Wednesday, September 9, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపారదర్శకంగా కానిస్టేబుల్‌, ఎస్సైల రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ

పారదర్శకంగా కానిస్టేబుల్‌, ఎస్సైల రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ

- Advertisement -

దళారీలను నమ్మితే అభ్యర్థులు మోసపోతారు.. జాగ్రత్త నాలుగు కమిషనరేట్లు, యాదాద్రి-భువనగిరిలలో త్వరలో ఖాళీల భర్తీ
ఎస్‌పీఎఫ్‌, ఫైర్‌ సర్వీసెస్‌లో 
మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ :
 రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మెన్‌, డీజీపీ వి.వి శ్రీనివాస్‌రావు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

రాష్ట్ర పోలీసు శాఖతో పాటు ఎస్‌పీఎఫ్‌, అగ్నిమాపక శాఖ, జైళ్ల శాఖలకు సంబంధించి కానిస్టేబుళ్లు, ఎస్సైల రిక్రూట్‌మెంట్‌ పూర్తిగా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మెన్‌, పోలీసు సాంకేతిక విభాగం డీజీపీ వి.వి శ్రీనివాస్‌రావు తెలిపారు. ఈ రిక్రూట్‌మెంట్‌ సందర్భంగా ఉద్యోగాలిప్పిస్తామంటూ వచ్చే దళారుల పట్ల అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియ ప్రతి దశా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తున్నామనీ, ఇందులో ఎలాంటి అక్రమాలకు తావుండబోదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం పోలీసు శాఖకు సంబంధించి ఐదువేలు, ఎస్‌పీఎఫ్‌, జైళ్లు, ఫైర్‌ సర్వీసులకు సంబంధించి 2,443 పోస్టులకు నియామక ప్రక్రియను చేపట్టామనీ, ఇందులో 298 పోస్టులు ఎస్సై స్థాయి అధికారులకు సంబంధించినవని ఆయన తెలిపారు. ప్రిలిమినరీ, పీఎంటీ (దేహదారుఢ్య), మెయిన్స్‌గా మూడు దశల్లో రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ప్రిలిమినరీలో నెగ్గిన అభ్యర్థులకు పీఎంటీ, పీఎంటీలో నెగ్గినవారికి మెయిన్స్‌ పరీక్ష రాయడానికి అర్హులవుతారని ఆయన స్పష్టం చేశారు. పీఎంటీలో పురుషులకు 1600 మీటర్లు, మహిళలకు 800 మీటర్లుగా పరుగు పరీక్షను నిర్వహిస్తామనీ, ఈ పరీక్షలో పాల్గన్నవారికి ఎంత సమయంలో పరిగెత్తారని నిర్ణయించేది ఆర్‌ఎఫ్‌ఐడీతో కూడిన సాంకేతిక పరిజ్ఞానమనీ, దీని ద్వారా అభ్యర్థులెవరూ కూడా పరుగు పరీక్షలో పొరపాట్లు చేయకుండా చూడటానికి వీలవుతుందని శ్రీనివాస్‌రావు స్పష్టం చేశారు. పీఎంటీలోనే లాంగ్‌ జంప్‌, షాట్‌పుట్‌ పరీక్షలు కూడా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ మారు కొన్ని ప్రెసిడెన్షియల్‌ నిబంధనల కారణంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, మల్కాజ్‌గిరి, ఫ్యూచర్‌సిటీ పోలీసు కమిషరేట్లతో పాటు యాదాద్రి-భువనగిరి జిల్లాలోని పోలీసు ఖాళీలను భర్తీ చేయడం లేదనీ, తదుపరి ఆదేశాలు వచ్చాక నియామక ప్రక్రియను చేపడతామని ఆయన ఒక ప్రశ్నకు జవాబిచ్చారు. నిజానికి రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీలు ఎక్కువగానే ఉన్నాయనీ, అయితే ప్రభుత్వం ఇచ్చిన నిర్దేశాల మేరకు 7,443 ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఈ పోస్టుల కోసం వయో పరిమితిని పోలీసు కానిస్టేబుల్‌ పోస్టుల కోసం 22 ఏండ్లు ఉండగా.. దానికి అదనంగా 12 ఏండ్లు పెంచి 34 సంవత్సరాలుగా, ఎస్సై పోస్టులకు వయోపరిమితి 25 సంవత్సరాలు కాగా, దానికి మరో 12 ఏండ్లు పెంచి 37 ఏండ్లుగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు నిర్ణయించడం జరిగిందని ఆయన తెలిపారు. కానిస్టేబుల్‌ పోస్టులకు టెన్త్‌, ఇంటర్మీడియట్‌ పోర్షన్‌, ఎస్సై పోస్టులకు డిగ్రీ స్థాయి పోర్షన్‌లను సిలబస్‌గా ఎంచుకున్నామని ఆయన వివరించారు. గత 12 ఏండ్లుగా పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మెన్‌ హౌదాలో తాను 42వేల మందిని రిక్రూట్‌ చేశాననీ, అదే అనుభవంతో తాజా నియామక ప్రక్రియను కూడా ఎలాంటి ఆరోపణలూ రానివ్వకుండా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేసే విషయంలో అభ్యర్థులు 400 మీటర్ల కంటే తక్కువ దూరం ఉన్న మైదానాలను ఎంచుకోవద్దని ఆయన సూచించారు. 400 మీటర్లకు పైనే ఉండే పోలీసు ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ మైదానాల్లో శిక్షణ తీసుకోవడం వల్ల పరుగు పరీక్ష సందర్భంగా అభ్యర్థులు ఎలాంటి పొరపాట్లు చేయకుండా వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అభ్యర్థుల ఎత్తును పరీక్షించే సమయంలో మెజర్‌మెంట్‌ టేప్‌తో పాటు డిజిటల్‌ పద్ధతిని కూడా ఉపయోగిస్తున్నామనీ, దీని వల్ల అభ్యర్థుల ఎత్తును సరిగ్గా కొలత వేయడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. ఈ మారు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఎస్‌పీఎఫ్‌), ఫైర్‌ సర్వీసెస్‌ విభాగాల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను కల్పిస్తున్నామని అన్నారు. పోలీసు శాఖకు ఎంపికైన కొందరు అభ్యర్థులు ఉద్యోగంలో చేరకుండా ఇతర ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తున్నారనీ, అక్కడ ప్రయత్నం ఫలించకపోతే తిరిగి వచ్చి పోలీసు శాఖలో చేరుతున్నారనీ, దీని వల్ల సిబ్బంది సంఖ్యాపరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. ఈ పరిస్థితిని మార్చడానికి గానూ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందనీ, దాని ప్రకారం పోలీసు శాఖకు ఎంపికైనవారు.. వారి సహచరులు ప్రొహిబిషన్‌ పీరియడ్‌ పూర్తయ్యేలోగా వచ్చి విధుల్లో చేరకపోతే వారిని తప్పించడం జరుగుతుందనీ, తిరిగి చేరాలనుకునేవారికి ఒక పరీక్షను నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. ప్రస్తుతం ప్రకటించిన పోస్టుల కోసం దాదాపు నాలుగు లక్షల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నామనీ, అంతకు మించి కూడా పెరగొచ్చని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -