ఎండిపోతున్న పంటలను కాపాడాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూరాల ప్రాజెక్ట్ ఆయకట్టు పరిధిలోని అమరచింత, ఆత్మకూర్ తదితర మండలాల్లో పొట్టకొచ్చిన పంటలు నీరందక ఎండిపోయే ప్రమాదంలో ఉన్నాయని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ మేరకు శనివారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటన విడుదల చేశారు. రైతాంగాన్ని ఆదుకోవడానికి జూరాల డ్యామ్ నుంచి తక్షణమే సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం డ్యామ్‌లో ఎనిమిది టీఎంసీల నీరు అందుబాటులో ఉన్నదనీ, ఎండిపోతున్న పంటలకు తక్షణమే అవసరమై మూడు టీఎంసీల నీటిని విడుదల చేస్తే పంటలను కాపాడొచ్చని తెలిపారు. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నందున, రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కర్నాటకతో చర్చలు జరిపి మరో రెండు నుంచి మూడు టీఎంసీల అదనపు నీటిని రప్పించాలని విజ్ఞప్తి చేశారు. విత్తనాలు, ఎరువుల పంపిణీకి కేంద్రం తెచ్చిన ఆన్లైన్ విధానం రైతుల పాలిట శాపంగా మారిందనీ, క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమస్యలను పరిష్కరించాలని రైతు సంఘం నాయకులు, స్థానిక రైతులు ఆందోళనలు చేస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి జూరాల నీటిని విడుదల చేయాలనీ, లేదంటే రైతులందరూ ఐక్యంగా ఉద్యమించే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు.
జూరాల నీటిని వెంటనే విడుదల చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



