నవతెలంగాణ హైదరాబాద్: నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనతో నేడు ఢిల్లీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎట్టకేలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై సీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ‘ఇది విద్యార్థుల విజయం’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ఇది మొదటి విజయం. మనం ఇక్కడితో ఆగిపోము. ఇది కేవలం ఆరంభం మాత్రమే. గత 36 రోజులుగా ఇక్కడ కూర్చుని ఉన్న విద్యార్థులందరికీ, స్వచ్ఛంద కార్యకర్తలందరికీ నేను వందనం చేస్తున్నాను.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. ‘‘శాంతియుతంగా చేసే ఏ ఆందోళనతో అయినా లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది. దీన్ని గాంధీజీ నుంచి నేర్చుకున్నా. ఈ దేశ యువత శాంతియుత నిరసనలు వృథాగా పోలేదు. విద్యార్థుల పోరాటం ఫలించింది. విద్యార్థులు, యువత సత్తా ఏంటో తెలిసింది. ఈ విజయం విద్యార్థులందరిది. ప్రజాస్వామ్యం అంటే ఇదే’’ అని ఆనందం వ్యక్తం చేశారు.
‘‘మాకు రాజకీయాలు అవసరం లేదు. మా డిమాండ్లలో ఒకటి నెరవేరింది. మిగతా రెండూ నెరవేరే వరకు వేచి చూస్తాం. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు పూర్తిగా ఎత్తివేయాలి. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఈ ఉద్యమం ఆగదు. ఈ సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తులతో ర్యాలీ చేద్దాం’’ అంటూ యువతకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చింది.



