Homeరాష్ట్రీయంవేగంగా నారాయణపేట్‌ - కొడంగల్‌ ‌లిఫ్ట్‌ ప్రాజెక్టు పనులు

వేగంగా నారాయణపేట్‌ – కొడంగల్‌ ‌లిఫ్ట్‌ ప్రాజెక్టు పనులు

- Advertisement -

రూ. 4,885 కోట్లతో నిర్మాణ పనులు
వలసలకు చెక్‌ ‌పెట్టే ప్రయత్నం

నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
తలపున కృష్ణమ్మ పరవల్లు తొక్కుతున్నా.. పాలమూరు-రంగారెడ్డి ప్రాంత ప్రజలకు గుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి. వ్యవసాయానికి అనువైన భూములు బీడుగా దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతు, రైతు కూలీలు వలస బాట పట్టారు. ఇది ఈనాటి గోస కాదు.. తరతరాలుగా కొనసాగుతున్న దీనస్థితి. ఇందుకు నిదర్శనంగా కొడంగల్‌ ‌నిలిచింది. ఈ ప్రాంత పరిస్థితిని చూసిన సీఎం రేవంత్‌‌రెడ్డి.. ఈ బీడు భూములను సస్యశ్యామలం చేస్తానని మాట ఇచ్చారు. ఇందులో భాగంగా ‘నారాయణపేట- కొడంగల్‌ ‌లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ‌ప్రాజెక్టు’ పనులు చేపట్టారు. రూ. 4885 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. సకాలంలో పూర్తి చేసేందుకు సీఎం ప్రత్యేక చొరవ తీసుకుని, ఎప్పటికప్పుడూ పనుల పురోగతిపై సమీక్షిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయితే వలసలకు చెక్‌ ‌పడుతుందని.. హరిత విప్లవం సాధించాలన్న సీఎం లక్ష్యం సాకారం కానుందని అధికారులు వెల్లడించారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు లేవు. ఈ ప్రాంతంలో వ్యవసాయం పూర్తిగా వర్షాధారంపై ఆధారపడి ఉంది. 7.1 టీఎంసీల సామర్థ్యంతో 10 మండలాలు, 123 గ్రామ పంచాయతీల్లో సుమారు లక్ష ఎకరాలకు సాగు, తాగునీరు అందించే విధంగా ప్రాజెక్టు డీపీఆర్‌ను సిద్ధం చేశారు. రెండు ఫేజ్‌‌ల్లో.. నారాయణపేట్‌, ‌మక్తల్‌ ‌నియోజకవర్గం బుద్పూర్‌ ‌రిజర్వాయర్‌ ‌నుంచి బొంరాస్‌‌పేట వరకు కొనసాగనుంది. మొదటి ఫేజ్‌‌ డిసెంబర్‌ 2027 వరకు పూర్తి చేయాల్సి ఉంది.
మొదటి ఫేజ్‌‌కు సంబంధించి నీటిని ఎత్తిపోసేందుకు అవసరమైన అప్రోచ్‌ ఛానళ్ల పంపుహాస్‌ నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఫేజ్‌-2 పనులకు సంబంధించి అక్టోబర్‌ 2028 వరకు పూర్తి చేయాల్సి ఉంది.

​గ్రావిటీ ద్వారా 6 ప్రాజెక్టులకు నీళ్లు
కంకుర్తి ప్రాజెక్టు నుంచి బొంరాస్‌‌పేట వరకు గ్రావిటీ కెనాల్స్‌ ‌ద్వారా నీళ్లు తీసుకువెళ్లనున్నారు. గ్రావిటీలో భాగంగా కంకుర్తి నుంచి మూడు రీచ్‌‌లు ఉన్నాయి. కంకుర్తి నుంచి లక్ష్మీపూర్‌ ‌ప్రాజెక్టు, లక్ష్మీపూర్‌ ‌ప్రాజెక్టు నుంచి ఎర్లపల్లి, అక్కడి నుంచి దౌల్తాబాద్‌ ‌ప్రాజెక్టుకు వెళ్లనున్నాయి. దౌల్తాబాద్‌ ‌నుంచి మూడు రీచ్‌‌లు ఉన్నాయి. దౌల్తాబాద్‌ ‌నుంచి బొంరాస్‌‌పేట, అక్కడి నుంచి హుస్నాబాద్‌, ఇక్కడి నుంచి కొడంగల్‌, బొంరాస్‌‌పేట వరకు వెళ్లనున్నాయి.

​మూడు ఎత్తిపోతల ప్రాజెక్టులు..
మక్తల్‌- బుద్పూర్‌ బ్యాలెన్సింగ్‌ ‌రిజర్వాయర్‌ ‌నుంచి వికారాబాద్‌ ‌జిల్లా బొంరాస్‌‌పేట వరకు సుమారు 100 కిలో మీటర్లు ఈ ప్రాజెక్టు కొనసాగనుంది. ఈ ప్రాజెక్టులో మూడు దశలుగా నిర్మాణం జరగనుంది. మొదటి దశ బుద్పూర్‌ బ్యాలెన్సింగ్‌ ‌రిజర్వాయర్‌ ‌నుంచి (ఎల్‌-352.20 ) మీటర్ల వద్ద 48క్యూమెక్‌‌లు (1695 క్యూసెక్యులు) ఎత్తి (ఎల్‌ -400) వద్ద వుట్కూర్‌ ‌ప్రాజెక్టుకు వెళ్లనున్నాయి. ఎల్‌-400 ‌నుంచి వుట్కూర్‌ 42 క్యుమెక్‌‌లు (1483 క్యూసెక్యులు) ఎత్తి ఎల్‌-500 ‌వద్ద జయమ్మ ప్రాజెక్టుకు వెళ్లనున్నాయి. జయమ్మ ప్రాజెక్టు నుంచి ఎల్‌-500 ‌మీటర్ల ఎత్తులో 35 క్యూమెక్‌‌లు (1236 క్యూసెక్యులు) ఎత్తి ఎల్‌-592 మీటర్ల ఎత్తులో ఉన్న కంకుర్తి ప్రాజెక్టుకు పంపనున్నారు.

​సీఎం పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు
ఈ ప్రాంత బీడు భూములకు సాగు నీరు అందించి.. హరిత విప్లం తీసుకురావడం కోసం సీఎం రేవంత్‌‌రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు. సకాలంలో ప్రాజెక్టు పనులు పూర్తయితే.. సీఎం అనుకున్న హరిత విప్లవం సాధ్యమౌతుందని అధికారులు చెబుతున్నారు. త్వరగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -