– పంటలకు మద్దతు ధర ప్రకటించి చేతులు దులుపుకున్న బిజెపి ప్రభుత్వం
– బీఆర్ఎస్, బిజెపి రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నాయి
– తడిసిన ధాన్యాన్ని మొక్కజొన్నలను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది
నవతెలంగాణ – బోనకల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్తుపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని, సోలార్ విద్యుత్తు వలన రైతులకు, గృహ వినియోగదారులకు ఆర్థికంగా ఎంతో లాభం చేకూరుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మండల పరిధిలోని చిన్న బీరవల్లి, రామాపురం గ్రామాలలో ఏర్పాటుచేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్లను గురువారం మల్లు భట్టి విక్రమార్క పరిశీలించారు. రామాపురంలో రైతు పొలంలో ఏర్పాటుచేసిన వ్యవసాయ సోలార్ ప్లాంట్ ను మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతు పొలంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశములో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1380 కోట్లతో 81 గ్రామాలను, 16078 వ్యవసాయ మోటార్లు, 38 216 గృహాలకు సోలార్ విద్యుత్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండలాన్ని కొడంగల్ మండలాన్ని సోలార్ మోడల్ మండలాలుగా ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. రెండు మండలాలలో పూర్తిగా సోలార్ విద్యుత్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ పొలాలలో సోలార్ విద్యుత్ కోసం షెడ్డు ఏర్పాటు చేయటం జరుగుతుందని, ఈ షెడ్డు రైతుకు ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుందన్నారు. ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో మహిళలకు సోలార్ విద్యుత్ ప్లాంట్ ఉత్పత్తి నీ అప్పగించినట్లు తెలిపారు. దీనివల్ల సంవత్సరంలో తమకు ఎంతో ఆదాయం వచ్చిందని వారు తెలిపారన్నారు. సంవత్సరానికి నాలుగు నుంచి ఐదు లక్షల ఆదాయం వచ్చినట్లు వారు తెలిపారని తెలిపారు. సోలార్ విద్యుత్తును ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. విద్యుత్తు వినియోగానికి తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆహార ధాన్య ఉత్పత్తి కూడా పెరిగిందన్నారు. రాష్ట్రంలో 9242 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు తెలిపారు. గృహ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమన్నారు. గృహ వినియోగదారులు, రైతులు సోలార్ విద్యుత్తు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ విద్యుత్తు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.వరి, మొక్కజొన్న ఉత్పత్తి భారీగా పెరిగింది అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం పంటలకు మద్దతు ద్వారా ప్రకటించి చేతులు దులుపుకుందని విమర్శించారు. టిఆర్ఎస్, బిజెపి నాయకులు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నాయని విమర్శించారు. టిఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తమ పత్రికలో ప్రతిరోజు ఉండాలని ఉద్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తన్నీరు హరీష్ రావు గుడ్డ కాల్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయటమే ఆయన లక్ష్యం అన్నారు. రైతులపై వారికి ఎటువంటి స్పష్టత, లక్ష్యం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేస్తుందని విమర్శించారు. కల్లాలలోకి వచ్చిన బిజెపి నాయకులను నిలదీయాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం రైతు వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను, ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయటం లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి పంటల కొనుగోలుపై ఎందుకు నోరు విప్పటం లేదని నిలదీశారు.
ప్రస్తుతం 70 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేసినట్టు తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం రైతుల నుంచి సగం మాత్రమే పంటలను కొనుగోలు చేసి సగం కొనుగోలు చేయకుండా వదిలేసిందని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నుంచి ప్రతి గింజల కొనుగోలు చేసి రైతులకు ఆర్థికంగా అండగా నిలిచిందన్నారు. ఈ సంవత్సరం రైతులు 17 వేల కోట్లు నష్టపోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీ ఆర్ఎస్, బిజెపి బురద చల్లటమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎఫ్ సి ఐ గోదాములకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కల్లాలలో ఇప్పటికి వేలాది బస్తాలు ఉన్నాయని, లారీలు కొరత తీవ్రంగా ఉందని, లారీ యజమానులు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని పలువురు రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే మల్లు భట్టి విక్రమార్క మైకును జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ కు ఇచ్చారు. దీంతో కలెక్టర్ డబ్బులు ఎవరికి ఇవ్వొద్దని, కల్లాలలో, కొనుగోలు కేంద్రాలలో ఉన్న మొక్కజొన్నలను వెంటనే తరలిస్తామని రైతులు ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు.నమస్తే తెలంగాణ బ్యూరో అడిగిన పలు ప్రశ్నలకు డిప్యూటీ సీఎం వ్యంగంగా సమాధానాలు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మధిర వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, మధిర ఆత్మ కమిటీ చైర్మన్ కర్నాటి రామకోటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, విద్యుత్ శాఖ కంపెనీ సీఎం డి కే.వరుణ్ రెడ్డి, కంపెనీ డైరెక్టర్ వి.మోహన్ రావు, రెడ్కో ఎండి వి అనిల, జిఎం జిఎస్వి ప్రసాద్, డీజిఎం వెంకటరమణ, ఈ ఈ కల్పన, డిఎం పోలిశెట్టి అజయ్ కుమార్, ట్రాన్స్కో సూపరిండెంట్ ఇంజనీర్ ఇనుగుర్తి శ్రీనివాసరావు చారి, మధిర డివిజనల్ ఇంజనీర్ బండి శ్రీనివాసరావు, కన్స్ట్రక్షన్ డిఇ బద్రుపవర్, బోనకల్ అసిస్టెంట్ రీజనల్ ఇంజనీర్ యార్లగడ్డ వెంకట ఆనంద్ కుమార్, బోనకల్ విద్యుత్ తోకల మనోహర్, సిబ్బంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు పైడిపల్లి కిషోర్ కుమార్ పాల్గొన్నారు.



