టీఆర్ఎస్ చీఫ్ కవిత అరెస్టు
బోడుప్పల్‌లో అదుపులోకి తీసుకున్న పోలీసులు
బొల్లారం పీఎస్‌కు తరలింపు
మరోపక్క భూపోరాటానికి వ్యతిరేకంగా దళితుల నిరసన
నవతెలంగాణ-బోడుప్పల్
తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని కోరుతూ గురువారం తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) చేపట్టిన భూపోరాటం హైదరాబాద్ బోడుప్పల్ సర్కిల్ లోని బొల్లిగూడంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు ముందుగానే అడ్డుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కవిత అరెస్టుతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్‌ఎస్ ముందుగా ఉప్పల్ భగాయత్‌లో సభ నిర్వహించాలనుకుంది. దీనికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో వేదికను బోడుప్పల్ సర్కిల్ లోని బొల్లిగూడానికి మార్చగా అక్కడ కూడా అడ్డంకులను ఎదుర్కొంది. ఈ నేపథ్యంలోనే సభ ఏర్పాట్ల కోసం అక్కడ టెంట్లు వేస్తుండగా పోలీసులు భారీ బలగాలతో చేరుకుని అనుమతి లేదంటూ వాటిని తొలగించారు. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగడంతో పోలీసులతో కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. నిరసనలో పాల్గొనడానికి వచ్చిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అడ్డుకుని పోలీసులు బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉప్పల్‌లో తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడం అన్యాయమన్నారు. ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామన్న హామీని కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని మాత్రమే కోరామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేటి నుంచే కౌంట్‌డౌన్ ప్రారంభమైందన్నారు. వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
భూపోరాటానికి వ్యతిరేకంగా దళితుల నిరసన
ఇదిలా ఉండగా, బొల్లిగూడం ప్రాంతంలోని దళితుల భూములను ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వాధీనం చేసుకుని ఎకరానికి 600 గజాల చొప్పున ప్లాట్లు కేటాయిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్ర సేన భూపోరాటం చేపట్టడాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక దళితులు కూడా నిరసన వ్యక్తం చేశారు. దీంతో బొల్లిగూడంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భూపోరాటం సందర్భంగా అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను ఘట్‌కేసర్‌తో పాటు పలు పోలీస్ స్టేషన్లకు తరలించగా, వారి విడుదల కోరుతూ తెలంగాణ రక్షణ సేన కార్యకర్తలు ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.



