ఇంటి పోరుతో సతమతం
వాషింగ్టన్ : అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇంటి పోరు తప్పేలా లేదు. ప్రతినిధిసభ కాంగ్రెస్‌లో ఇప్పటి వరకూ ట్రంప్‌ను ధిక్కరించేందుకు వెనుకాడిన కొందరు రిపబ్లికన్ సభ్యులు తాజాగా ఆయనపై కారాలు మిరియాలు నూరుతున్నారు. గత వారం సెనెట్‌లోనూ, కాంగ్రెస్‌లోనూ కొందరు రిపబ్లికన్ సభ్యులు ఇరాన్‌పై యుద్ధాన్ని బహిరంగంగానే వ్యతిరేకించారు. అధ్యక్షభవనం బాల్‌రూమ్ కోసం బిలియన్ డాలర్లు కేటాయించాలన్న ప్రతిపాదనను తోసిపుచ్చారు. తన మద్దతుదారుల కోసం 1.8 బిలియన్ డాలర్లతో పరిహార నిధిని ఏర్పాటు చేయడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలను నిలువరించి దానిని వెనక్కి తీసుకునేలా చేశారు. దేశంలో గూఢచర్యం కోసం ఓ బిల్లును ట్రంప్ ప్రతిపాదించగా దానిని అడ్డుకున్నారు. తాజాగా ట్రంప్‌ను ధిక్కరించి ఉక్రెయిన్‌కు సాయం అందించేందుకు, రష్యాపై కొత్తగా ఆంక్షలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లును ఆమోదించారు.
నిజమైన తిరుగుబాటేనా?
జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ట్రంప్ నిజంగానే తిరుగుబాటును ఎదుర్కొంటున్నారా అనే అనుమానం రాకమానదు. ‘ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రజలు తాము కోరుకుంటున్న విధంగానే ఓటు వేయబోతున్నారు’ అని రిపబ్లికన్ సెనెటర్ థామ్ టిల్లిస్ చెప్పారు. ట్రంప్ చెప్పుకుంటున్న ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను వ్యతిరేకించిన తర్వాత గత సంవత్సరం ఆయన సెనెట్ నుంచి పదవీ విరమణను ప్రకటించారు. అయితే ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీలో కూడా కొందరు ట్రంప్‌ను సమర్ధిస్తుండడం గమనార్హం. ట్రంప్ కారణంగా బయటకు పోయిన వారే ఆయనను వ్యతిరేకిస్తున్నారని, వాస్తవానికి ఆయనకు రిపబ్లికన్ పార్టీపై పూర్తి పట్టు ఉన్నదని డెమొక్రాట్ సెనెటర్ జాన్ ఫెట్టర్‌మాన్ చెప్పారు. కాగా రిపబ్లికన్ల అసమ్మతిని ‘ఎన్నికల సంవత్సరపు రాజకీయాలు’గా పేరు చెప్పడానికి ఇష్టపడని అధ్యక్షభవనం అధికారి ఒకరు అభివర్ణించారు. ప్రతి సభ్యుడు ప్రతి ఒక్క అంశంపై రాజకీయ మూల్యం చెల్లించుకోలేడని అన్నారు.
పెరుగుతున్న అసంతృప్తి
సభకు తిరిగి ఎన్నికయ్యేందుకు రిపబ్లికన్ సెనెటర్లు బిల్ కాసిడి, జాన్ కార్నిన్‌లు చేసిన ప్రయత్నాలను ట్రంప్ వ్యతిరేకించినప్పటి నుంచి అధికార పార్టీలో నిరాశ, అసంతృప్తి పెరిగాయని కొందరు సభ్యులు తెలిపారు. పైగా ట్రంప్ తన అసందర్భపు ప్రకటనలతో రిపబ్లికన్ అజెండాను ప్రమాదంలో పడేస్తుండడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. రిపబ్లికన్ల వ్యతిరేకతను బేఖాతరు చేస్తూ ట్రంప్ తాజాగా తన విధేయుడైన బిల్ పుల్టేను తులసి గబ్బార్ట్ స్థానంలో తాత్కాలిక నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్‌గా నియమించారు. పుల్టేను శాశ్వత ప్రాతిపదికన నియమించడాన్ని తాను సమర్ధించబోనని రిపబ్లికన్ సెనెటర్ మిచ్ మెక్‌కానెల్ స్పష్టం చేశారు. చట్టప్రకారం నామినీలకు విశేష అనుభవం ఉండా లని, ఆ అర్హత లేని ఏ నామినీకి ఓటు రాదని చెప్పారు.
అటార్నీ
జనరల్ నియామకంపై సెనెట్‌లో
వ్యతిరేకత
ట్రంప్‌పై కాంగ్రెస్, సెనెట్‌లలో రిపబ్లికన్ల వ్యతిరేకత ఇప్పటి వరకూ నామమాత్రంగానే ఉంది. తాజాగా ఆ పార్టీకి చెందిన ముగ్గురు సెనెటర్లు పరిహార బిల్లును వ్యతిరేకించిన డెమొక్రాట్లతో జత కలిశారు. రాబోయే కాలంలో ట్రంప్ ఓ పెద్ద సవాలును ఎదుర్కోవాల్సి వస్తుంది. తన మాజీ న్యాయవాది టాడ్ బ్లంచ్‌ని శాశ్వత అమెరికా అటార్నీ జనరల్‌గా నామినేట్ చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. అయితే దీనికి సెనెట్‌లో తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. ముందుగా సెనెట్ న్యాయ కమిటీ ఆయన నామినేషన్‌ను ఆమోదించాల్సి ఉంటుంది. ట్రంప్ ప్రతీకార చర్యలకు బాధితుడైన కార్నిన్ ఈ కమిటీలో సభ్యుడుగా ఉన్నారు. ప్రశ్నలకు బ్లంచ్ ఇచ్చే సమాధానాలపై తన మద్దతు ఆధారపడి ఉంటుందని ఆయన అంటున్నారు. అటార్నీ జనరల్ అంటే అధ్యక్షుడి వ్యక్తిగత న్యాయవాది కాదని ఎత్తిపొడిచారు.



