అందుబాటులో ఉన్న ఇండ్లు కేవలం 5 శాతమే
చిన్న ఇండ్లకు డిమాండ్ ఉన్నా.. పెద్ద ఇండ్ల నిర్మాణానికే బిల్డర్లు మొగ్గు
పెరుగుతున్న భూమి, నిర్మాణ వ్యయాలే కారణం..సామాన్యులకు భారమైన ‘సొంతిల్లు’
దేశంలోని గృహ నిర్మాణ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సొంతింటి కోసం తక్కువ బడ్జెట్‌తో సింగిల్ బెడ్‌రూం (1 బీహెచ్‌కే-ఒక పడకగది, హాల్, వంటగది) ఇండ్లను కోరుకునే వారి సంఖ్య గణనీయంగానే ఉన్నప్పటికీ.. నిర్మాణ సంస్థలు మాత్రం పెద్ద ఇండ్ల వైపు మొగ్గుచూపుతున్నాయి. మ్యాజిక్‌బ్రిక్స్ ప్రాప్‌ఇండెక్స్ ఏప్రిల్–జూన్ 2026 నివేదిక ప్రకారం.. గృహ కొనుగోలుదారుల డిమాండ్‌లో 1 బీహెచ్‌కే ఇండ్ల వాటా 13 శాతంగా ఉండగా, అందుబాటులో కేవలం ఐదుశాతం మాత్రమే ఉన్నాయి. డిమాండ్, సరఫరాకు మధ్య ఉన్న ఈ అంతరం దేశంలో అందుబాటు గృహాల సంక్షోభాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది.
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సొంతింటి కొనుగోలుదారుల అభిరుచుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకప్పుడు మధ్యతరగతి ఉద్యోగులు, చిన్న కుటుంబాలు, తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారికి 1 బీహెచ్‌కే ఇండ్లు ప్రధాన ఎంపిక. అయితే ప్రస్తుతం నిర్మాణ సంస్థలు ఎక్కువగా 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే ఇండ్ల నిర్మాణంపై దృష్టి పెడుతున్నాయి. మ్యాజిక్‌బ్రిక్స్ ప్రాప్‌ఇండెక్స్ ఏప్రిల్–జూన్ 2026 త్రైమాసిక నివేదిక ప్రకారం.. 1 బీహెచ్‌కే ఇండ్లకు కొనుగోలుదారుల డిమాండ్ 13 శాతంగా ఉంది. కానీ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గృహాల సంఖ్యలో వాటి వాటా 5 శాతమే. ఇదే సమయంలో 2 బీహెచ్‌కే ఇండ్లకు 42 శాతం డిమాండ్ ఉండగా, సరఫ రాలో వాటి వాటా 32 శాతంగా ఉంది. 3 బీహెచ్‌కే ఇండ్లకు 37 శాతం డిమాండ్ ఉండగా, అందుబాటులో ఉన్న ఇండ్లలో వాటి వాటా 46 శాతంగా ఉంది. 3 బీహెచ్‌కే కంటే పెద్ద ఇండ్లకు 8 శాతం డిమాండ్ ఉండగా.. అందుబాటులో ఉన్నవి 17 శాతంగా ఉన్నా యి. ఈ గణాంకాలు చిన్న ఇండ్లను కోరుకునే వారికి మార్కెట్‌లో తగినన్ని అవకాశాలు లేవని సూచిస్తున్నాయి.
బిల్డర్లకు పెద్ద ఇండ్లే లాభదాయకం
1 బీహెచ్‌కే ఇండ్ల నిర్మాణం తగ్గడానికి ప్రధాన కారణాల్లో ఒకటి నిర్మాణ సంస్థల వ్యాపార ప్రయోజనాలు. అపార్ట్‌మెంట్ పరిమా ణం తగ్గినంత మాత్రాన మొత్తం ప్రాజెక్టు వ్యయం అదే స్థాయిలో తగ్గిపోదు. భూమి ధరలు, అనుమతులు, లిఫ్టులు, సాధారణ ప్రదేశాలు, ఇతర మౌలిక సదుపాయాల ఖర్చులు పెద్దగా మారవు. అయితే పెద్ద ఇండ్లను అధిక ధరలకు విక్రయించే అవకాశం ఉంటుంది. ఫలితంగా నిర్మాణ సంస్థలకు ఒక్కో ఇంటిపై వచ్చే ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. రైజ్ ఇన్‌ఫ్రావెంచర్స్ వైస్ ప్రెసిడెంట్ సుమిత్ చౌధురి మాటల్లో చెప్పాలంటే .. పెద్ద ఇండ్లు నిర్మించడం ద్వారా డెవలపర్లకు అధిక టికెట్ ధర, మెరుగైన ఆదాయ అవకాశాలు లభిస్తాయి. భూమి, అనుమతులు, సదుపా యాలు, సాధారణ ప్రదేశాల వంటి ఖర్చులు ఇండ్ల పరిమాణం మారినా చాలా వరకు సమానంగానే ఉంటాయి అని చెప్పారు. అంటే భూమి ధరలు పెరుగుతున్న సమయంలో తక్కువ ధరకు విక్రయించాల్సిన చిన్న ఇండ్ల కంటే, అధిక ధరకు విక్రయించగల పెద్ద ఇండ్లను నిర్మించడానికే బిల్డర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు.
పెద్ద ఇండ్ల వైపే కొనుగోలుదారుల చూపు
ఇండ్ల కొనుగోలుదారుల అభిరుచుల్లోనూ మార్పులు కనిపిస్తున్నాయి. అనరాక్ 2026 తొలి అర్ధభాగం వినియోగదారుల సెంటిమెంట్ సర్వేలో 14 నగరాలకు చెందిన 8,320 మంది పాల్గొన్నారు. వారిలో 48 శాతం మంది 3 బీహెచ్‌కే ఇండ్లను కోరుకోగా, 38 శాతం మంది 2 బీహెచ్‌కే ఇండ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. 4 బీహెచ్‌కే అంతకంటే పెద్ద ఇండ్లను కోరుకునే వారి వాటా 2024 తొలి అర్ధభాగంలోని సుమారు 3 శాతం నుంచి దాదాపు 5 శాతానికి పెరిగింది. అదే సమయంలో కొనుగోలుదారులు ఇండ్ల కోసం కేటాయించే బడ్జెట్ కూడా పెరిగింది. రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధరల గృహాలు అత్యంత ప్రాధాన్యం పొందిన విభాగంగా నిలిచాయి. పెద్ద ఇండ్లకు డిమాండ్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. పిల్లల చదువుకోసం ప్రత్యేక గది, తల్లిదండ్రులకు వేరు స్థలం, ఇంటి నుంచే పనిచేసే వారికి కార్యాలయ గది, కుటుంబ సభ్యులకు ఎక్కువ వ్యక్తిగత స్థలం వంటి అవసరాలు ఇందుకు కారణమవుతున్నాయి.
వర్క్ ఫ్రం హోమ్‌తో అదనపు గదికి ప్రాధాన్యం
గాంధీనగర్‌కు చెందిన ఓ ఉపాధ్యాయుడు కుటుంబం పెరుగుతున్న నేపథ్యంలో 3 బీహెచ్‌కే ఇల్లు కొనుగోలు చేశారు. పిల్లల చదువుకు అదనపు స్థలం, అతిథుల కోసం ప్రత్యేక గది, కుటుంబానికి మరింత వ్యక్తిగత గోప్యత అవసరమని ఆయన తెలిపారు. పూణేకు చెందిన ఓ ఐటీ ఉద్యోగి కూడా 3 బీహెచ్‌కే ఇంటిని ఎంచుకున్నారు. ఇంటి నుంచి పనిచేసే సమయంలో కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక కార్యాలయ గది ఉండాలనే ఉద్దేశంతో పెద్ద ఇంటిని కొనుగోలు చేసినట్టు చెప్పారు. జైపూర్‌నకు చెందిన రిటైర్డ్ సుబేదార్ మేజర్, మాజీ సైనిక అధికారి నరేంద్ర శర్మ 3 బీహెచ్‌కే ఇల్లు కొనుగోలు చేశారు. వేర్వేరు అవసరాలతో ఇండ్లు కొనుగోలు చేసినప్పటికీ.. ఈ ముగ్గురూ 1 బీహెచ్‌కే కంటే పెద్ద ఇండ్లను ఎంచుకున్నారు.
పెద్ద ఇల్లు అంటే భవిష్యత్తుకు భద్రత
ల్యాండ్‌మార్క్ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మెన్ సందీప్ చిల్లర్ ఇండ్ల నిర్మాణాలపై స్పందిస్తూ వినియోగదారులు ప్రస్తుతం 2+1, 3 బీహెచ్‌కే, అంతకంటే పెద్ద ఇండ్లను ఎక్కు వగా పరిశీలిస్తున్నారని చెప్పారు. కుటుం బ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకు నే వెసులుబాటు, పని, పిల్లలు, తల్లిదం డ్రులు, ఆరోగ్యం వంటి అవసరాలకు అదనపు స్థలం అవసరమవుతోందని ఆయన తెలిపారు. టార్క్ లిమిటెడ్ ఎండీ, సీఈవో అమర్ సరిన్ కూడా ఇండ్ల పరిమాణం పెరగడానికి అనేక అంశాలు కారణమని వివరించారు. మెరుగైన రవాణా సౌకర్యాలు, సౌలభ్యం, ఇంటి నుంచే పనిచేసే వారికి ప్రత్యేక స్థలం, దీర్ఘకాలిక ప్రణా ళిక, ఆస్తిని సంపదగా పరిగణించే దృక్పథం వంటివి పెద్ద ఇండ్లకు డిమాండ్‌ను పెంచు తున్నాయని వివరించారు. అయితే పెద్ద ఇండ్లకు డిమాండ్ ఉందని చెప్పడం వల్ల చిన్న ఇండ్ల అవసరం తగ్గిపోయిందని అర్థం కాదని అన్నారు.
బడ్జెట్ కోసం 1 బీహెచ్‌కే ఎంచుకున్న మహిళ
ఘజియాబాద్‌లోని ఇందిరాపురానికి చెందిన డేటా అనలిస్ట్ సురభి మల్హోత్రా మొదట 2 బీహెచ్‌కే ఇల్లు కొనుగోలు చేయాలని ఆలోచించారు. చివరకు 1 బీహెచ్‌కే ఇంటినే ఎంచుకున్నారు. తక్కువ ప్రారంభ పెట్టుబడి, నిర్వహణ ఖర్చులు, ఈఎంఐని అందుబాటులో ఉంచుకోవడం తన నిర్ణయానికి ప్రధాన కారణాలని ఆమె తెలిపారు. సరైన ప్రాంతంలో కొనుగోలు చేస్తే అద్దె, పునర్విక్రయ అవకాశాలు కూడా బాగుంటాయని ఆమె భావించారు. సురభి నిర్ణయం 1 బీహెచ్‌కే ఇండ్లకు ఇంకా మార్కెట్ ఉందని చూపిస్తోంది. పెద్ద ఇండ్లను కొనుగోలు చేయగల సామర్థ్యం లేని, తక్కువ ప్రారంభ పెట్టుబడితో సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి 1 బీహెచ్‌కే ఇండ్లు ఇప్పటికీ అవసరమేనని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు.
డిమాండ్ ఉంది.. సరఫరా ఎక్కడ?
భారత గృహ నిర్మాణ మార్కెట్‌లో 1 బీహెచ్‌కే ఇండ్ల పరిస్థితి ఒక విరుద్ధ వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. ఒకవైపు కొనుగోలుదారుల్లో కొంత వర్గం పెద్ద ఇండ్లకు ప్రాధాన్యం ఇస్తోంది. మరోవైపు తక్కువ బడ్జెట్‌తో ఇల్లు కొనాలనుకునే వారికి 1 బీహెచ్‌కే ఇండ్లు అవసరంగానే ఉన్నాయి. 1 బీహెచ్‌కే ఇండ్లకు డిమాండ్ లేకపోవడం సమస్య కాదు. వాటిని కోరుకునే వారికి తగినంత సరఫరా లేకపో వడమే ప్రధాన సమస్య. కొందరికి వారి బడ్జెట్ లో సరిపోయే చిన్న ఇల్లే సరైన పరిష్కారం. కానీ మార్కెట్ మాత్రం పెద్ద ఇండ్ల వైపు కదులు తున్నప్పుడు.. ఆ కొనుగోలుదారులకు అందు బాటులో ఉన్న ఎంపికలు తగ్గిపోతున్నాయి. ఇదే భారత గృహ నిర్మాణ రంగంలో 1 బీహెచ్‌కే ఇండ్లకు ఎదురవుతున్న అసలు సవాలుగా మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు.
బ్యాంకర్ల చిన్నచూపు
సింగిల్ బెడ్‌రూం ఇండ్లకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు కూడా పెద్దగా ఆసక్తి చూపట్లేదు. తక్కువ ఆదాయవర్గాలకు రుణాలు ఇచ్చేకంటే పెద్ద మొత్తంలో రుణాలు ఇస్తే, వసూళ్లకు గ్యారెంటీ ఉంటుందని భావిస్తున్నారు. జాతీయ బ్యాంకులైతే సవాలక్ష కొర్రీలు పెట్టి, 1 బీహెచ్‌కే దరఖాస్తుల్ని తిరస్కరిస్తున్నాయి. దీనితో ప్రయివేటు బ్యాంకులు, ప్రయివేటు ఫైనాన్షియర్లు 1 బీహెచ్‌కే ఇండ్లకు రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. వీరి వద్ద వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో వినియోగదారులు అడుగు వెనక్కి వేస్తున్నారు. జాతీయ బ్యాంకులు సహకరిస్తే అఫర్డబుల్ హౌసెస్‌కు భారీ సంఖ్యలో డిమాండ్ పెరగడం ఖాయం.
తొలిసారి ఇల్లు కొనేవారి ముందున్న ప్రశ్న
ఎంఆర్‌జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రజ్జత్ గోయల్ ఈ అంశంపై స్పందిస్తూ .. తొలిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు కేవలం చిన్న ఇల్లు దొరికిందా లేదా
అనే దానికే పరిమితం కావడం లేదు. రాబోయే సంవత్సరాల్లో తమ కుటుంబ అవసరాలకు ఆ ఇల్లు సరిపోతుందా
అని కూడా ఆలోచిస్తున్నారు. పిల్లలు పుట్టడం, తల్లిదండ్రులు తమతో నివసించడం, ఇంటి నుంచే పనిచేయడం వంటి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొందరు కొనుగోలుదారులు పెద్ద ఇండ్ల కోసం అదనపు మొత్తాన్ని ఖర్చు చేయడానికి సిద్ధపడుతున్నారు.
పెరుగుతున్న ఒత్తిడి
1 బీహెచ్‌కే ఇండ్ల సమస్యను నిర్మాణ సంస్థల వ్యాపార నిర్ణయంగా మాత్రమే చూడలేం. దేశంలో అందుబాటు గృహాల రంగం ఎదుర్కొంటున్న విస్తృత సమస్యలతోనూ ఇది ముడిపడి ఉంది. దీనిపై అనరాక్ గ్రూప్ వైస్ చైర్మెన్ సంతోశ్ కుమార్ స్పందిస్తూ .. ‘‘రూ.40 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాల విభాగంలో డిమాండ్, సరఫరా రెండూ తగ్గుముఖం పట్టాయి. పెరుగుతున్న భూమి, నిర్మాణ, నియంత్రణ వ్యయాలు డెవలపర్లను అధిక ధరల గృహ ప్రాజెక్టుల వైపు మళ్లిస్తున్నాయి. అందుబాటు గృహ ప్రాజెక్టుల్లో లాభాల మార్జిన్ సాధారణంగా 10–12 శాతం ఉండగా,ప్రీమియం గృహాల్లో అది 25–30 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది’’ అని వివరించారు. అధిక ఆదాయ వర్గాలకు చెందిన కొనుగోలుదారుల నుంచి ప్రీమియం ఇండ్లకు డిమాండ్ పెరగడం, నిర్మాణ సంస్థలు అధిక లాభాలను ఆశించడం వంటి కారణాలతో తక్కువ ధరల ఇండ్లు నిర్లక్ష్యానికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌లో తక్కువ ధరకు లభించే 1 బీహెచ్‌కే ఇండ్లు మరింత అరుదుగా మారుతున్నాయి.



