Friday, October 31, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుబతికుండగానే మార్చురీలోకి?

బతికుండగానే మార్చురీలోకి?

- Advertisement -

మహబూబాబాద్‌ జీజీహెచ్‌లో ఘటన
అలాంటిదేమీ లేదు..తీసుకొచ్చి వైద్యం చేశాం : సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌

నవతెలంగాణ-మహబూబాబాద్‌
మహబూబాబాద్‌ జీజీహెచ్‌లో అమానుష ఘటన వెలుగుజూసింది. బతికుండగానే ఓ వ్యక్తిని మార్చురీలో వేసినట్టు ప్రచారం జరుగుతుండగా.. అలాంటిదేమీ లేదంటున్నారు సూపరింటెండెంట్‌ వీడియో విడుదల చేశారు. వివరాలిలా ఉన్నాయి.. చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్‌ రాజు అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చాడు. అయితే, రాత్రంతా బయట ఉండిపోయానని, ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్‌ లోపలికి తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నట్టు బాధితుడు తెలిపాడు. అయితే అతను పొరపాటున మార్చురీలోకి వెళ్లాడా..? లేక మానుకోట ప్రభుత్వాస్ప త్రికి వైద్యం కోసం వచ్చిన అతను ఆరు బయట పడిపోతే.. సిబ్బంది చనిపోయాడనుకుని మార్చురీకి తరలించారా? అనే విషయం తెలియడం లేదు.

అయితే, మానుకోట ఆస్పత్రి సిబ్బంది అమానవీయం గా వ్యవహరించారని, స్పృహ కోల్పోయిన వ్యక్తిని చనిపోయాడనుకుని మార్చురీలో వేశారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గురువారం ఉదయం మార్చురీలో ఊడ్చేందుకు వెళ్లిన స్వీపర్‌ను చూసిన రాజు.. తాను బతికే ఉన్నానని, కాపాడాలని అరిచినట్టు సమాచారం. స్వీపర్‌ ఆస్పత్రి సిబ్బందికి తెలపడంతో.. రాజును వార్డుకు తరలించి వైద్యం అందిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజు వెంట ఎవరూ లేకపోవడంతో పూర్తి వివరాలు తెలియలేదు. అతను మాత్రం తాను రాత్రంతా మార్చురీ రూంలోనే గడిపానని అంటున్నాడు.

తీసుకొచ్చి వైద్యం చేశాం : సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌
ఆస్పత్రి ఎదురుగా ఉన్న మార్చురీ ప్రహరీ గోడను ఆనుకొని రోడ్డుపై వర్షంలో పడి ఉన్న టాక్సీ డ్రైవర్‌ రాజును మానవత్వంతో తీసుకొచ్చి వైద్యం చేశామని గురువారం సాయంత్రం జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ఒక వీడియో విడుదల చేశారు. బుధవారం సాయంత్రం సెక్యూరిటీ గార్డ్‌ వెంకటయ్య గమనించి సూపర్‌వైజర్‌ రాజన్నకు చెప్పారని పేర్కొన్నారు. వారు పేషెంట్‌ రాజును తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించగా డ్యూటీ డాక్టర్‌ వైద్యం చేస్తున్నారన్నారు. పేషెంట్‌ రాజు పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. మహబూబాబాద్‌ జనరల్‌ ఆస్పత్రిలో బతికి ఉన్న వ్యక్తిని మార్చురీలో పెట్టారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -