నవతెలంగాణ – హైదరాబాద్ : టిబెట్‌లో బుధవారం భారీ భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో పొరుగు దేశమైన నేపాల్‌లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదైనట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ వెల్లడించింది. భూ అంతర్భాగంలో 35 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు ఈ సంస్థ పేర్కొంది.
కాగా, భారత జాతీయ భూకంప పరిశోధన కేంద్రం మాత్రం భూకంప తీవ్రతను 5.0గా నిర్ధారించింది. టిబెట్‌లో సంభవించిన ఈ భూకంపం కారణంగా నేపాల్‌లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో, భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెలువడాల్సి ఉంది.


