జుట్టుపోలుగాడు :శరభ శరభ…. అచ్ఛరభ శరభ. ఈ వీరంగాన్ని ఆపేవాడు ఎవడూ లేడెహె. పుడితే హిందువుగా పుట్టు. హిందువుగా గర్వించు. హిందువుగా జీవించు. హిందువుగా మరణించు. శరభ. శరభ.
కేతిగాడు : అరె జుట్టుపోలుగా.. ఏమా వీరంగం? ఏమా మాటలు? మన పుట్టుక మన చేతిలో వుందా ఏంటి? హిందువులు కాని వాళ్లు ఈ దేశంలో ఉండకూడదా..? బతక్కూడదా?
జట్టుపోలుగాడు : బతకొచ్చు, ఉండొచ్చు, కానీ మెజారిటీ హిందువులకు అంటే హిందూ పాలకులకు లొంగి వుండాల్సిందెహె. మైనార్టీలు అంటే ముస్లింలు, క్రైస్తవులు ఏ పదవిలో, పాలనలో వుండకూడదు. మళ్లీ చెప్తున్నా హిందువులకు లొంగి ఉండాల్సిందే.
కేతిగాడు : అదేందిరా.. గతంలో మీ నాయకుడు వాజ్‌పారు మన దేశ ప్రధానిగా ఉన్నప్పుడు అబ్దుల్ కలాం మనదేశ రాష్ట్రపతిగా ఉన్నాడుగా.
జుట్టుపోలుగాడు : అది అప్పుడు, పాతికేళ్ల కిందట. అప్పుడు మేం గాంధీయ సోషలిజం’ అన్నాం కూడా. అది మా ఎత్తుగడ. అంతే. అవన్నీ నీకర్థం కావులే.
కేతిగాడు : ఏం అర్థం కావు?
జుట్టుపోలుగాడు : బుస్ (నవ్వు) అరే.. గాంధీని చంపింది మా వాడు గాడ్సే. ఇప్పటిక్కూడా గాంధీని చంపడం న్యాయమే అని అంటున్నాం. ఒక పక్క గాంధీని చంపేసి మరో పక్క గాంధేయ సోషలిజం అని ఎందుకన్నాం తెలుసా.. మాకు జనాల ఓట్లు కావాలి. దేశ దేశాల్లో పరపతి కావాలి. గాంధీకి ఆ పేరు ప్రతిష్ట ఉంది. దాన్ని మేం వాడుకోవాలి. అందుకే మన ప్రధాని మోడి ఏ దేశం వెళ్లినా లేదా విదేశీ నేతలు ఇక్కడకు వచ్చినా మొట్టమొదట చేసే పనేంటి? గాంధీ విగ్రహాలకు పూలమాలలేసి నివాళులు అర్పించడం.
కేతిగాడు : అంటే మీరు చేసేదొకటి, చెప్పేదొకటి. చెప్పింది చెయ్యరు. చేసేది చెప్పరు. అవునా..
జుట్టుపోలుగాడు : రెండూనూ. చట్టం దృష్టిలో అందరం సమానమే అంటాం. రాజ్యాంగం మీద పెమాణం చేసి చట్టచభలో అడుగిడతాం. కానీ బయటకు వచ్చాక…
కేతిగాడు : ఆ.. వచ్చాక
జట్టుపోలుగాడు : ఎవడేమనుకున్నా ఈ దేశం కోట్లాదిమంది హిందువులది. హిందువుల నమ్మకాన్ని ఏ చట్టం ప్రశ్నించజాలదు అంటూ వీరంగాలేస్తాం. అనుకున్నది చేస్తాం. 1992లో బాబ్రీమసీదును పడగొట్టాం. అక్కడే రాముడు పుట్టాడని రామాలయం కట్టాం.
కేతిగాడు : అవును కట్టారు. ఘనంగా ప్రారంభించారు. భక్తులు ఇచ్చిన విరాళాలు, ఆభరణాలు, సొమ్మంతా స్వాహా చేశారు. అసలు ఆలయ స్థల సేకరణ నుండే పెద్ద ఎత్తున కుంభకోణాలు నడిచాయని చెప్తున్నారు. వందల కోట్ల అవినీతి కాస్తా వేల కోట్లకు వెళ్తుంది. దీని మీద కనీసం మన ప్రధాని మాట్లాడడేంటి?
జుట్టుపోలుగాడు : అరె కేతిగా.. ముందు నీవు నోర్ముయ్యహె. రాముడు హిందూ దేవుడు. విరాళాలిచ్చిన భక్తులు హిందువులు. మధ్యలో కైంకర్యం చేసింది అక్కడి పూజారులు, నిర్వాహకులు. వాళ్లూ హిందువులే. ఇదంతా హిందువుల యవహారం. మధ్యలో నీగోలేంది? అయినా గజనీ, ఘోరీ మహమ్మద్‌లు దాడి చేసి హిందూ దేవాలయాల్లో దోచుకున్న దాంట్లో ఇదెంత? ఏపాటిది?
కేతిగాడు : అంటే మీరేం చేసినా ప్రశ్నించకూడదంటావ్.
జుట్టుపోలుగాడు : యస్.
కేతిగాడు : మరైతే నీట్ పరీక్ష లీక్ అయ్యి, 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోడానికి, 23 లక్షల మంది మళ్లీ శ్రమపడి పరీక్ష రాయడానికి ప్రధాన కారణం కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్. అతను హిందువే. చనిపోయిన పిల్లల్లో, పరీక్ష రాసిన పిల్లల్లో ఎక్కువ మంది హిందువులే. మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున సత్యాగ్రహం చేస్తున్నారు ఎక్కువమంది విద్యార్థులు హిందువులే. దానికి నాయకత్వం వహిస్తుంది అభిజిత్ దూప్కే హిందువే. మరో విద్యావేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. క్షణక్షణం ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నది. మరి దీనికేం సమాధానం చెప్తావ్!
బంగారక్క : వాడేం చెప్తాడు. నోట్లో వెలక్కాయ పడింది. విచక్షణ లేకుండా మోసాలతో రంకెలేస్తూ వీరంగం చేయడమే ఇలాంటోళ్ల పని. పాపభీతి, పవిత్రత, మానవత్వం వీళ్లల్లో మచ్చుకు కూడా కన్పించదు. ఆలయాల్లో సొమ్మును నిర్లజ్జగా దోచుకునేవారికి సత్యాగ్రహం విలువ ఏం తెలుస్తుంది. అందుకే పాపం వాంగ్‌చుక్ నిరాహారదీక్షను ఆపేయమని అభిషేక్ యాదవ్, తేజస్వీ యాదవ్, మమతాబెనర్జీ, కనిమొళి, విజరు, మల్లికార్జున్ ఖర్గే, కమ్యూనిస్టు నేతలు వంటి వారే గాక అరుంధతీరారు, నసరుద్దీన్‌షా, జయతీఘోష్, జీనత్ అమన్ వంటి ప్రముఖులు ప్రాధేయపడ్తున్నారు. అవినీతి అహంకారంతో మకిలిపట్టి వీరంగం వేస్తున్న నకిలీ నేతల కాలంలో మనం ఉన్నాం.
– కె.శాంతారావు, 9959745723



