ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని డిమాండ్
‘చలో సెక్రెటేరియట్’ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాల యత్నం
అడ్డగించిన పోలీసులు. తీవ్ర తోపులాట, ఉద్రిక్తత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
విద్యార్థి పోరుతో రాష్ట్ర సచివాలయం దద్దరిల్లింది. స్కాలర్‌షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు (ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్ యూ, ఏఐఎఫ్ డీఎస్, ఏఐఎస్ బీ, ఏఐడీఎస్ఓ, ఏఐపీఎస్ యూ) మంగళవారం చేపట్టిన “చలో సెక్రెటేరియట్” ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వందలాది మంది విద్యార్థులు, నాయకులు సచివాలయం వైపు దూసుకువెళ్లడంతో సెక్రెటేరియట్ పరిసర ప్రాంతాలు విద్యార్థి పోరాట నినాదాలతో మారుమ్రోగింది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడం, విద్యార్థులు తప్పించుకుని సచివాలయం వైపు దూసుకెళ్లే యత్నంలో తీవ్ర తోపులాట చోటు చేసుకుని ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విద్యార్థులను ఈడ్చుకెళ్లి, బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ వాహనాల్లోకి ఎక్కించారు. వారిని నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ తోపులాటలో పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ‘చలో సెక్రెటేరియట్’ను అడ్డుకునేందుకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి నాయకులను ముందస్తు అరెస్ట్ చేసినప్పటికీ వారి నిర్బంధాన్ని తప్పించుకొని అనేక జిల్లాల నుంచి పలువురు హైదరాబాద్‌కు చేరుకుని ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా దామెర కిరణ్ (ఎస్ఎఫ్ఐ), కసిరెడ్డి మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్(ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శి), పల్లె మురళి (ఏఐఎఫ్ డీఎస్ రాష్ట్ర అధ్యక్షులు), బోనగిరి మధుకర్ (పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు) సన్నీ గౌడ్ (ఏఐఎస్ బీ రాష్ట్ర నాయకుడు), ఆడేపు రవి కుమార్ (ఏఐపీఎస్ యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి) మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది పేద విద్యార్థులు ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్స్ రాక చదువులకు దూరమవుతున్నారని తెలిపారు. కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. అరెస్టులతో తమ ఉద్యమాలను ఆపలేరని స్పష్టం చేశారు. వెంటనే రూ.11 వేల కోట్ల బకాయిలన్నింటినీ ఏకకాలంలో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలకు పిలుపునిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.శంకర్, కె.అశోక్ రెడ్డి, లెనిన్ గువేరా, వి.నాగరాజు, పవన్, ప్రశాంత్, ఏఐఎస్ఎఫ్ నాయకులు వంశీ వర్ధన్ రెడ్డి, అన్వర్, చైతన్య యాదవ్, మురళి కృష్ణ, శరత్, పార్థసారథి, శేఖర్, నరేష్, శాంతి కుమార్, అనిల్, పీడీఎస్ యూ సంఘాల నాయకులు రానా ప్రతాప్ బి శ్రీకాంత్,మస్తాన్, ఏఐఎఫ్ డీఎస్ నుంచి కుమార్, ఏఐపీఎస్ యూ నుంచి జి. పరమేశ్,రాజారాం తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులపై పోలీసుల నిర్బంధం దారుణం : ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ
ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్స్ కోసం పోరాడుతున్న విద్యార్థులపై పోలీసుల నిర్బంధాన్ని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ మేరకు ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. రజనీకాంత్, రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ‘ప్రజాపాలన’, ‘ప్రజాస్వామ్య పరిరక్షణ’, ‘ముందస్తు అరెస్టులు ఉండవు’, ‘ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు వింటాం’ అంటూ కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పిందని గుర్తు చేశారు. ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు, యువత, ప్రజా సంఘాలపై నిర్బంధ పాలనను అమలు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 14 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయకపోవడంతో వారు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల పట్ల ఈ వివక్ష ఎందుకు? అని ప్రశ్నించారు. నిర్బంధాలతో విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. నాయకుల అరెస్టులను వివిధ విద్యార్థి సంఘాలు ఖండించాయి. అక్రమంగా అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి.



