నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా దాడులు ప్రతిదాడులతో అట్టుడుగుతోంది. గల్ప్ దేశాల్లో ఉన్న యూఎస్ సైనిక స్థావరాలపై దాడులను తీవ్రతరం చేసింది ఇరాన్. జోర్డాన్ లోని పలు యూఎస్ ఆర్మీ బేస్ క్యాంపులపై దాడులు చేసినట్టు ఇరాన్’స్ రెవల్యూషనరీ గార్డ్స్ వెల్లడించింది. ఈ దాడిలో యూఎస్ కు భారీ నష్టం జరిగిందని, పలు రకాల యుద్ధ విమానాలు, జెట్స్ నేలకూలినట్లు తెలియజేసింది.
ఇరానియన్ సైనికుల హత్యకు ప్రతీకారంగా, సిరియాలోని అల్-టన్‌ఫ్ వద్ద ఉన్న అమెరికా ప్రత్యేక కార్యకలాపాల కమాండ్ సెంటర్‌పై కూడా తాము దాడి చేశామని IRGC పేర్కొన్నట్లు ప్రభుత్వ మీడియా తెలిపింది. ఈ దాడులపై జోర్డాన్ ప్రభుత్వం స్పందించింది. తమ సైన్యం మూడు ఇరాన్ క్షిపణులను కూల్చివేసిందని, ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని తెలియజేసింది.
కాగా,గత నెలలో ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం విఫలమైంది. హర్మూజ్ జలసంధిపై నియంత్రణ కోసం అమెరికా, ఇరాన్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. దీంతో ఆ జలసంధి గుండా నౌకల రాకపోకలు స్తంభించాయి. హోర్ముజ్ జలసంధిపై టెహ్రాన్ తన పట్టును సడలించేలా ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.



