Tuesday, May 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమరో వెనిజులాను కానివ్వం

మరో వెనిజులాను కానివ్వం

- Advertisement -


ట్రంప్‌ ఒత్తిడికి లొంగని క్యూబా
హవానా : జనవరిలో వెనిజులాపై సైనిక చర్యకు పాల్పడి నికొలస్‌ మదురోను నిర్బంధించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దృష్టి కమ్యూనిస్టు క్యూబాపై పడింది. వెనిజులాపై జరిపిన మాదిరిగానే క్యూబాపై కూడా దాడి చేసి ఆ దేశాన్ని తన అధీనంలోకి తీసుకోవాలని ట్రంప్‌ విశ్వప్రయత్నం చేస్తున్నారు. అయితే అమెరికా సామ్రాజ్యవాదానికి తలవంచే ప్రసక్తే లేదని క్యూబా స్పష్టం చేస్తోంది. వెనిజులా 2.0గా క్యూబా ఎందుకు మారదు అని ప్రశ్నిస్తే దానికి అనేక కారణాలు కన్పిస్తాయి.
1959లో ఫిడెల్‌ కాస్ట్రో విప్లవం తర్వాత క్యూబా అనేక దశాబ్దాలుగా అమెరికాను శత్రువుగానే చూస్తోంది. వెనిజులా సైన్యంతో పోలిస్తే క్యూబా సేనలు సైద్ధాంతికంగా పాతుకుపోయాయి. వారి మధ్య సమన్వయం ఎక్కువ. వారిలో పోరాట పటిమ అధికంగా ఉంటుంది. వెనిజులా నేత నికొలస్‌ మదురోకు భద్రత కల్పించిన అనేక మంది క్యూబా సైనికులు అమెరికా దాడిలో మరణించారు. ఆ దాడి నుంచి బయటపడిన వారికి అమెరికా దళాల వ్యూహం ఎలా ఉంటుందో బాగా తెలుసు. నిఘా, ఇంటెలిజెన్స్‌ వ్యవస్థల విషయానికి వస్తే క్యూబా పటిష్టంగా ఉంది. సంవత్సరాల తరబడి రష్యా, చైనాలతో కొనసాగిన సహకారమే దీనికి కారణం.

ఇరాన్‌పై జరిపిన యుద్ధంలో అమెరికాకు రోజుకు బిలియన్‌ డాలర్లు ఖర్చయ్యాయి. ఇప్పుడు అమెరికా భారీ బడ్జెట్‌ లోటునుఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితులలో క్యూబాపై అమెరికా కయ్యానికి కాలు దువ్వుతుందా అనే ప్రశ్న తలెత్తుతోంది. వెనిజులాలో మదురోను తొలగించడం ద్వారా ఆ దేశంతో వ్యాపార సంబంధాలను ట్రంప్‌ మార్చుకోగలిగారు. కానీ క్యూబా విషయంలో అలా కాదు. అక్కడ అధికారులు మారితే తప్ప ట్రంప్‌ ఏమీ చేయలేరు. ట్రంప్‌కు సహకరించేందుకు క్యూబా అధికారులు ససేమిరా అంటున్నారు. వెనిజులాలో మదురో ప్రభుత్వం మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు సహకరిస్తోందన్న ఆరోపణతో ఆ దేశంపై దాడికి ట్రంప్‌ తెగబడ్డారు. కానీ క్యూబాపై దాడి చేయడానికి ఆయనకు అలాంటి కారణమేదీ లేదు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అమెరికాకు సహకరిస్తున్నామని క్యూబా ప్రభుత్వం చెబుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -