Tuesday, April 21, 2026
E-PAPER
HomeజాతీయంMorning Walk TAX: ఇక నడవాలంటే పన్ను కట్టాల్సిందే..

Morning Walk TAX: ఇక నడవాలంటే పన్ను కట్టాల్సిందే..

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: ఇక నడవాలంటే కూడా పన్ను కట్టాల్సిందే. ఉదయపు నడక శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒక అద్భుతమైన వ్యాయామం. రోజుకు కనీసం 30-60 నిమిషాలు వేగంగా నడవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది, బరువు తగ్గుతారు, రక్తపోటు అదుపులో ఉంటుంది. ఒత్తిడి తగ్గి రోజంతా ఉల్లాసంగా ఉంటారు. తాజా గాలి, సూర్యరశ్మి (విటమిన్ డి) లభించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెబుతుంటారు. ప్రజారోగ్యం పట్ల ఏ మాత్రం బాధ్యతలేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడకకు పన్ను విధిస్తోంది. తాజాగా విశాఖపట్నంలోని జివిఎంసి ఆధీనంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం, రాజీవ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం వంటి వాటిలో ఆరోగ్య రక్షణ కోసం నడక సాగించే వారిపై యూజర్ ఛార్జీలు వసూలు చేయడం మొదలు పెట్టారు. టిడిపి కూటమి ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే రూ.720 చెల్లించాలని అధికారులు ఆదేశించారు.

వివిధ క్రీడా శిక్షణలు పొందే విద్యార్థులు, క్రీడాకారులపై రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు యూజర్ ఛార్జీల వసూలుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రజా వ్యతిరేక చర్యలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వాకర్స్ తో కలిసి సీపీఐ(ఎం) మాజీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బి.గంగారావు నిరసన ర్యాలీ నిర్వహించారు. జివిఎంసి అదనపు కమిషనర్ డివి.రమణమూర్తికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ యూజర్ ఛార్జీలకు వ్యతిరేకంగా అన్ని చోట్లా తీవ్ర నిరసనలు వ్యక్తమువుతున్నాయన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత జివిఎంసి మీద ఉందన్నారు. అందుకు అవసరమైన అనేక ఆరోగ్య రక్షణ, క్రీడా సదుపాయాలు, సేవలు అందించాల్సిన బాధ్యత జివిఎంసి మీద ఉందన్నారు. నడకను, క్రీడలను, వ్యాయామాన్ని వ్యాపార సరుకుగా జివిఎంసి మార్చ కూడదన్నారు.

జివిఎంసి 2025-26 బడ్జెట్ రూ.4200 కోట్లని, ప్రజలు ఆస్తి పన్ను, బిల్డింగ్ రుసుములు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు, నీటి ఛార్జీలు, వృత్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్, గ్రంథాలయ సెస్, ప్రకటనల పన్ను వంటి అనేక పన్నులు, రుసుముల ద్వారా జివిఎంసికి ఈ ఆదాయాన్ని సమకూరుస్తున్నారని తెలిపారు. వీటి ద్వారా జివిఎంసి సదుపాయలన్నీ కల్పించాల్సి ఉందన్నారు. అలాంటిది తిరిగి యూజర్ ఛార్జీలు వసూలు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. అక్కడ వాకర్స్, క్రీడాకారులకు రూ.3 వేల నుండి 14 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని తెలిపారు. పేద, సాధారణ, మధ్య తరగతికి ప్రవేశం లేకుండా చేశారన్నారు. కాంట్రాక్టర్ రూ.2 కోట్లు లీజు చెల్లించకుండా నిరాకరించినా అధికార కూటమి ప్రభుత్వ ఒత్తిడి వల్ల జివిఎంసి ఏ చర్యా తీసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉందన్నారు. తక్షణం జివిఎంసి కమిషనర్ స్పందించి నడకపై యూజర్ ఛార్జీలను, వ్యాయామ, క్రీడాకారులపై విధించిన ఫీజులను ఉపసంహరించుకోవాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -