మాకు అద్భుతమైన మద్దతు ఉంది ట్రంప్ తో ఎలాంటి విభేదాలు లేవు
సత్సంబంధాలు ఉన్నంత మాత్రాన
ట్రంప్ చెప్పిన ప్రతి దానికీ తల ఊపను
వాన్స్ వ్యాఖ్యలపై ఘాటుగా
స్పందించిన నెతన్యాహూ
టెల్ అవీవ్ : ఇజ్రాయిల్‌కు అత్యంత సన్నిహితమైన, శక్తివంతమైన భాగస్వామి అమెరికాయేనని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాటలను బట్టి చూస్తే అమెరికా మాత్రమే వారి భాగస్వామి కాదు. ఇరాన్‌తో కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని విమర్శించే బదులు దానికి మద్దతు ఇవ్వాలంటూ ఇజ్రాయిల్ నేతలకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన సూచనపై నెతన్యాహూ ఘాటుగా స్పందించారు. ఇజ్రాయిల్ యొక్క బలమైన అంతర్జాతీయ భాగస్వాములలో భారత్ కూడా ఒకటని చెప్పారు. అధ్యక్షభవనంతో పాటు ఇజ్రాయిల్‌కు మరికొందరు స్నేహితులు కూడా ఉన్నారని తెలిపారు. ‘చిన్న దేశంగా పిలిచే భారత్ వంటి స్నేహితులు మాకు ఉన్నారు. దాని జనాభా 140 కోట్లు. మాకు అక్కడ అద్భుతమైన మద్దతు ఉంది’ అని అన్నారు.
తనకు అమెరికా ఉపాధ్యక్షుడితో మంచి సంబంధాలు ఉన్నాయని, అయితే దాని అర్థం ప్రతి అంశం పైన ఇరువురు నేతలు ఏకాభిప్రాయంతో ఉన్నారని కాదని నెతన్యాహూ చెప్పారు. ‘ఆయనకు, నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఆయన చెప్పిన ప్రతి దానికీ నేను తల ఊపుతానని కాదు’ అని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు. అధ్యక్షభవనంలో తమకు ఎన్నడూ లేనంత గొప్ప స్నేహితుడు ఇప్పుడు ఉన్నాడని ప్రశంసించారు. తమకు విస్తృతమైన అంతర్జాతీయ మద్దతు ఉన్నదని చెప్పుకొచ్చారు. ‘ఈ ఫేస్‌బుక్ వ్యవహారం…అక్కడ నాకు లభిస్తున్న అపారమైన మద్దతులో మునిగిపోతున్నాను. అంతేకాదు…ఇంకా చాలా మంది నుంచి ఇలాంటి స్పందనే వస్తోంది. ప్రజాభిప్రాయం మీకు కొంత ఇబ్బంది కలిగించినా మిమ్మల్ని మేము గౌరవిస్తామంటూ పలువురు నాయకులు నాకు ఫోన్ చేసి చెబుతుంటారు’ అని అన్నారు. అయితే తమ సంబంధాలు పైకి కనిపించేలా ఉండవని చెప్పారు. దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయిల్ సేనల మోహరింపును సమర్ధించుకున్నారు. హిజ్బొల్లా ప్రభావం నుంచి లెబనాన్‌కు విముక్తి కలిగించాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని నెతన్యాహూ అన్నారు.
మీకు ఏకైక సానుభూతిపరుడు ట్రంపే : వాన్స్
సైనిక శక్తిపై ఇజ్రాయిల్ ఆధారపడడాన్ని వాన్స్ ప్రశ్నించారు. అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై దాడి చేయడానికి బదులు తమ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఇజ్రాయిల్‌ను కోరారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ విషయంలో సానుభూతితో ఉన్న ఏకైక దేశాధినేత ట్రంప్ మాత్రమేనని చెప్పారు. ఒకవేళ తాను ఇజ్రాయిల్ క్యాబినెట్‌లో ఉండి ఉంటే ప్రపంచంలో తమకు మిగిలిన ఏకైక శక్తివంతమైన మిత్రదేశంపై విమర్శలు చేసి ఉండే వాడిని కానని అన్నారు. ఇజ్రాయిల్ దీర్ఘకాల భద్రతా వ్యూహాన్ని కూడా వాన్స్ ప్రశ్నించారు.
‘మీ కచ్చితమైన ప్రతిపాదన ఏమిటి? మీ దేశ జనాభా 90 లక్షలు. మీకు ఉన్న ప్రతి జాతీయ భద్రతా సమస్యను కేవలం హత్యల ద్వారా పరిష్కరించుకోలేరు’ అని అన్నారు. ఇజ్రాయిల్‌కు దీర్ఘకాలంగా ఇస్తున్న సైనిక మద్దతును ఆయన గుర్తు చేశారు. ఇజ్రాయిల్ రక్షణ ఆయుధాలలో మూడింట రెండు వంతులు అమెరికా నిర్మించినవేనని, అవి అమెరికా పన్ను చెల్లింపుదారుల సొమ్ముతో తయారు చేసినవని తెలిపారు. లెబనాన్‌పై ఇజ్రాయిల్ చేస్తున్న నిరంతర దాడులను వాన్స్ విమర్శించారు. ఇజ్రాయిల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉన్నదని, అయితే శాంతి ప్రక్రియకు మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉన్నదని ఆయన చెప్పారు.
భారత్ కూడా భాగస్వామే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



