నవతెలంగాణ – మునిపల్లి
మండలంలో గ్యాస్ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడ్తున్నారు. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పడరానిపాట్లు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ఎదుట పడిగాపులు కాసినా దొరకని పరిస్థితి.. మండలంలో అధిక శాతం ఉపయోగించేది ఇండియా గ్యాస్ అయితే గత కొన్ని నెలలుగా గ్యాస్ సరఫరా లేక మునిపల్లి మండల గ్రామీణ ప్రాంత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇండియా గ్యాస్ కార్యాలయం మండల కేంద్రంలోనే ఉండడంతో మండలంలోని ప్రజలు అధిక శాతం ఇండియా గ్యాస్ వాడుతాన్నరు. ఇదివరకు గ్యాస్ ఏజెన్సీలవాళ్ళు వాహనాల ద్వారా గ్యాస్ గ్రామాలకు సరఫరా చేసేవారు. అయితే గత కొన్ని నెలలుగా యుద్ధం పేరుతో, ఆన్లైన్లో సర్వర్ పేరుతో గ్రామీణ ప్రాంతాలకు గ్యాస్ సరఫరా నిలిపివేశారు. గ్యాస్ వినియోగదారులు మండల కేంద్రానికి వెళ్లి తీసుకోవాలంటే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ ఆఫీస్ లో గ్రామాలకు గ్యాస్ సరఫరా చేయడం లేదు ఎందుకు ..? అని అడుగుతే సరఫరా చేసే బాయ్ రావటం లేదని సాకులు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చేసే వాహనదారులకు ఇదే విషయాన్ని అడిగితే మాకు గోదాము నుండి సిలిండర్లు మాకు ఇవ్వడం లేదని చెప్పడం గమనార్ధం. వినియోగదారులు తప్పేదేమి లేక ద్విచక్ర వాహనం ఉన్నవాళ్లు ఒక గ్యాస్ బుడ్డిని పెట్టుకొని వెళ్లి తెచ్చుకుంటున్నారు, లేని వాళ్ళు ఆటోలో తెచ్చుకోవలసి వస్తుంది, కొందరైతే గ్యాస్ బండి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేసే ఓ మహిళ తను చేసే పని నుండి వచ్చిన తర్వాత గ్యాస్ లేక అద్దె ఇంట్లో కట్టెల పోయి పెట్టుకోలేక రాత్రి సమయంలో వంట చేసుకోలేక రెండు రోజులు కాలం గడిపినట్లు సమాచారం. ఏదేమైనా గ్యాస్ సరఫరా చేయడంలో మునిపల్లి ఇండియా గ్యాస్ ఏజెన్సీ యజమాన్యం విప్లమైందనే చెప్పుకోవచ్చు. గ్యాస్ యజమాన్యం అధిక రేటుకు అమ్ముకుంటుందని పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటుందని ఆయా గ్రామాల గ్యాస్ వినియోగదారులు ఆరోపిస్తున్నారు.
పరిస్థితి ఇలాగే కొనసాగితే పల్లెల్లోని గ్యాస్ వినియోగదారులు గ్యాస్ అందక ఇబ్బందులు ఎదుర్కొనవలసిన పరిస్థితి వస్తుందని అనేకుల అభిప్రాయం ఉంది. కొన్నిసార్లు గ్యాస్ ఏజెన్సీ వాళ్లకి ఫోను చేసి గ్యాస్ గ్రామాలకు ఎప్పుడు సరఫరా చేస్తారు అని అడిగితే పంపిస్తామని ఒకసారి, గ్యాస్ నిలువలు లేవని ఒకసారి , సరఫరా చేసే వాళ్ళు లేరని ఒకసారి, ఆన్లైన్ ప్రాబ్లం వస్తుందని ఒకసారి ఇలా అనేక సాకులు చెబుతున్నట్లు సమాచారం. ఇలా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ గ్యాస్ ను అధిక రేటుకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. సంబంధిత అధికారులు ఇండియా గ్యాస్ యజమాన్యంపై చర్యలు తీసుకుని గ్రామీణ ప్రాంతాలలోకి గ్యాస్ సకాలంలో సరఫరా చేసే విధంగా చూడాలని పలువురు వినియోగదారులు కోరుతున్నారు.



