Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్14 ఏండ్ల బాలికలకు హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభం

14 ఏండ్ల బాలికలకు హెచ్పివి టీకా కార్యక్రమం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో 14 సంవత్సరాల వయస్సు గల బాలికల కోసం హెచ్ పి వి  (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా కార్యక్రమం ఆదివారం ప్రారంభించనున్నట్లు  జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. డి. రవీందర్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం (మార్చి 8)న ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి కామారెడ్డి, ఏరియా ఆసుపత్రి బాన్సువాడలో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల కలిగే గర్భాశయ, గర్భద్వార క్యాన్సర్ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ టీకా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇవ్వబడుతున్న హెచ్ పి వి  టీకా సురక్షితమైనదిగా, శాస్త్రీయంగా నిరూపితమైనదిగా ఆయన పేర్కొన్నారు.

ఈ టీకా 14 సంవత్సరాల వయస్సు కలిగి ఉండి 15 సంవత్సరాలు పూర్తి కాని బాలికలకు (14వ పుట్టినరోజు జరుపుకొని 15వ పుట్టినరోజు జరుపుకోని బాలికలు) ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అర్హత గల బాలికలకు ఒక్క డోస్ టీకా అందజేస్తారన్నారు. ఈ టీకాలు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంబంధిత ఆరోగ్య కేంద్రాల్లో ఇవ్వబడతాయన్నారు. టీకా తీసుకోవడానికి వచ్చే బాలికలు తండ్రి లేదా సంరక్షకుడితో రావాలని, అలాగే వయస్సు నిర్ధారణ కోసం ఆధార్ కార్డు లేదా ఇతర చెల్లుబాటు అయ్యే పత్రం తీసుకురావాలని సూచించారు. టీకా వివరాలు యు – డబ్ల్యూఐఎన్  ఆన్‌లైన్ వ్యవస్థలో నమోదు చేయబడే కారణంగా ఓటిపి  కోసం మొబైల్ ఫోన్  తీసుకురావాలని తెలిపారు.

బాలికలు ఖాళీ కడుపుతో రాకూడదని వైద్య అధికారులు సూచించారు. టీకా కోసం ముందస్తుగా క్యూఆర్  కోడ్ స్కాన్ చేసి లేదా యు –  డబ్ల్యూఐఎన్   పోర్టల్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి కామారెడ్డి, ఏరియా ఆసుపత్రి బాన్సువాడలో ప్రారంభమవుతుందని, అనంతరం రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  ఈ టీకా అందుబాటులోకి తీసుకురానున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. తల్లిదండ్రులు, సంరక్షకులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అర్హత గల బాలికలకు హెచ్ పి వి  టీకా వేయించాలంటూ జిల్లా వైద్య  ఆరోగ్య అధికారి డా. డి. రవీందర్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -