Friday, October 31, 2025
E-PAPER
Homeజాతీయంమసకబారుతున్న నితీశ్‌ ఛరిస్మా

మసకబారుతున్న నితీశ్‌ ఛరిస్మా

- Advertisement -

బీహార్‌లో జేడీయూ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకత

పాట్నా : బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న కొద్దీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నితీశ్‌ ఛరిస్మా మసకబారుతున్నట్టు కనిపిస్తోంది. బీహార్‌లో 2014-15లో తొమ్మిది నెలల విరామం తప్ప, గత 20 ఏండ్లుగా బీహార్‌కు నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్డీఏ ఫ్రంట్‌లో భాగమైనప్పటికీ, రెండుసార్లు మహా కూటమి ప్రభుత్వంలో కూడా భాగస్వామిగా ఉన్నారు. నితీశ్‌ కుమార్‌ దుస్తులు మార్చినంత ఈజీగా.. భాగస్వామ్య పక్షాలను మార్చేస్తారు. ఎన్డీఏలో సీఎంగా ఉండి సాయంత్రం రాజీనామా చేసి, ప్రతిపక్ష పార్టీలతో చేరి.. మరుసటి రోజు ఉదయం మళ్లీ సీఎం అయిపోతారు.

అలాగే ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి ప్రభుత్వంలో సీఎంగా ఉండి సాయంత్రం రాజీనామా చేసి, మరుసటి రోజు ఉదయమే మళ్లీ ఎన్డీఏ తరపున సీఎం అయిపోతారు. అందుకే ఆయనను కప్పగంతుల సీఎం అనే నానుడి. 2005 అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్‌ నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. 2010 ఎన్నికలలో కూడా ఎన్డీఏ విజయం సాధించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి నాయకత్వం వహించడానికి మోడీని ప్రకటించడాన్ని నిరసిస్తూ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన నితీశ్‌ కుమార్‌, ఆర్జేడీ మద్దతుతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. లోక్‌సభ ఎన్నికల్లో జేడీయూ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ, 2014 మేలో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

మహాదళిత వర్గానికి చెందిన జితన్‌ రామ్‌ మాంఝీ ముఖ్యమంత్రి అయ్యారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్‌లతో కూడిన మహా కూటమి 178 సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. ఆర్జేడీ ఏకైక అతిపెద్ద పార్టీ అయినప్పటికీ, నితీశ్‌ కుమార్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆర్జేడీతో తెగతెంపులు చేసుకున్న తరువాత నితీశ్‌, 2017లో ఎన్డీఏ శిబిరంలోకి తిరిగి వచ్చి ముఖ్యమంత్రిగా కొనసాగారు. 2020 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఎన్డీఏ మళ్లీ అధికారంలోకి వచ్చింది. అయితే జేడీయూ పోటీ చేసిన 115 సీట్లలో 43 సీట్లకే పరిమితమైంది. ఇది నితీశ్‌కు పెద్ద ఎదురుదెబ్బ.

74 సీట్లు గెలుచుకున్న బీజేపీ, నితీశ్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగించడానికి అనుమతించింది. 2022లో బీజేపీతో తెగతెంపులు చేసుకున్న నితీశ్‌, మహా కూటమి మద్దతుతో మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. ఆర్జేడీకి చెందిన తేజస్వి యాదవ్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల దేశవ్యాప్తంగా కూటమిని ఏర్పాటు చేయడానికి నితీశ్‌ చొరవ తీసుకున్నారు. జాతీయ స్థాయిలో ఇండియా బ్లాక్‌ ఏర్పడినప్పటికీ, నితీశ్‌ మరోసారి నాటకీయంగా తన మార్గాన్ని మార్చుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో ఇండియా బ్లాక్‌కి నితీశ్‌ ‘మోసం’ దెబ్బ తగిలింది.

ప్రస్తుత ఎన్నికల్లో 20 ఏండ్లు నిరంతరం పాలించిన నితీశ్‌ కుమార్‌ పతనం లేదా కొనసాగింపు ప్రశ్నను లేవనెత్తుతున్నాయి. బీహార్‌ ఇప్పటికీ దేశంలో అత్యంత వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. ఎన్నికలకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని ప్రకటనలు చేసినప్పటికీ, బీహార్‌లో బలమైన ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. బీహార్‌లో మైనారిటీ, వెనుకబడిన ఓట్లను వీలైనంత వరకు తొలగించే లక్ష్యంతో హడావిడిగా నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా మహాకూటమి పార్టీలు నిర్వహించిన ‘ఓటు అధికార్‌’ మార్చ్‌కు ప్రజాదరణ పొందటం, ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రత బహిర్గమైంది. ఎన్నికల కమిషన్‌ తీవ్రమైన స్పందన కూడా ప్రభుత్వ వ్యతిరేక భావనగా మారింది.

ఎన్డీఏలో లుకలుకలు
ఎన్డీఏ కూటమిలో సీట్ల పంపకాలు మొదలైనప్పటి నుంచి లుకలుకలు మొదలైయ్యాయి. అక్కడ జేడీయూ, ఎల్జేపీల మధ్య బహిరంగ వార్‌ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు ఎక్కుపెట్టుకున్నారు. అలాగే జేడీయూ, బీజేపీ మధ్య అంతర్గత వార్‌ నడుస్తోంది. మరో రెండు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన హెచ్‌ఎఎం, ఆర్‌ఎల్‌ఎంలు సీట్ల పంపకాలలో తమకు న్యాయం జరగలేదని పేర్కొన్నాయి. అయినప్పటికీ తాము సీట్ల పంపకాలను అంగీకరిస్తున్నామని ఆయా పార్టీల నేతలు ప్రకటించారు. అయితే దీని ప్రభావం ఎన్నికల్లో చూపే అవకాశం ఉంది. మరోవైపు రెబల్స్‌, నేతల రాజీనామాలతో ఎన్డీఏ కూటమి సతమతమవుతుంది. ఎన్డీఏలో పార్టీలకు రెబల్స్‌ బెడద పెరిగింది. దీంతో డజన్ల కొద్దీ నేతలను జేడీయూ, బీజేపీ సస్పెండ్‌ చేస్తున్నాయి.

బీహార్‌ ఎన్డీఏలో ఎప్పుడూ ఎక్కువ స్థానాలకు పోటీ చేసే జేడీయూ, బీజేపీతో సమానమైన స్థానాలకే పరిమితం కావడం ఇదే తొలిసారి. బీహార్‌ రాజకీయాల్లో నితీశ్‌ ప్రభావం తగ్గుతుందనటానికి ఇది నిదర్శనమని రాజకీయ పరిశీలకులు పేర్కోంటున్నారు. ఈసారి ఎన్డీఏలో సీట్ల పంపకాల్లో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శించింది. జన్‌ స్వరజ్‌ పార్టీ, ఎంఐఎం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చుతాయని బీజేపీ, ఎన్డీఏ ఆశిస్తున్నాయి. అయితే, మహా కూటమి తన సమస్యలను పరిష్కరించుకుని ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడంతో గట్టిపోటీకి వేదిక అయింది. అంతేకాకుండా ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థిపై సవాల్‌ విసురుతోంది. రాష్ట్రంలో నవంబర్‌ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు నవంబర్‌ 14న జరుగుతుంది.

బీహార్‌ను వాళ్లు అభివృద్ధి చేయలేరు ఆర్జేడీ-కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ విమర్శ
ఆర్జేడీ, కాంగ్రెస్‌ బీహార్‌ను ఎప్పటికీ అభివృద్ధి చేయలేవని ప్రధాని మోడీ అన్నారు. ఆ పార్టీలు దశాబ్దాలుగా బీహార్‌ను పాలించినా కేవలం ద్రోహం, తప్పుడు వాగ్దానాలు మాత్రమే ఇచ్చాయని ఆరోపించారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముజఫర్‌పూర్‌లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని మోడీ, ఆర్‌జేడీ-కాంగ్రెస్‌పై ఈ మేరకు విరుచుకుపడ్డారు. రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధం నీళ్లు, నూనె లాంటిదని విమర్శించారు.

‘బీహార్‌ మధురమైన భాషను, సంస్కృతిని ప్రపంచంలోని ప్రతి మూలకు వ్యాప్తి చేయడం, గౌరవాన్ని పెంచడం, అభివృద్ధి చేయడం ఎన్డీఏ, బీజేపీకి అతి పెద్ద ప్రాధాన్యత. వికసిత్‌ భారత్‌ కోసం వికసిత్‌ బీహార్‌ చాలా అవసరం. ఆర్జేడీ, కాంగ్రెస్‌ బీహార్‌ను ఎప్పటికీ అభివృద్ధి చేయలేవు. కాంగ్రెస్‌ ఆర్జేడీ కూటమి పాలన ఐదు ‘కే’ పదాల్లో చెప్పొచ్చు. కట్టా(దేశంలో తయారు చేసిన నాటు తుపాకీలు- అక్రమం), క్రూరతా(క్రూరత్వం), కటుత (దురుద్దేశం), కుశాసన (సుపరిపాలన లేకపోవడం), కరప్షన్‌(అవినీతి). కాంగ్రెస్‌- ఆర్జేడీ పార్టీల నేతలు బయటకు కలిసి ఉన్నట్టు కనిపించినా అంతర్గతంగా కొట్లాడుకుంటారని ఆరోపించారు.

తొలి విడత బరిలో ఇద్దరు డిప్యూటీ సీఎంలు..14మంది మంత్రులు ఆ 16 అసెంబ్లీ స్థానాల వైపే అందరి చూపు
బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌లో ఇద్దరు డిప్యూటీ సీఎంలు సహా 16 మంది మంత్రుల భవితవ్యం తేలనుంది. నవంబరు 6న 121 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ జరగనుండగా, ప్రధానమైన 16 సీట్ల వైపే అందరి చూపులు ఉన్నాయి. వీటిలో 11 చోట్ల బీజేపీ మంత్రులు, 5 చోట్ల జేడీయూ మంత్రులు పోటీ చేస్తున్నారు. ఈ జాబితాలో డిప్యూటీ సీఎంలు సామ్రాట్‌ చౌదరి, విజయ్ సిన్హా కూడా ఉన్నారు. విపక్ష కూటమి సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ పోటీ చేస్తున్న స్థానంలోనూ తొలివిడతలోనే ఓటింగ్‌ జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -