ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్ల జ్యోతి శంకరయ్య
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రపంచ సమాజంలో సమానత్వం, న్యాయం, అభివృద్ధి అనే విలువలకు పునాది వేస్తున్నది మహిళా శక్తి. ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే జాతీయ మహిళా దినోత్సవం మహిళల విజయాలను గౌరవించు కోవడమే కాకుండా, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను సమాజం ముందుంచే ఒక ఆత్మపరిశీలన రోజు మార్చి 8 ఆదివారం.
భారతదేశం వంటి వైవిధ్యభరిత దేశంలో మహిళలు విద్య, ఆరోగ్యం, ఉపాధి, రాజకీయాలు,శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష పురోగతి సాధించినప్పటికీ, ఇంకా ఎన్నో సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారి జీవనస్థితి కొంత మెరుగుపడుతున్నప్పటికీ అసమానతలు పూర్తిగా తొలగిపోలేదు.ఈ సందర్భంలో మహిళల సమస్యలు,సాధికారతకు దోహదపడే అంశాల గురించి సమగ్రంగా విశ్లేషించుకోవడం అత్యవసరమైంది. భారతీయ సమాజంలో మహిళలపై ఉన్న సాంప్రదాయ భావజాలం ఇప్పటికీ పూర్తిగా మారలేదు.
కుటుంబంలో నిర్ణయాధికారంలో మహిళల పాత్ర తగ్గిపోవడం,ఆడపిల్లలపై చిన్నచూపు, బాల్య వివాహాలు వంటి సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కనిపిస్తున్నాయి.”అమ్మాయికి చదువు అవసరమా?” అనే ప్రశ్న కొన్నిచోట్ల ఇంకా వినిపించడం బాధాకరం.మన రాష్ట్రంలో కూడా పట్టణ ప్రాంతాల్లో విద్యా అవకాశాలు పెరిగినా, గ్రామీణ ప్రాంతాల్లో బాలికల విద్య మధ్యలోనే ఆగిపోవడం ఒక పెద్ద సవాలు.విద్యలో అసమానతల్ని చూస్తే ఇటీవలి కాలంలో బాలికల అక్షరాస్యత పెరిగినప్పటికీ,ఉన్నత విద్యలో మహిళల శాతం ఇంకా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఇంజనీరింగ్, సాంకేతిక రంగాల్లో మహిళల పార్టిసిపేషన్ పరిమితంగానే ఉంది. పేదరికం, కుటుంబ బాధ్యతలు, భద్రత సమస్యలు బాలికల చదువుకు అడ్డంకులుగా మారుతున్నాయి.
ఉపాధి, ఆర్థిక స్వావలంబనలో కూడా లోపం కనపడుతోంది. ఉద్యోగ రంగంలో మహిళలు పెద్ద ఎత్తున చేరుతున్నప్పటికీ, వేతన అసమానత, ఉద్యోగ భద్రత లేకపోవడం, ప్రసూతి సదుపాయాల కొరత వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. అనేక మహిళలు అసంఘటిత రంగంలో పనిచేస్తూ సరైన గుర్తింపు, భద్రత లేకుండా జీవిస్తున్నారు.ఇంటి పనులు, పిల్లల సంరక్షణ వంటి బాధ్యతల వల్ల ఉద్యోగ అవకాశాలు వదులుకోవాల్సిన పరిస్థితి అనేక మహిళలకు ఎదురవుతోంది. రోజురోజుకూ హింస, వేధింపులు, సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. రాత్రి సమయంలో మహిళలు స్వేచ్ఛగా బయటికి వెళ్లలేని పరిస్థితి సమాజ అభివృద్ధికి అడ్డంకిగా చెప్పక తప్పని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణుల ఆరోగ్యం, పోషణ లోపం, వైద్య సదుపాయాల కొరత పెద్ద సమస్యగా ఉంది. తక్కువ బరువు, రక్తహీనత వంటి సమస్యలు మహిళల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అలాగే చిన్న వయసులో వివాహాలు, ఉపాధి అవకాశాల కొరత కనిపిస్తున్నాయి.
మహిళకు బలమైన ఆయుధం విద్య. అది సాధికారతకు మొదటి మెట్టు. చదువుకున్న మహిళ కుటుంబాన్ని, సమాజాన్ని, దేశాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది. డిజిటల్ విద్య, నైపుణ్యాభివృద్ధి, ఉన్నత విద్యలో అవకాశాలు పెంచడం ద్వారా మహిళల స్థానం మరింత మెరుగుపడుతుంది. ఆర్థిక స్వావలంబన, స్వయం ఉపాధి, స్టార్టప్‌లు, నైపుణ్య శిక్షణ ద్వారా మహిళలు ఆర్థికంగా బలపడతారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు ఉన్నా వాటిపై అవగాహన లేకపోవడం వల్ల వాటి ప్రయోజనం పూర్తిగా అందడం లేదు.
ఇందులో లీగల్ అవగాహన, హెల్ప్‌లైన్ సేవలు, మహిళా పోలీస్‌స్టేషన్లు కీలక పాత్రగా ఉంటాయి. డిజిటల్ ప్రపంచంలో మహిళల భాగస్వామ్యం పెరగడం సాధికారతకు కీలకమైన అంశం. ఆన్‌లైన్ విద్య, డిజిటల్ బ్యాంకింగ్, ఇ-కామర్స్ ద్వారా మహిళలు ఇంటినుంచే ఉపాధి పొందడం సానుకూలత. సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమే. సాధారణ పరిస్థితుల నుంచి అసాధారణ విజయాలు సాధించవచ్చు.
సమాజం విధించే అడ్డంకులను అధిగమించడానికి స్వీయ విశ్వాసం ఉండాలి. కుటుంబం – ఆడపిల్లలకు సమాన విద్య, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, నిర్ణయాల్లో భాగస్వామ్యం తీసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. సమాజం- లింగ వివక్ష నిర్మూలన, మహిళల ప్రతిభను ప్రోత్సహించడం వంటివి చేయాలి. ప్రభుత్వం – విద్యా పథకాలు, మహిళా రక్షణ చట్టాలు, స్వయం ఉపాధి ప్రోత్సాహలు కల్పించడం ప్రధానం.
మహిళలు విద్య, ఉపాధి, నాయకత్వ రంగాల్లో ముందుకొస్తున్న ఈ కాలంలో సమాజం కూడా మారాల్సిన అవసరం ఉంది. డిజిటల్ యుగంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే దేశ అభివృద్ధి వేగవంతమవుతుంది. ”మహిళా సాధికారత అంటే మహిళలకు సహాయం చేయడం కాదు; వారికి అవకాశాలు కల్పించడం”అనే భావనను సమాజం అర్థం చేసుకోవాలి.
జాతీయ మహిళా దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు, సమాజం తన బాధ్యతను గుర్తుచేసుకునే రోజు. మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను తగ్గించి, విద్య, భద్రత, ఉపాధి అవకాశాలు పెంచితేనే నిజమైన సాధికారత సాధ్యం. అందుకే, ఈ జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబం, ప్రతి విద్యాసంస్థ, ప్రతి ప్రభుత్వం ఒక సంకల్పానికి పూనుకోవాలి. ”మహిళా సాధికారతే సమగ్ర అభివృద్ధి పునాది”. మహిళల సత్తాను గుర్తించి, సమాన అవకాశాలు కల్పించి, భద్రత కలిగిన వాతావరణాన్ని నిర్మించడం ద్వారా మాత్రమే భారతదేశం నిజమైన అభివృద్ధి దేశంగా అవతరిస్తుంది. మహిళా శక్తి వికసిస్తే, భారత భవిష్యత్తు ప్రకాశవంతమవుతుంది.అని ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ వ్యవస్థాపకులు లింగమల్ల జ్యోతి శంకరయ్య టీచర్స్ తెలిపారు.



