భారత పరిశ్రమకు గడ్డుకాలం
రసాయన, ఉక్కు, వస్త్ర రంగాలు కుదేలు
ఎరువుల ధరల భారం
న్యూఢిల్లీ : అమెరికా సామ్రాజ్యవాదంతో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు భారత పారిశ్రామిక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా అంతర్జాతీయ సరఫరా గొలుసులో తలెత్తిన ఆటంకాలు స్టీల్, అల్యూమినియం, టెక్స్‌టైల్, రసాయన రంగాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ముడి సరుకుల రవాణా నిలిచిపోవడం, ఎల్‌పిజి, పిఎన్‌జి వంటి గ్యాస్ కొరత ఏర్పడటంతో ఉత్పత్తి వ్యయం పెరగడమే కాకుండా.. కొన్ని పరిశ్రమలు తమ ఉత్పత్తి గంటలను తగ్గించుకుంటున్నాయి.
యూరప్ నుంచి రావాల్సిన ఫ్లాక్స్ వంటి ముడిసరుకు నిలిచిపోవడంతో ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీలు కేవలం నెల రోజులకు సరిపడా నిల్వలతోనే కాలం వెళ్లదీస్తున్నాయి. ”బెల్జియం, ఫ్రాన్స్ నుంచి రావాల్సిన ముడిసరుకు ఫ్లాక్స్ కంటైనర్లు గత 20 రోజులుగా జెబల్ అలీ పోర్టులో చిక్కుకుపోయాయి. మా వద్ద కేవలం 30 రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే ఉంది. మరో 10 రోజుల్లో సరఫరా పునరుద్ధరించకపోతే ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉంది” అని ఒక ప్రముఖ టెక్స్‌టైల్ బ్రాండ్ ఎగ్జిక్యూటివ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అనిశ్చితి వల్ల కంపెనీలు తమ ఉత్పత్తి గంటలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
డీఏపీ ధరలపై భారం..
ఈ యుద్ధం వ్యవసాయ రంగాన్ని ఒత్తిడికి గురి చేయనుందని రసాయన రంగ విశ్లేషకులు అజరు జోషి హెచ్చరించారు. ప్రపంచ సల్ఫర్ సరఫరాలో 35 శాతం పశ్చిమాసియా నుంచే వస్తుందన్నారు.. ‘ఈ సరఫరా గొలుసు దెబ్బతినడం వల్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ ధరలు ఏడాది కాలంలో 80 శాతం పెరిగాయి. ఇది నేరుగా డిఎపి వంటి ఎరువుల ధరలపై ప్రభావం చూపుతుంది. ఇది కేవలం వస్తువుల ధరల సమస్య మాత్రమే కాదు. దేశ ఆహార భద్రతకే ముప్పు. ఖరీఫ్ సీజన్ ముందు ఈ ధరల పెరుగుదల రైతులకు పెను సవాలుగా మారనుంది.’ అని జోషి పేర్కొన్నారు.
గ్యాస్ లేక మూత..
ఇంధన కొరత కూడా పారిశ్రామిక ఉత్పత్తిని దెబ్బతీస్తోంది. ‘తీవ్రమైన ఎల్‌పీజీ, పీఎన్‌జీ కొరత వల్ల పరిశ్రమలు మూతపడే దిశగా వెళ్తున్నాయి. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోకపోతే ఎంఎస్‌ఎంఈ రంగం కుప్పకూలే ప్రమాదం ఉంది” అని అల్యూమినియం ఎక్స్‌ట్రూషన్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (అలెమా) ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ముడి సరుకు కొరతతో గాజు సీసాల ధరలు 20 శాతం, కార్టన్ బాక్సుల ధరలు 100 శాతం పెరగడంతో మద్యం తయారీ పరిశ్రమ కూడా భారంగా మారిందని బ్రూవర్స్ అసోసియేషన్ (బీఏఐ) తెలిపింది. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే దీర్ఘకాలంలో సామాన్య వినియోగదారులపై ధరల భారం తప్పదని స్పష్టమవుతోందని పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.



