Tuesday, August 25, 2026
E-PAPER
Homeజాతీయంఅధ్వానంగా ప్రభుత్వ పాఠశాలలు

అధ్వానంగా ప్రభుత్వ పాఠశాలలు

- Advertisement -

కనీస మౌలిక వసతులు
లేకపోవడంపై ఆందోళన
ఈ నేపథ్యంలో దేశాభివృద్ధి ఎలా సాధ్యం?
కేంద్ర‌, రాష్ట్రాల విద్యా శాఖ మంత్రుల‌కు
సీజేపీ చీఫ్‌ అభిజీత్ దీప్కే లేఖ‌
ప్రభుత్వ పాఠశాలలను యుద్ధప్రాతిపదికన
అభివృద్ధి చేయాలని డిమాండ్‌
‌నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దారుణంగా ఉందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజీత్ దీప్కే ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 80 ఏండ్లు గడుస్తున్నా, నేటికీ అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో దేశాభివృద్ధి ఎలా సాధ్యం? అని ఆయ‌న పేర్కొన్నారు. ప్రజా విద్యను ప్రాధాన్యతగా తీసుకొని పాఠశాలలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కేంద్ర విద్యా శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు అన్ని రాష్ట్రాల‌ విద్యా శాఖ మంత్రుల‌కు అభిజీత్ దీప్కే లేఖ రాశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు, మరుగుదొడ్లు, సరైన తరగతి గదులు, కనీసం కూర్చోవడానికి బెంచీలు కూడా అందుబాటులో లేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభుత్వ పాఠశాలల దృశ్యాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేయాల్సినవని తెలిపారు. దేశ భవిష్యత్తుగా భావించే చిన్నారులు ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవాల్సి రావడం బాధాకరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను అత్యవసర ప్రాధాన్యతగా తీసుకుని యుద్ధప్రాతిపదికన అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. అయితే సమస్యలను పరిష్కరించే ముందు, ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఏమిటో ప్రజలకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అందుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ బహిరంగ పర్చాలని విజ్ఞప్తి చేశారు. గత ఐదేండ్లలో ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు పునరుద్ధరించబడ్డాయని అభిజీత్‌ ‌దీప్కే ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నింటికి మరమ్మతులు లేదా పూర్తి పునర్నిర్మాణం అవసరం ఉందో వివరించాలని ఆ లేఖలో కోరారు. అలాగే ప్రస్తుతం ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఎన్ని ఉపాధ్యాయ పోస్టులు మంజూరయ్యాయి? వాటిలో ఎన్ని భర్తీ అయ్యాయి? ఇంకా ఎన్ని ఖాళీగా ఉన్నాయో వెల్లడించాలని కోరారు. అలాగే ఐదేండ్లలో ప్రభుత్వ పాఠశాలలకు ఎన్ని నిధులు కేటాయించారు? అందులో వాస్త‌వంగా ఎంత ఖర్చు చేశారో కూడా తెలపాలని అన్నారు.

ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేందుకు ఇంకా ఎన్ని అదనపు ప్రభుత్వ పాఠశాలలు అవసరం అవుతాయో కూడా చెప్పాలని కోరారు. ​బోధనతో పాటు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఎలాంటి బోధనేతర పనులు, బాధ్యతలు అప్పగించారో కూడా చెప్పాలని కేంద్రాన్ని అభిజీత్ దీప్కే పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు, డిజిటల్ లెర్నింగ్ సౌకర్యాలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, క్రీడా మైదానాలు, అవసరమైన క్రీడా పరికరాలు అందుబాటులో ఉన్నాయో కూడా వివరించాలని లేఖలో స్పష్టం చేశారు. అయితే ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాద‌నీ, ఏ ఒక్క ప్రభుత్వాన్ని విమర్శించడానికీ ఉద్దేశించినది కాదనీ, ఇది విద్యార్థుల భవిష్యత్తు గురించి రాసిన లేఖని అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -