Sunday, September 13, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిజడ్జిల నిర్వాకాలు న్యాయవ్యవస్థ సవాళ్లు

జడ్జిల నిర్వాకాలు న్యాయవ్యవస్థ సవాళ్లు

- Advertisement -

ఎవరైనా తగాదాలో, వివాదాలో వస్తే న్యాయం కోసం వెళతారు. న్యాయస్థానాల స్థాయిని బట్టి వారు చెప్పే తీర్పులు అంతిమమవుతాయి. మిగిలిన జీవనరంగాలేవైనా రాజ్యాంగ పరంగా న్యాయస్థానాలు చెప్పేదే పరిష్కారమవుతుంది. అందుకు రాజ్యాంగం ఆ వ్వవస్థకు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తి కల్పించింది. దానికి ప్రాతినిధ్యం వహించే న్యాయమూర్తుల నియామకాలు కూడా రాష్ర్టపతి ద్వారానే జరగాలని నిర్దేశించింది. మిగిలిన వ్యవస్థలలాగే ఇది కూడా అప్పుడున్న సమాజ వ్యవస్థకు అతీతం కాకున్నా రాజ్యాంగ హోదా కారణంగా కొన్ని ప్రమాణాలు పద్ధతులూ పాటించడం తప్పనిసరిగా భావించ బడింది. రాజ్యాంగస్పూర్తికి నిర్వచనం చెప్పగల, కీలక పదవులు నిర్వహించేవారిపై తీర్పులు చెప్పగల అవకాశం అధికారం కోర్టులకే వుంది గనక వాటికి ప్రత్యేక గౌరవం, విలువ కొనసాగుతూ వస్తున్నాయి. న్యాయమూర్తులపై బహిరంగ విమర్శలు చేయడం, అంతకుమించి ఉద్దేశాలు ఆపాదించడం, కోర్టు ధిక్కారానికి పాల్పడటం వంటివి తీవ్ర తప్పిదాలుగా పరిగణించ బడుతుంటాయి. న్యాయం పేరుతో అనేక అభ్యంతరకర ఆదేశాలు, తీర్పులు చలామణి అవుతున్నా చట్టమే మార్చితే తప్ప ఎవరూ మాట్లాడగలిగింది వుండదు. అయితే విచిత్రమేమంటే ఇటీవలి కాలంలో న్యాయమూర్తులను అందునా ఉన్నత అత్యున్నత న్యాయమూర్తులను మరెవరో అభిశంసించడం గాక తమను తామే వీధిన పెట్టుకుంటూ వివాదాలు పెంచు కుంటున్నారు. అది కూడా న్యాయానికి సంబంధం లేని వ్యక్తిగత పోకడల కారణంగా ఇలా జరగడం మరీ దారుణం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ‌వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం కారణంగా నోట్ల కట్టలు కాలిపోయాయనే వార్త దేశమంతా దుమారం రేపింది.

పార్లమెంటు కూడా జోక్యం చేసుకోవలసి వచ్చింది. న్యాయవ్యవస్థ కూడా అవినీతికి అతీతం కాదనే ఆరోపణలు కొన్ని కేసులు వున్నా ఇంత బాహాటంగా దొరికిపోవడం ఇదే ప్రథమం.మొదట మొండిగా ఎదురుదాడి చేసిన ఆయన చివరకు ముందే రాజీనామా చేసి తప్పుకోవలసి వచ్చింది. అయినా గత పార్లమెంటు సమావేశాలలో ఆయనపై జెపిసి నివేదిక సమర్పించింది. ఒక రాజ్యాంగ న్యాయస్థానంలో ఇలా జరగడం తలవంపులు తెచ్చింది. దేశానికే అత్యున్నతమైన ప్రధాన న్యాయమూర్తి(సిజెఐ) సూర్యకాంత్‌ అసహన వ్యాఖ్యలు అనేక సార్లు వివాదాలకు దారితీశాయి కానీ ఈ కాలంలో అంతకుమించిన ప్రకంపనాలే సృష్టించాయి. కోర్టులలో వాదించే న్యాయవాదులు, బార్‌ ‌కౌన్సిళ్లు, ప్రజాప్రయోజన వాజ్యాలు వేసేవారికి సంబంధించిన వివాదాలు చాలాచోట్ల నడిచాయి. మీరు బెదిరిస్తే భయపడ బోమని చెప్పడం వారు నిరసన తెల్పడం చూశాం. కానీ, సిజెఐ అంతటితో ఆగక మీరు నకిలీ డిగ్రీలు తెచ్చుకుని పనిలేక పిల్స్‌ ‌వేయడం, ఆర్‌‌టిఐ కార్యకర్తలుగా మారడం, యూట్యూబు పోస్టులు పెట్టడం చేస్తున్నారని సిజెఐ సూర్యకాంత్‌ ‌రెచ్చిపోయారు. నిరుద్యోగులను బొద్దింకలంటూ తూలనాడారు. ఇంకేముంది? నిజంగానే సిజెపి(కాక్రోచ్‌ ‌జనతా పార్టీ) పుట్టింది. జెన్‌ ‌జి ఉద్యమం వూపేసింది.

తర్వాతనైనా దిద్దుకున్నారా అంటే లేదు. తర్వాత కూడా వారి వాదనలు వినడానికి నిరాకరించారు. జంతర్‌ ‌మంతర్‌ ‌దగ్గర పోలీసు హింసాకాండపై దేశం అట్టుడికిపోతుంటే అభ్యర్థన ఆలకించడానికి తిరస్కరించారు. వినడానికి సమయం లేదన్నారు.అందరి ఆగ్రహం చూశాకనే ఆలస్యంగా విచారణ చేపట్టారు. అప్పుడు కూడా తన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టించారని ఎదురుదాడి చేశారు. విద్యార్థులపై కేసుల ఎత్తివేత అంటూనే తీవ్రనేరాలు చేసినవారిపై కేసులు కొనసాగించుకోవచ్చని మినహాయింపునిచ్చారు. అంటే అనివార్యంగా తప్ప ఆయన మనస్పూర్తిగా ఇవన్నీ చేస్తున్నారా అని విమర్శకులు సందేహించవలసిన పరిస్థితి తెచ్చిపెట్టారు. రాజ్యాంగ మౌలిక స్వభావానికే ఎసరుపెట్టే ‘సర్‌’ వంటి పలు శాసనాలపై అరకొర చర్యలతో తంతు నడిపించారు. 1972 ప్రార్థనా స్థలాల చట్టం వున్నా కూడా కాశీ మధురైతో సహా అన్నీ తిరగదోడటానికి అవకాశమిస్తున్నారు.

హైకోర్టు తాత్కాలిక సిజె
ఇక హైకోర్టుల పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు.రాజస్థాన్‌ ‌హైకోర్టు తాత్కాలిక సిజె సంజీవ్‌ ‌ప్రకాశ్‌ ‌శర్మ ఆ పదవికి తగని విధంగా వ్యవహరిస్తున్నారంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి సందీప్‌ ‌మెహతా సిజెఐకి నాలుగు లేఖలు రాశారు. ఇది బహిరంగ చర్చగానే నడిచింది. సిజెఐ తాను చర్యలు తీసుకుంటానంటూనే ఇలాంటివి తన దృష్టికి తేవాలి తప్ప వివాదం చేయకూడదని వ్యాఖ్యానించారు. తర్వాత ఆయనను బదిలీ చేసి ఆ స్థానంలో ఛత్తీస్‌‌గఢ్‌ సిజె సంజయ్‌ ‌కుమార్‌‌ను నియమించారు. కానీ, కేంద్రం దాన్ని ఆలస్యం చేయడంతో రచ్చ జరిగాక కూడా శర్మ మరి కొన్ని రోజులు కొనసాగారు. అంతేగాక ఆ సమయంలో తనపై ఫిర్యాదు చేసిన జస్టిస్‌ ‌మెహతాకు ఉద్దేశాలు ఆపాదిస్తూ బహిరంగ వ్యాఖ్యలు పెట్టారు. నిజానికి మెహతా దీనిపై ఆరు లేఖలు రాశారు. సంజయ్‌ ‌కుమార్‌‌ను పంపించడం గురించి 2022 నుంచి సిఫార్సులు నడుస్తున్నా కేంద్రం తుది నిర్ణయం తీసుకోకపోవడం ఇంతకు దారితీసింది. మొదట ఎదురుదాడి చేసిన జస్టిస్‌ ‌శర్మ తర్వాత విధులకు దూరంగా జరగడంతో కథ సుఖాంతమైంది. కానీ, ఈ నేపథ్యాలు గలవారు వ్యవస్థలోనే కొనసాగుతుంటారని గుర్తుంచుకోవాలి. ఇక ఢిల్లీలో రోహిణి కోర్టు జడ్జి రాకేశ్‌ ‌కుమార్‌ హైకోర్టు ‌బదిలీ చేసింది. ఒక మహిళా అడ్వకేట్‌తో అనుచితంగా ప్రవర్తించారని ‌వీడియోలు వైరల్‌ ‌కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపున మహరాష్ర్ట న్యాయ శాఖాధికారి దిలీప్‌ ఎస్‌ ‌గోహరే కోర్ ధిక్కారానికి పాల్పడటంతో ముంబాయి హైకోర్టు ధర్మాసనం శిక్షణా చర్య తీసుకుంది. ఫాస్ట్‌‌ట్రాక్‌ ‌కోర్టులలో నియామకాలు జరగలేదన్న కోర్టు విచారణలో ఆయన కేకలు వేసి రభస సృష్టించడం ఇందుకు కారణమైంది. సుప్రీంకోర్టు ఆయన చేసింది తప్పని చెబుతూనే ప్రస్తుతానికి చర్యను వాయిదా వేసింది.

ఇటీవలి కాలంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ ‌(ఎన్‌‌సిటిఎల్‌) నుంచి వచ్చింది. జీ మీడియా అధిపతి సుభాష్‌ ‌చంద్ర బ్యాంకులకు బకాయి పడిన రూ.22 వేలకోట్లకు గాను ఆరు కోట్లు ఇచ్చి తుది పరిష్కారం చేసుకోవడానికి అంగీకారం తెల్పడం దేశాన్ని దిగ్ర్భాంత పరచింది. సామాన్యులపై చిన్న విషయాలకే విరుచుకుపడుతూ నిబంధనల పేరిట వేధించే బ్యాంకులు ఇంత చిల్లరపైసలకే ఒప్పుకోవడం ఒకటైతే దానికి న్యాయముద్ర లభించడం మరింత దారుణమని అందరూ ఆగ్రహించడంతో తీర్పును విస్తృత ధర్మాసనానికి నివేదిస్తూ పరువు కాపాడుకున్నది. ఇలాంటివి మరెన్ని అన్యాయమైన మోసపూరిత పరిష్కారాలు జరిగాయో? జరుగుతున్నాయో ఊహించవలసిందే. నిజానికి ఎన్‌‌సిఎల్‌‌టి జడ్జి ఒకరు ధర్మాసనం నుంచే తనను ఒక న్యాయవ్యవస్థ ప్రతినిధి ఒకరు ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించిన ఘటన అంతకుముందు జరిగిందని కూడా ఇక్కడ గుర్తుచేయాలి.

పారదర్శకత?
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఉజ్జల్‌ ‌భయాన్‌ కొద్ది రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు ఈ నేపథ్యంలోనే ప్రాధా న్యత సంతరించుకున్నాయి. న్యాయపరమైన ప్రతిభవున్న వారిని సీనియారిటీతో నిమిత్తం లేకుండా న్యాయమూర్తులుగా నియమించేందుకు అవకాశం వున్నా ఇంతవరకూ అసలు ఉపయోగించుకోలేదని ఆయన అన్నారు. నియామకాలకు నిరా కరణకు కూడా కొలీజియం కారణాలు చెప్పకపోవడంతో పారదర్శకత లోపిస్తున్నదని జస్టిస్‌ ‌భూయాన్‌ ‌అభిప్రాయపడ్డారు. అలహాబాద్‌ ‌హైకోర్టుకు చెందిన జస్టిస్‌ సురభ కుర్పాల్‌‌ను కారణం చెప్పకుండా రెండు సార్లు కొలీజియం తిరస్కరించింది. వాస్తవానికి ఆయన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌‌ను అతిగా కీర్తించడం ఇందుకు కారణమైంది. అలాగే విహెచ్‌‌పి సభలకు హాజరై ఉమ్మడి సివిల్‌ ‌కోడ్‌ ‌కావాలని వాదించడం కూడా కొలీజియం పరిగణనలోకి తీసుకుంది. ఇవి బయటకు చెప్పకపోవడం వల్ల సరైన సంకేతాలు అందకుండా పోయాయి అని భూయాన్‌ ‌స్పష్టం చేశారు. ఇటీవలనే యుపిలోని ముజఫర్‌ ‌పూర్‌ ‌జిల్లా జడ్జి శేఖర్‌ ‌కుమార్‌ యాదవ్‌ ‌వరుసగా అయిదు నెలల్లో 23 మందికి మరణశిక్షలు వేశారు. తాను అందుకు వెనుకాడే పిరికివాడిని కాదని గొప్పలు చెప్పారు. అంతేగాక హిందువులైతే ఇలాంటివి చేయరంటూ మతవిద్వేష వ్యాఖ్యలు చేశారు.

జస్టిస్‌ ‌దీపక్‌ ‌గుప్తా మాట
మళ్లీ సిజెఐ విషయానికి వస్తే ఇటీవలనే బీజేపీకి చెందిన న్యాయవాది గౌరవ్‌ ‌భాటియా సుప్రీంకోర్టు ప్రతిపక్ష నేత రాహుల్‌‌గాంధీ పట్ల పక్షపాతం చూపిస్తున్నదని ఆరోపించారు. రాహుల్‌‌పై తామిచ్చిన పరువు నష్టం కేసు విచారణకు తీసుకోకుండా సుప్రీంకోర్టు రిజిస్రీటీ తొక్కిపెడుతున్నదని నేరుగా సిజెఐ కోర్టులోనే భాటియా ఆరోపించినా ఈయన ఎలాంటి ఆగ్రహానికి గురికాకపోవడం ఆశ్చర్యం కలిగించింది. మీడియా కేసులలోనూ రాష్ట్రప్రభుత్వాలపైన పార్టీలపైన ఎన్నోసార్లు విరుచుకుపడే సిజెఐ కేవలం వివరణతో సరిపెట్టారు. ఇది నిజానికి మన న్యాయవ్యవస్థలో నెలకొన్న ద్వంద్వప్రవృత్తిని, వర్గస్వభావాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పాలి.

ఇలాంటి అనేక ఉదాహరణలు ఇంకా వున్నా ఇప్పటికే జస్టిస్‌ ‌దీపక్‌ ‌గుప్తా మాటలతో ముగించవచ్చు. దేశ స్వాతంత్రానికి ఎనభై ఏండ్లు వచ్చినా స్వతంత్ర న్యాయవ్యవస్థ, నిర్శయంగా వ్యవహరించే న్యాయమూర్తులు వచ్చే వరకూ స్వతంత్రం పరిపూర్ణం కాదని ఆయనన్నారు. సమగ్ర వ్యక్తిత్వం,మేధా శక్తి అంతకు మించి వెన్నెముక గల న్యాయ మూర్తులు వున్నప్పుడే నిజంగా న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎందుకంటే న్యాయమూర్తులు కేవలం తీర్పరులే కాదు రక్షకులుగా కూడా వుండాలని నొక్కిచెప్పిన మాటకూ ఇప్పటివరకూ చూసిన సందర్భాలకూ ఎంత తేడా? ముందే చెప్పినట్టు ఇది కేవలం వ్యక్తులుగా వారి పాత్రనే గాక న్యాయవ్యవస్థ పరిమితిని కూడా చెబుతుందని అర్థం చేసుకోవాలి. ఏమైనా మార్క్స్ చెప్పినట్టు వ్యవస్థపై చట్టం ఆధారపడి వుంటుంది గానీ వ్యవస్థ చట్టం ప్రకారం నడవదు. పాలకుల సామదానభేద దండోపాయాలకు అది అతీతం కాదు.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -