క్వార్టర్ఫైనల్లో
అలవోక విజయం
యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్
న్యూయార్క్ (యుఎస్ఏ) : యుఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో నెదర్లాండ్స్ ఆటగాడు బొటిక్ వాన్ డిపై వరుస సెట్లలో అలెగ్జాండర్ జ్వెరెవ్ విజయం సాధించాడు. 6-2, 7-5, 6-1తో జ్వెరెవ్ దూకుడుగా ఆడాడు. ఎనిమిది ఏస్‌లు, ఆరు బ్రేక్ పాయింట్లతో డచ్ ఆటగాడిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. పాయింట్ల పరంగా 94-71తో పైచేయి సాధించిన జ్వెరెవ్.. 19 గేములు గెల్చుకున్నాడు. బొటిక్ సైతం ఎనిమిది గేములు గెలుపొంది ఆకట్టుకున్నాడు. జ్వెరెవ్ సర్వ్‌ను బ్రేక్ చేయటంలో విఫలమైన బొటిక్.. రెండో సెట్లో హోరాహోరీగా పోటీపడ్డాడు. సర్వ్ బ్రేక్ చేయలేక రెండో సెట్లో వెనక్కి తగ్గాడు. మరో క్వార్టర్ఫైనల్లో కరెన్ కచనోవ్ (రష్యా) పైచేయి సాధించాడు. 28వ సీడ్ అలెగ్జాండర్ బ్లాక్‌పై కరెన్ 6-2, 7-5, 3-2తో ముందంజలో ఉండగా.. బెల్జియం ఆటగాడు ఫిట్నెస్ సమస్యతో పోటీ నుంచి తప్పుకున్నాడు. దీంతో కరెన్‌కు వాకోవర్ లభించింది. రష్యా స్టార్ మెద్వదేవ్ నిరాశపరిచినా.. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన కరెన్ అద్భుత ఆటతీరుతో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో అలెగ్జాండర్ జ్వెరెవ్‌తో కరెన్ పోటీపడనుండగా.. అమెరికా ఆటగాళ్లు తియోఫో, బెన్ షెల్టన్లు మరో సెమీస్‌లో ఢీకొట్టనున్నారు. మహిళల సింగిల్స్‌లో నేడు ఉదయం 5 గంటలకు ఆరంభం కానున్న సెమీఫైనల్స్‌లో టాప్ సీడ్ అరినా సబలెంక, జెస్సికా పెగులా ఢీకొట్టనుండగా.. కొకొ గాఫ్‌తో ఎలెనా రిబకినా తలపడనుంది.



