మాజీ న్యాయమూర్తి రాజీనామా … కమిటీ పనితీరుపై అభ్యంతరాలు
ముంబయి : దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలును ముందుకు తీసుకెళ్లాలని కేంద్రంలోని మోడీ సర్కారు, పలు రాష్ట్రాల్లోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్న వేళ.. మహారాష్ట్రలో అదే అంశంపై ఏర్పాటు చేసిన కమిటీలోనే విభేదాలు బయటపడ్డాయి. కమిటీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌సీ చవాన్ రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
మహారాష్ట్రలో యూసీసీ ముసాయిదా రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల కమిటీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్‌సీ చవాన్ కమిటీ నుంచి తప్పుకున్నారు. కమిటీ సమావేశాలు సారవంతమైన చర్చలు లేకుండానే ముగుస్తున్నాయనీ, అలాగే రాష్ట్రానికి వెలుపలికి చెందిన ఓ అధికారి కమిటీ వ్యవహారాల్లో భాగస్వామ్యం కావడంపై అభ్యంతరం ఉందని ఆయన తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. జులైలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రంజనా దేశాయ్ దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. ఆరు నెలల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో యూసీసీ ముసాయిదా చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల్లో కీలక అంశాలపై లోతైన చర్చ జరగడం లేదని చవాన్ ఆరోపించారు. సమావేశాల అజెండాలోని మినిట్స్ ఆమోదం, వెబ్‌సైట్ మార్పులు, ప్రజల అభిప్రాయాలు సేకరించేందుకు ప్రశ్నావళి రూపొందించడం వంటి అంశాలు త్వరగా ముగుస్తున్నాయని వివరించారు. ప్రజల అభిప్రాయాల కోసం ప్రశ్నావళి రూపొందించే సమయంలో కమిటీ సభ్యులు చేసిన కొన్ని సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని కూడా ఆయన పేర్కొన్నారు. మరో రాష్ట్రానికి చెందిన అధికారి కమిటీ పనితీరులో భాగం కావడంపైనా చవాన్ ప్రశ్నలు లేవనెత్తారు. వివాదాస్పద యూసీసీ అంశం చాలాకాలంగా బీజేపీ ప్రధాన రాజకీయ అజెండాలో ఉంది. ఇప్పటికే పలు బీజేపీ పాలిత ప్రభుత్వాలు యూసీసీని మరింతగా ముందుకు తీసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర యూసీసీ కమిటీలోనే మాజీ న్యాయమూర్తి రాజీనామా చేయడం.. ముసాయిదా రూపకల్పన ప్రక్రియలో పారదర్శకత, సభ్యుల మధ్య సమన్వయం, ప్రజల అభిప్రాయాలకు ఇచ్చే ప్రాధాన్యతపై చర్చకు దారితీసింది.
‘మహా’ యూసీసీ కమిటీలో కలకలం
- Advertisement -
- Advertisement -


