Friday, April 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసమ్మె ఉధృతం

సమ్మె ఉధృతం

- Advertisement -

రెండోరోజూ రోడ్డెక్కని బస్సులు
నర్సంపేటలో డ్రైవర్‌ ఆత్మహత్య..హైదరాబాద్‌ తరలింపు..ఉద్రిక్తత
కార్యాచరణ ప్రకటించిన జేఏసీ, ఇతర సంఘాలు
40 శాతం బస్సులు తిరిగాయి..తాత్కాలిక నియామకాలు చేస్తాం : ఆర్టీసీ
కార్మికసంఘాలతోచర్చించండి..డిప్యూటీ సీఎంకు ముఖ్యమంత్రి ఆదేశం
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ జేఏసీ, ఇతర సంఘాలు చేపట్టిన సమ్మె రెండో రోజూ కొనసాగింది. సర్కారు వైఖరి నేపథ్యంలో కార్మికులు విధులకు గైర్హాజరు కావడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వరంగల్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత ఏర్పడింది. ఆయన్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్‌లో ప్రధాన బస్‌స్టేషన్లు, ఎంజీబీఎస్‌, జేబీఎస్‌ నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలియక కొందరు ప్రయాణికులు బస్టాండ్లకు వచ్చి గంటల తరబడి వేచి చూస్తున్నారు. బస్సులు రాకపోవడంతో చివరికి ప్రయివేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఎంజీబీఎస్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్రకు చెందిన బస్సులు నడుస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమవడంతో ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయిస్తున్నారు. ప్రయివేటు వాహనదారులు చార్జీలు పెంచడంతో ప్రభుత్వ, ప్రయివేటు ఉద్యోగులు, విద్యార్థులు, దినసరి కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు డిమాండ్లపై హామీ ఇచ్చేవరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు ప్రకటించారు. జిల్లాల్లో ఆర్టీసీ డిపోల మధ్య పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మెను విరమించేది లేదని ఆర్టీసీ జేఏసీ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఇతర సంఘాలు ప్రత్యేక కార్యాచరణను ప్రకటించాయి. ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా గురువారం 40శాతం బస్సులు రోడ్డెక్కినట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. హైదరాబాద్‌తోపాటు అవసరమైన అన్నీ రీజియన్లల్లో తాత్కాలిక ప్రాతిపదిక డ్రైవర్లు, కండక్టర్లను నియామకానికి రీజినల్‌ మేనేజర్లకు అధికారాలను ఇచ్చింది. ఈ మేరకు ఆర్టీసీ ఆదేశాలు ఇచ్చింది. కాగా ప్రాణాలు తీసుకుంటే సమస్య పరిష్కారం కాదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో శుక్రవారం మంత్రుల ఉపసంఘం ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరుపుతుందని ప్రకటించారు.

జేఏసీ కార్యాచరణ
సమ్మెను ఉధృతం చేసేందుకు జేఏసీ గురువారం మరోసారి కార్యాచరణను ప్రకటించింది. శుక్రవారం (24వ తేదీ) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల ముందు మౌన ప్రదర్శనలు నిర్వహించ నున్నారు. శనివారం(25వ తేదీ) అన్ని డిపోలలో వంటావార్పు చేపట్టనున్నారు. ఆదివారం(26వ తేదీ)అన్ని రీజియన్లలో, జిల్లాల్లో కార్మిక కవాత్‌లు నిర్వహించనున్నారు. సోమవారం(27వ తేదీ) రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు మంత్రులకు, వినతిపత్రాలు సమర్పించేందుకు జేఏసీ, ఎస్‌డబ్ల్యూఎఫ్‌తోపాటు ఇతర సంఘాలు కార్యాచరణ ప్రకటించాయి. ఇకపోతే మంగళవారం (28వ తేదీ) మహిళా ఉద్యోగులతో అన్ని డిపోలలో బతుకమ్మలతో నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నారు. వచ్చే బుధవారం(29వ తేదీ) అన్ని డిపోల ముందు అర్ధనగ ప్రదర్శనలు విజయవంతంగా నిర్వహించాలని అత్యవసర సమావేశంలో నిర్ణయించినట్టు జేఏసీ ప్రకటించింది.

సమస్యల పరిష్కారం కోసం నేడు చర్చలు : మంత్రుల బృందం
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ స్పష్టం చేశారు. గురువారం ఇతర మంత్రులతో కలిసి సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. 2014 నుంచి 2023 వరకు ఉన్న పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితుల గురించి ఆలోచించాలని కార్మికులకు సూచించారు. కార్మికులు తొందరపడొద్దన్నారు. ఎలక్ట్రిక్‌ బస్సులతో ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి ప్రమాదం ఉండదన్నారు. ఉద్యోగాలు తీసేసే ప్రసక్తే లేదన్నారు. కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని వివరించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ క్యాబినెట్‌లో ఆర్టీసీ సమ్మె గురించి చర్చించామని చెప్పారు. కార్మికులు సంయమనం పాటించాలని సూచించారు. వెంటనే చర్చలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వీరు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో పెద్దపాత్ర పోషించారని గుర్తు చేశారు. క్షణికావేశంతో కుటుంబాలు రోడ్డున పడకుండా కార్మికులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మంత్రి దామోదర రాజనర్సింహా మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికుల పరిష్కారం పట్ల కమిట్‌మెంట్‌ ఉందన్నారు. క్యాబినెట్‌లోనూ ఈ అంశంపై చర్చించినట్టు వివరించారు. డిప్యూటీ సీఎం నేతృత్వంలో చర్చలు నిర్వహించనున్నట్టు చెప్పారు. మంత్రి కోమటిరెడ్డి వెంటక్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికులు ఆత్మబలి దానాలు చేసుకోవద్దని అన్నారు. ఉద్యమంలో మనం కొట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే కదా అని చెప్పారు. తెలంగాణ వచ్చాక బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 58 రోజులు సమ్మె చేసి 36 మంది మరణించినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణాన్ని కానుకగా ఇచ్చిందన్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్‌గౌడ్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

సమ్మెలో ఈ సంఘాలు..
ఆర్టీసీ కార్మికుల సమ్మెలో జేఏసీతోపాటు ఇతర సంఘాలు కూడా పాల్గొన్నాయి. ఈయూ, టీఎంయూ(టీ), ఎన్‌ఎంయూ(ఎం), బీడబ్ల్యూయూ, బీకేయూ, కేపీ సంఘాలు జేఏసీలో భాగంగా ఆందోళన చేస్తున్నాయి.
జేఏసీ సమ్మెకు మద్దతుతోపాటు ప్రత్యక్షంగా పాల్గొంటున్న సంఘాలు సైతం ఇందులో ఉన్నాయి. వీటిలో ఎస్‌డబ్ల్యూఎఫ్‌(సీఐటీయూ), టీఎంయూ(ఏ), ఎన్‌ఎంయూ(కే) కేఎస్‌ (బీఎంఎస్‌), ఎస్‌టీఎంయూ, బీఆర్‌టీయూ, ఎస్‌డబ్ల్యూయూ(ఐఎన్‌టీయూ) తదితర సంఘాలు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమంలో ఉన్నాయి.

శంకర్‌గౌడ్‌కు సంఘీభావం
వరంగల్‌ జిల్లా నర్సంపేట్‌ డిపోకు చెందిన డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ ఆత్మహత్యాయత్నం చేసుకోవడం పట్ల ఆర్టీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేయాలే తప్ప, ప్రాణాలు తీసుకోరాదని హితవు పలికాయి. శంకర్‌గౌడ్‌కు అధునాతన వైద్యచికిత్స చేయించాలని ప్రభుత్వాన్ని అన్నీ కార్మిక సంఘాలు కోరాయి.

తాత్కాలిక నియామకాలు
సమ్మె కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అధిగమించేందుకు టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా బస్సులను నడిపేందుకు తాత్కాలిక పద్ధతిలో డ్రైవర్‌, కండక్టర్‌ పోస్టులకు రికూట్ర్‌మెంట్‌ చేపట్టాలని నిర్ణయించింది.
అందులో భాగంగానే సికింద్రాబాద్‌ పరిధిలోని 12 డిపోల్లో తాత్కాలిక ప్రాతిపదికన కండక్టర్‌, డ్రైవర్ల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. పదో తరగతి పాసైనవారికి అవకాశాలు ఇస్తామని ప్రకటించింది. డ్రైవర్‌ పోస్టులకు హెవీ వెహికిల్‌ నడిపిన అనుభవం ఉండాలని,అర్హులైన వారు ఆయా డిపోల్లో సంద్రించాలని అధికారులు సూచించారు.

ఆర్టీసీ నివేదిక
ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం, ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ ఆర్టీసీ ప్రత్యేకంగా నివేదికను విడుదల చేసింది. ప్రస్తుత ఆర్టీసీ పరిస్థితి, పథకాలు, ఆర్థిక అంశాలు, ఇతర విషయాలను సవివరంగా ఈ నివేదికలో ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నది. ఇందులో 2014-2023 వరకు, 2023-2026 వరకు ఉన్న పరిస్థితిని వివరించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక ఆర్టీసీ అన్నీ రంగాల్లో మెరుగుపడిందని చెప్పడమే ఈ నివేదిక ఉద్దేశమని ఆర్టీసీ అధికారులు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -