Saturday, June 13, 2026
E-PAPER
Homeకరీంనగర్మరమగ్గాలే లోకం… నేత పనే జీవితం

మరమగ్గాలే లోకం… నేత పనే జీవితం

- Advertisement -

నేతన్నకు ఎనిమిది గంటలకు బదులు 12 గంటల పని
మరమగ్గాల చప్పుళ్ల మధ్య నలిగిపోతున్న నేతన్న
అమలులోకి రాని యాజమాన్యాల ఒప్పందాలు
పని గంటల పరిమితి కోసమే కార్మిక సంఘాల పోరాటం
నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల
మరమగ్గాలే వాళ్లకు లోకం.. నేత పనే వారికి జీవితం.. కానీ 8 గంటలకు బదులు 12 గంటలు ఉపాధి కోసం మరమగ్గాల చప్పుళ్ల మధ్య నేతన్నలు నలిగిపోతున్నారు. కూలి ఒప్పందాల సమయంలో కార్మికులకు 8 గంటల పని విధానం అమలు చేస్తామని యాజమాన్యాలు రాసుకున్న ఒప్పందాలు అమలులోకి రాకుండానే పోయాయి. పని గంటల పరిమితి కోసం సాగిన పోరాటంలో కార్మికుల రక్తంతో తడిసి ఎగిరిన ఎర్రజెండాతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులు ఉపాధి కోసం గత ప్రభుత్వ హాయంలో బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లను సాధించారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆర్డర్లకు ఇబ్బందులు ఏర్పడిన సందర్భంలోనూ కార్మికులు మళ్లీ రోడ్డు ఎక్కడంతో ప్రభుత్వం బతుకమ్మ చీరల స్థానంలో స్వశక్తి మహిళలకు చీరలు, ఇతర ఆర్డర్లను ఇచ్చి భరోసాను నింపింది.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలోని కార్మికులు ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల మరమగ్గాలు, డైయింగ్ లు, సైజింగ్ లు, వార్పిన్ లపై 15 వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న నేతన్న పథకాలపై ఎంతో ఆశగా నేత కుటుంబాలు ఉన్నాయి. మరోవైపు పని గంటల పరిమితి లేకపోవడంతోనే మానసికంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారు. కార్మిక సంఘాలు 8గంటల పని విధానం అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూనే ఉన్నాయి.

నేతన్న బతుకు.. ఎప్పుడూ ఆగమే..
సిరిసిల్ల మగ్గం బతుకులు ఎప్పుడూ ఆగమే. నేతన్న బతుకు నిత్యం పోరాటంగానే సాగుతుంది. పొద్దస్తమానం కష్టపడిన నేతన్నలు ఉపాధి కరువై అప్పుల్లో కూరుకుపోతూనే ఉన్నారు. నమ్ముకున్న నూలు దారమే ఉరి తాళ్లుగా వేలాడుతుంటే నిత్యం బతుకు చప్పుడు వినిపించే మరమగ్గాలు ఎప్పుడూ నేతన్నలను వెక్కిరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో నేతన్నలకు ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వ ఆర్డర్లు భరోసా కల్పిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో అందిన ఆర్డర్లలో మార్పులు తీసుకువచ్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డర్ ఇవ్వడంలో చేసిన జాప్యం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఒక్కసారిగా సంక్షోభంలోకి నెట్టింది.

దాదాపు 15 మందికి పైగా కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వామపక్ష పార్టీలు, పవర్లుము కార్మిక సంఘాలు, వస్త్రోత్పత్తిదారుల సంఘాల ఆందోళనల ఫలితంగా ప్రభుత్వం మళ్లీ స్వశక్తి మహిళల కోసం చీరల ఆర్డర్లు, విద్యార్థులకు యూనిఫామ్ బట్ట ఉత్పత్తి వంటివి ఇవ్వడంతో ఉపశమనం పొందారు. విద్యుత్తు రాయితీ 10 హెచ్పీ ల నుంచి 25 హెచ్పీలకు పెంచారు. కొంత బకాయిల సమస్య వెంటాడుతుంది. స్వశక్తి  చీరలకు రూ .50 కోట్లతో ఏర్పాటు చేసిన యారన్ డిపో ఆధారంగా నిలిచింది. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నేపథ్యంలో గత ప్రభుత్వ హాయంలో సిరిసిల్లలో బీడీలు చుట్టే కార్మికులు వస్త్రోత్పత్తి రంగంలో ఉన్న మహిళలకు గార్మెంట్ రంగంలో ఉపాధి కల్పించడానికి పూనుకుంది.

ఆ దిశగానే సిరిసిల్ల శివారు లోని సర్దాపూర్ వద్ద మహిళల కోసం గార్మెంట్ రంగంలో పరిశ్రమలు తీసుకువచ్చే దిశగా అపరాల్ పార్కు, పవర్లూమ్ కార్మికులను యజమానులుగా మార్చే వర్కర్ టు ఓనర్ పథకం కోసం వీవింగ్ పార్క్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అపేరాలు పార్కులో వస్తున్న యూనిట్లతో మహిళలకు ఉపాధి లభిస్తుండగా వర్కర్ టు ఓనర్ పథకం కోసం నేతన్నలు ఎదురుచూస్తూ నిరాశ చెందుతున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన వర్కర్ టు ఓనర్ పథకం పై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకపోవడం నిర్మాణం పూర్తి చేసుకున్న షెడ్లలో ఇతర సంస్థలకు లీజుకి ఇవ్వడంతో పవర్లూమ్ కార్మికుల్లో పథకంపై ఆశలు సన్నగిల్లాయి. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం రూ .386.88 కోట్లతో పవర్లూమ్ కార్మికులను యజమానులుగా మార్చే పథకాన్ని అమలు చేయడానికి సన్నాహాలు ప్రారంభించడంతో కార్మికుల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. కానీ యాక్షన్ ప్లాన్ ఏంటో కనిపించకపోవడంతో ఎదురుచూపులే మిగిలిస్తున్నాయి.

కార్మికుల కోసమే పథకం రూపకల్పన …
మరమగ్గాల కార్మికులను యజమానులుగా మార్చే దిశగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని రూపకల్పన చేశారు. ఇందుకు అనుగుణంగా జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరు వద్ద వీవింగ్ పార్కు నిర్మాణం చేపట్టారు. 42 వీవింగ్ షెడ్లు నిర్మాణం జరిగింది. ఇందులో కార్మికులకు మొదటి విడతలో 4416 మరమగ్గాలను గ్రూప్ కింద అందించనున్నారు. ఒక్కో కార్మికుడికి 800 చదరపు అడుగుల్లో స్టోర్ రూమ్ తో కలిసి అందిస్తారు. ఇందులో నాలుగు సెమి ఆటోమేటిక్ మరమగ్గాలు, ఖండలు చుట్టే యంత్రం ఇస్తారు. పార్కులో 60 వార్పింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఒక్కో యూనిట్ ధర రూ.8 లక్షలు గా ముందుగా నిర్ణయించారు. ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా రూ..16.52 లక్షల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఇందులో 10 శాతం లబ్ధిదారుడి వాటా దనం, 50% ప్రభుత్వ రాయితీ, 40 శాతం బ్యాంకు రుణం ఉండే విధంగా పథకానికి రూపకల్పన చేశారు. సిరిసిల్లలో ఎక్కడలేని విధంగా ఏర్పాటు చేస్తున్న వీవింగ్ పార్కులో కొందరికే మరమగ్గాల యూనిట్లు దక్కే అవకాశం ఉండడంతో మిగతా కార్మికులు నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. సిరిసిల్ల వస్త్ర ఉత్పత్తి రంగంలో జియోటాకింగ్ చేసిన మరమగాలు 30,352 ఉన్నాయి. వీటిపై 6500 మంది పనిచేస్తున్నారు. అనుబంధ పరిశ్రమల్లో మరో 6000 మంది వరకు పనిచేస్తున్నారు. ప్రభుత్వం మొదటి దశలో కేవలం 1100 మందికి యూనిట్లను అందించనుంది. మిగతా కార్మికులు నిరీక్షించే పరిస్థితి ఉంది.

గార్మెంట్ రంగంలో మహిళలకు ఉపాధి..
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభం నేపథ్యంలో సిరిసిల్ల పెద్దూరు శివారులో మహిళా కార్మికుల కోసం 60 ఎకరాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ రూ.174 కోట్లతో నిర్మాణాలు చేపట్టారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్లాట్లను కేటాయించారు. గార్మెంట్ రంగంలో మహిళలకు ఉపాధి లభిస్తుంది. ఆపేరాల్ పార్కులో 2021 ఏప్రిల్ లో గోకులుదాస్ గార్మెంట్ సంస్థ యూనిట్ను ప్రారంభించింది. 800 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ ప్రారంభించిన యూనిట్ ను 1600 మందికి ఉపాధి కల్పించే దిశగా విస్తరించింది. సిరిసిల్ల నుంచి నేరుగా అమెరికా లాంటి దేశాలకు రెడిమేడ్ వస్త్రాలు పంపిస్తుంది. ఇదే దిశగా బెంగళూరుకు చెందిన అంతర్జాతీయ గార్మెంట్ రంగ సంస్థ యూనిట్ ను ప్రారంభించింది. ఈ కంపెనీ ద్వారా  2 వేల మందికి ఉపాధి లభించనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -