా సమస్యలపై వర్గపోరాటాల్లో పాల్గొన్నారని తెలిపారు.
నాలుగు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో భూస్వాములు, పెత్తందారుల ఆధిపత్యం కొనసాగుతున్న సమయంలో పేద ప్రజలపై జరిగిన దాడులు, దోపిడీకి వ్యతిరేకంగా గరిమెళ్ల ప్రజల తరఫున నిలిచారని వక్తలు పేర్కొన్నారు. ప్రజలకు అండగా ఉంటూ ఈ ప్రాంతంలో సీపీఐ(ఎం) పార్టీ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. గరిమెళ్ల ఆశయాలను కొనసాగించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
కార్యక్రమంలో గరిమెళ్ల వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీరాం మూర్తి,శ్రీరాంపురం శాఖ కార్యదర్శి ఎస్‌కే జాన్‌పాషా, పర్వతనేని కాంతారావు, మోరంపూడి రామారావు, ఉసికెల బాలకృష్ణ, ఏచూరి కాటయ్య, గుంజి నాగేశ్వరరావు, వారిపల్లి రమేష్, గుంజి నరసింహారావు, మల్లయ్య, గరిమెళ్ల వెంకటేశ్వరరావు కుమారుడు శ్రీరాం మూర్తి పాల్గొన్నారు. గ్రామ పెద్దలు దొడ్డా ప్రసాదరావు, వల్లభనేని భద్రరావు, తుమ్మల రమణారావు, అల్లూరి ప్రసాద్, మోరంపూడి చెన్నారావు, నల్లమోతు ప్రసాద్ తో పాటు గరిమెళ్ల బంధువులు, మిత్రులు హాజరయ్యారు.



