పిల్లల్ని కనాలని అంటారు
ఎంత సులభంగా అంటారు..
పుల్ల విరిచినట్టు, ముగ్గుని తొక్కినట్టు
దీపం ఆర్పేసినట్టు..
ఎంత సులభంగా అంటారు
కానీ.. ఒక బిడ్డ పుట్టాలంటే
ఒక స్త్రీ తన శరీరాన్ని తొమ్మిది నెలలు
గూడు చేసుకోవాలి
రక్తాన్ని పాలుగా మార్చాలి
నిద్రని జోలపాటగా మార్చాలి
తన భయాల్ని మింగెయ్యాలి
తన కలల్ని పసిబిడ్డ నవ్వుల్లో కరిగించాలి
పుట్టేది ఒక్క బిడ్డే కానీ.. ప్రతి కాన్పులో
ఒక తల్లి మళ్లీ పుడుతుంది
ఇంకో బిడ్డని కనండి
అని ఉపదేశించే ముందు..
మొదటి బిడ్డ చదువుకునే అవకాశం ఉందా
రెండో బిడ్డకి కడుపునిండా
తిండి పెట్టే వీలుందా
ఆ తల్లికి తన పేరుతో పిలవబడే
ఒక్క క్షణం జీవితం ఉందా
అని పట్టించుకున్నారా..
మేం పిల్లల్ని కనం, ప్రపంచాల్ని కంటాం
ఒక బిడ్డతో పాటు ఆశలు పుడతాయి
భయాలు పుడతాయి
ప్రేమ పుడుతుంది, బాధ్యత పుడుతుంది
అందుకే.. మమ్మల్ని సంఖ్యలుగా పిలవకండి
మా గర్భాల్ని గణాంకాలుగా మార్చకండి
మా జీవితాల్ని
మీ రాజకీయ వ్యూహాల్లో ఇమడ్చకండి
మేం యంత్రాలం కాదు
బటన్ నొక్కగానే బిడ్డల్ని ఉత్పత్తి చేసే
కర్మాగారాలం కాదు
పురిటి నొప్పుల్ని దాటిన స్త్రీ
మరణం తలుపు తట్టి వచ్చి
జీవాన్ని చేతుల్లో మోసుకొచ్చిన యోధురాలు
మీ టార్గెట్స్ నింపేందుకు
పుట్టాల్సిన చేతుల గురించి మాట్లాడతారు
కానీ.. ఇప్పటికే అలసిపోయిన
ఈ చేతుల్ని ఎప్పుడైనా గమనించారా?
మా ఇంటి చాకిరీకి జీతం లేదనుకోండి
కానీ.. విలువ లేదని
తీర్పు చెప్పే హక్కు మీకెవరిచ్చారు?
మా శరీరంపై మాదే చివరి మాట కావాలి
ఎందుకంటే.. ఒక బిడ్డ పుట్టడం అంటే
జనాభాలో ఒక సంఖ్య పెరగడం కాదు
ఒక తల్లి తన జీవితంలోని ఒక భాగాన్ని
ప్రేమగా రాల్చుకోవడం
ఆ ప్రేమని లెక్కల పట్టికలో కొలవలేరు
ఆ త్యాగాన్ని ప్రకటనల్లో అమ్మలేరు
ప్రతి తల్లి గుండెల్లో
ఒక చిన్న సమాధి దాగి ఉంటుంది
పుట్టకముందే పోయిన కలలది
బతికున్న పిల్లల కోసం చంపుకున్న కోరికలది
అయినా.. ఆమె నవ్వుతుంది
జోలపాడుతుంది, మేల్కొని ఉంటుంది
ఇంకో బిడ్డని కనండి
అని ఆదేశించే ముందు.. ఒక్కసారి అయినా
ఆ తల్లి గుండె చప్పుడు వినండి
అక్కడ గణాంకాలు ఉండవు
లక్ష్యాలు ఉండవు, జనాభా గ్రాఫులు ఉండవు
మతాధిక్య వ్యూహాలూ ఉండవు
ప్రేమిస్తూ.. భయపడుతూ..
తనని తాను మరిచిపోతూ..
మళ్లీ తనని తాను వెతుక్కుంటూ..
ఒక మనిషి మాత్రమే ఉంటుంది
– ఖదిజ్ఞాసి రజని, 9848030089
మా గర్భాలు గణాంకాలు కావు
- Advertisement -
- Advertisement -



