సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్
నవతెలంగాణ-తుంగతుర్తి
తెలంగాణ ఫైర్ బ్రాండ్, ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక, పేదల పెన్నిధి పార్టీలకు అతీతంగా ఆపద అంటే ఆదుకునే మనసున్న మారాజు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పై తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు మాట్లాడిన తీరు చాలా బాధాకరమని తుంగతుర్తి సర్పంచ్ల ఫోరం మండల ఉపాధ్యక్షులు కలకోట్ల మల్లేష్ అన్నారు. ఆదివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. ప్రజల సేవ కోసమే పుట్టిన మహోన్నత వ్యక్తి రాజగోపాల్ రెడ్డి అన్నారు. దళితులంటే ఎంతో అభిమానం కల నాయకుడు రాజగోపాల్ రెడ్డి, 2012 లో తనను అక్కున చేర్చుకొని, నాటినుండి ఇటీవల సర్పంచ్ అయ్యేవరకు అన్ని విధాల సహకరించిన గొప్ప నాయకులు రాజగోపాల్ రెడ్డి అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజాదరణ పొందిన, ప్రజల కోసం పోరాడే నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్, అలాంటి వారిపై తుంగతుర్తి శాసనసభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు.
కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడం, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రజా సమస్యలపై నిలదీయడంలో ప్రత్యేక గుర్తింపు గల నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్. కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి, కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ల ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల కష్టసుఖాల్లో అండగా ఉండే నాయకులు కోమటిరెడ్డి బ్రదర్స్ అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కోమటిరెడ్డి బ్రదర్స్కు అభిమానులు ఉన్నారని, ఎంతోమంది పేద విద్యార్థులకు, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేశారని అన్నారు. వారు ఎక్కడికి వెళ్లిన సాదరంగా ఆహ్వానిస్తారని అన్నారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తన నియోజకవర్గంలో పర్యటించాలన్నా ప్రత్యేక పోలీస్ సిబ్బంది నాలుగు పోలీస్ ఎస్కార్ట్ వాహనాలు అవసరం వస్తున్నాయని, ఎస్కార్ట్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి దాపురించిందన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పై విమర్శలు చేసిన సామేలు తగిన ప్రతిఫలం అనుభవించక తప్పదని అన్నారు.


