Monday, May 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రహదారిపై జీపీ కార్మికుల ఆందోళన

రహదారిపై జీపీ కార్మికుల ఆందోళన

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల ఆవేదన ఆగ్రహంగా మారింది. గత ఎనిమిది నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సోమవారం అంబేద్కర్ సెంటర్ వద్ద పెద్దఎత్తున ధర్నాకు దిగారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్బంగా కార్మికులు మాట్లాడుతూ..నెలల తరబడి జీతాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోయారు. “రోజూ గ్రామాన్ని శుభ్రంగా ఉంచేది మేమే… కానీ మా కష్టానికి తగిన ప్రతిఫలం అందడం లేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి జీవనం సాగిస్తున్నామని, పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు భరించడం కష్టంగా మారిందని తెలిపారు.

ధర్నా ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, సంబంధిత అధికారులు ఇప్పటివరకు స్పందించకపోవడంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే బకాయి జీతాలు విడుదల చేయాలని, లేదంటే ఆందోళనను మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి విస్తరించడంతో పాటు పనులను బహిష్కరిస్తామని హెచ్చరించారు. స్థానిక ప్రజలు కూడా కార్మికుల సమస్యలకు మద్దతు తెలుపుతూ, వారి డిమాండ్లు న్యాయమైనవేనని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. “పారిశుధ్యాన్ని కాపాడే చేతులకు న్యాయం ఎప్పుడో?” అనే ప్రశ్న ప్రస్తుతం కాటారం ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -