– ధర్మారం వద్ద పోలీసుల విస్తృత తనిఖీలు – డిసిపి అంకిత్ కుమార్
నవతెలంగాణ – గీసుగొండ
ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడంతో పాటు నేర నియంత్రణకు ప్రత్యేక నాకాబందీలు సమర్థవంతంగా ఉపయోగపడుతున్నాయని ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్ తెలిపారు. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మారం గ్రామం వద్ద సోమవారం రాత్రి వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై సీఐ డి. విశ్వేశ్వర్ ఆధ్వర్యంలో ప్రత్యేక నాకాబంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, మామునూరు ఏసిపి వెంకటేష్ కలిసి నాకాబంది కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
నాకాబంది సందర్భంగా రహదారిపై వెళ్లే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేసి, పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టినట్లు సీఐ విశ్వేశ్వర్ తెలిపారు. ప్రజలు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీసులు సూచించారు. రాత్రి వేళల్లో అనుమానాస్పద కదలికలపై సమాచారం అందిస్తే వెంటనే స్పందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీసుగొండ ఎస్సైలు అనిల్ కుమార్, కె. కుమార్ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


