నవతెలంగాణ – పరకాల
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు పోస్ట్ కార్డ్ ద్వారా నిరసన తెలిపారు. టీఎస్‌యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఎస్సెస్ఏ, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బంది తమ ఆవేదనను లేఖ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. సోమవారం ఎంఈవో కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ హనుమకొండ జిల్లా కార్యదర్శి మెరుగు ప్రసన్న మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతో, ఎలాంటి కనీస రక్షణ లేకుండా 24 గంటలు విధుల్లో గడపవలసి వస్తోందని, కూలీల కంటే గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు అనేకసార్లు విన్నవించినా స్పందన లేదనీ, ప్రభుత్వం మానవత్వంతో స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.
మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని, సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న ఉద్యోగుల సర్వీసులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేయడంతో పాటు, రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా సెలవు సౌకర్యాలు కల్పించాలని, ఆరోగ్య భద్రత కోసం హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు. కేర్ టేకర్లను నియమించి రాత్రి విధుల నుండి మినహాయింపు ఇవ్వాలని, గతంలో తాము చేసిన 29 రోజుల సమ్మె కాలపు వేతనాన్ని చెల్లించాలని, ఉద్యోగులందరికీ వారి స్థాయిని బట్టి క్యాడర్ కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్లతో కూడిన పోస్ట్ కార్డ్ నిరసన అనంతరం, పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఈవో సురేందర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు డి. రాజారామ్, పరకాల మండల కార్యదర్శి బిక్షపతి, శ్రీనివాస్, సతీష్ బాబు, మహేందర్, సుకేష్, రఫీబాబు, రమాదేవి, శ్రీలత, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.



